పురాణేతిహాసములు శ్రీమహాభారతము శల్యపర్వము - ప్రథమాశ్వాసము
విరథుఁడయిన శల్యుని నశ్వత్థామ దన రథముపై నిడుకొని పోవుట (సం. 9-15-65)
ఉ. తోడనె తేరి వాహములఁ ద్రుంచి మదంబున సూతుప్రాణముల్‌
క్రీడయ పోలెఁ బుచ్చికొని కేతువుఁ గూల్చిన సేన విచ్చెఁ జే
యాడకయున్న శల్యుని రయంబున నాత్మరథస్థుఁ జేసి పె
న్గీడునఁ బొందకుండఁ దొలఁగించెను ద్రోణసుతుండు భూవరా!
253
వ. ఇట్లు శల్యుండు సమరవైకల్యంబు నొందుటయు ధర్మనందనుం డార్చి పేర్చి తద్బలంబుఁ దఱిమె నంత నమ్మద్రపతి యొండు రథంబు గల్పించుకొని కడంగి యా కౌంతేయాగ్రజుపైఁ గంకపత్త్రంబులు నిగిడించుచు నిగిడినం గని యద్దెసఁ జేయఁ గల సైనికోత్తములు సరభసంబున నయ్యోధవరు నెదుర్కొని రప్పు డతఁడు సాత్యకిఁ బదిసాయకంబులను భీమసేననకులసహదేవుల శరత్రయంబులను స్రుక్కించి యెక్కుడు మదంబునం బొదలిన యంగంబులతో నలిరేఁగి మఱియు నప్పుడు పొగడం దగియుండె నాకర్ణింపుము. 254
సీ. కమలాకరములీలఁ గలఁచి యాడెడు గంధ | దంతావళము సముద్దండతయును
దరమిడి మృగసముత్కరము ఘోరంబుగా | వధియించు కంఠీరవంబు నేపు
నీరసారణ్యంబు నిర్భరాటోపతఁ | గాల్చు దావాగ్ని యుగ్రక్రమంబు
ప్రకటవిక్రాంతిఁ బురత్రయంబును సమ | యించు ఫాలాక్షుని యేడ్తెఱయును
 
తే. బోల్పఁ బట్టులయ్యె భుజగర్వశౌర్య ప్ర | తాపదుర్దమప్రకోపములకు
మద్రవిభుఁడు గోలుమసఁగి శాత్రవసైన్య | హననకేళి సలుపు నవసరమున.
255
వ. ధర్మనందనుం దలమిగిలిన చతురంగంబుల నివ్విధంబున వినిహతంబులు సేసి యమ్మహీపతిపైఁ గవిసినం గని కవలును శైనేయుండును భీమసేనుండును దోడ నడవ నతం డమ్మేటిమగని మార్కొని పటుమార్గణంబు లురంబున నించి నొంచె నప్పుడు కురువిభుండు వనుప మనసైనికులు దలమిగిలి శల్యునికిఁ బ్రాపయి యప్పవనతనయప్రభృతులతోడఁ బెనంగి రతం డాపాండవాగ్రజుమేనఁ జండకాండసప్తకంబు నినిచిన నజ్జననాథుండు నవనిశితనారాచంబు లవ్వీరు నంగంబుల నాటించె. నిట్లు దలపడి కోలుపులుల పోలికఁ బేరేనుంగుల తెఱంగున బలుసింగంబులు చందంబునం బోరి యొండొరుల నొప్పించి రప్పుడు. 256
సీ. శల్యుండు బలునారసము పాండవాగ్రజు | నురమున నాట నత్యుగ్రదీప్త
ఘోరనారాచ మా కుంతీసుతుం డేయ | నతఁడు మూర్ఛిల్లిన నలరె నధిపుఁ
డమ్మద్రపతి తేఱి యలుకఁ గెంపారెడు | కనుఁగవతోఁ జండకాండ మొకట
నయ్యుధిష్ఠిరు నొంప నాతండు పసిఁడి మై | మఱు వాఱుతూపుల నఱికి వైచి
 
తే. వాలురమ్ములు దొమ్మిది వక్షమున ని | గుడ్ప నయ్యోధవరుఁ డతిక్రూరభల్ల
యుగళఖండితచాపుఁ జేయుడును నొండు | ధనువు గొని యవ్విభుండు దత్తనువు నించె.
257
క. బాసటయై భీముఁడు పె | ల్లేసెను మద్రపతి నాతఁ డిరువురతోడం
జేసెం గయ్యము గృపును | ద్భాసిత విక్రమముతోడుపాటు గలుగఁగన్‌.
258
వ. అట్టియెడం గంకటాంతరంబు ధరియించి కడంగి. 259
ఆ. మద్రవిభుఁడు ధర్మమారుతసుతుల మై | మఱువు లుఱక నఱికి మార్గణములు
దొమ్మిదింట రెంటఁ దూఁటులు సేసె దో | ర్దండములు ప్రదీప్తదర్పుఁ డగుచు.
260
క. ఆలో ధర్మజు సారథిఁ | గూలఁగఁ గృపుఁ డేయ మద్రకుంజరుఁడు భుజా
లీల మెఱయంగ హయము | ల్నాలుగు నొకవ్రేల్మిడిని నిలం బడవైచెన్‌.
261
వ. ఇవ్విధంబున విరథుండై యమ్మహీకాంతుం డంతర్గతంబున. 262
క. గెలువుము శల్యుని నీ వని | పలికి ముకుందుండు నన్నుఁ బనిచినవాఁ డ
ప్పలుకులకు నసత్యత్వము | గలుగఁగ నేర్చు నొకొ! దైవఘటనబలమునన్‌.
263
వ. అని శంకించియుఁ గొంకుపోవక యజ్జగన్నాథు వచనంబునకు నన్యథాత్వం బేల గలుగునని యద్దేవునిం దలంచి యామాట యమోఘంబు గావలయునని ప్రార్థించి వెండియు. 264
చ. ‘స్ఫురితషడర్ధనేత్రునిఁ ద్రిశూలసముజ్జ్వలు నిర్గుణున్‌ గుణా
దర సముపాత్తమూర్తిఁ గలితప్రభవస్థితిసంహృతిక్రియా
నిరతివివర్తితత్రిభువనీమహనీయుని దైత్యమర్ది న
ప్పురుషవరుం జతుర్భుజు విభుత్వమహోన్నతు నాశ్రయించెదన్‌.
265
తే. భండనము సేయు నరునగ్రభాగమునఁ బ్ర | చండ శూలోగ్రహస్తుఁడై శత్రుకోటి
గీటడంచుచు నేఁ జూఁడఁ గేలి సలుపు | దేవు జయసిద్ధికై సన్నుతింతు భక్తి.’
266
వ. అనుచుఁ బురుషోత్తమునిఁ జిత్తమున నిలిపి యున్నతంబైన పూర్వకాయంబుతో మందప్రకారంబున మార్గణంబు లమ్మద్రపతి దెస నిగిడింప నతఁ డవి బెండువడుటగాఁ దలంచి తఱిమి యఱిముఱి శరంబులు గురియుటయు నప్పుడు. 267
చ. పవనసుతుండు విల్‌నఱికి బాణయుగంబున మేనునొంచి శా
త్రవులు దలంక నారథికురథ్యములన్‌ ధరఁ గూల్చి సూతు కం
ఠవిదళనం బొనర్చి ప్రకటస్ఫురణంబునఁ గంటకంబు భ
ల్ల వితతి ఘోరసంహతి నిలం బడనేసె రయం బెలర్పఁగన్‌.
268
వ. ఇవ్విధంబున. 269
క. విరథుండు నచాపుఁడు వ | ర్మరహితగాత్రుండు నైన మద్రవిభుఁడు భా
సురఖడ్గచర్మశోభిత | కరుఁడై తేరుడిగి కన్నుఁగవఁ గెంపారన్‌.
270
మ. జముచందంబున నేచి ధర్మసుతుపై సంరంభదుర్దాంతద
ర్పమునన్‌ వే కలియంగఁ జండబలదుర్వారుండు భీముండు ద్రుం
చె మదంబారఁగ వాలునున్‌ బలకయున్‌ శీఘ్రత్వ సందీప్తుఁడై
తమది క్కార్పులుఁ దూర్యనాదములు నత్యంతంబు శోభిల్లఁగన్‌.
271
వ. అమ్మద్రపతి నేర్పును జేవయుం గల పరిజనంబులు చేర్పఁ గంకటగదాదండంబులు ధరియించి యుధిష్ఠిరుమీఁద నరువడి నడరె నప్పు డప్పాండవాగ్రజునకు బాసటయై సాత్యకిధృష్టద్యుమ్న శిఖండి ద్రౌపదేయమాద్రేయు లేయు సాయకంబులు సరకుగొనక గదం జిత్రంబుగా జడియుచు వడముడి విక్రమంబునఁ దవులంబడక నిగిడె నశ్వసూత రహితంబగు రథంబుపై నున్న యన్నరేంద్రుండు తన దెసకు సింహచంక్రమణత్వసుందరుండై వచ్చు నవ్వీరు నాలోకించి నక్రోధంబైన యవష్టంభంబున నుద్దీపితుండై. 272
క. ‘ఇతని సమయింప నయ్య | చ్యుతుఁడు ననుం బనిచె నాకు నొనరించిన పా
లితఁ’ డని తలంచి మొగ ము | గ్రత నొందఁగ శక్తిమీఁదఁ గనుదో యొలయన్‌.
273
వ. హృషీకేశు నుద్దేశించి. 274
ఉ. ‘నీదెస నాదుచిత్తమున నెక్కొని యుండెడి భక్తి భద్రసం
పాదిని గావు టచ్చెరువె! భక్తజనాభిమతప్రదానవి
ద్యాదయితత్వమేర్పడ జయం బొడఁగూర్పుము దేవ! సంశ్రితాం
హోదళనంబు నీకు వ్రత ముల్లము నాపయి నిల్పు మిత్తఱిన్‌.’
275
వ. అని హృదయంబునఁ బ్రార్థించి యప్పార్థివోత్తముండు. 276
ఉ. అచ్చపు భక్తికిన్‌ మదిఁ బ్రియంబున నొందిన ఫాలలోచనుం
డిచ్చిన ప్రీతియోగమును నెక్కుడు భక్తియు నావహిల్లఁగా
నిచ్చలు గంధపుష్పములు నిష్ఠమెయిం బరిశోభితార్చనం
బిచ్చుచుఁ దాను గొల్వ నుతి కెక్కిన యమ్మహనీయశక్తికిన్‌.
277
మ. ప్రణతుండై రభసోదయాభినవదర్పస్ఫూర్తి శోభిల్లుచు
న్మణిదండద్యుతిమంజరీస్ఫురణము న్సంశోభిఘంటాపటు
క్వణనంబున్‌ రిపుసైనికప్రకరదృక్కర్ణవ్యథం జేయ భీ
షణరేఖంబగు దానిఁ బుచ్చుకొని చంచన్ముష్టిదృష్ట్యుద్ధతిన్‌.
278
వ. అభిరామభీమాకారుండై. 279
తే. నెరయుకినుకఁ బెన్వెడఁదయై నిప్పు లురులు | కన్నుఁగవ శల్యుఁ జూచిన నున్నయునికి
నతఁడు నీఱు గాకుండుట యరిది యయ్యె | మాకుఁ జూడంగ నప్పుడు మనుజనాథ!
280
వ. ఇట్లు రౌద్రోద్రేకంబునఁ బురత్రయ దాహదోహలియగు శూలాయుధు లీల దోఁప దుర్నిరీక్షుండై. 281
ఉ. ఘోరతర ప్రకారమగు కుంచితబాహువిలాస మొప్ప వి
స్తారము వింతయౌనురము సారతరంబుగఁ జూచి వజ్రధా
రారుచి సన్నిభప్రచురరశ్ములు పర్వఁగ బిట్టువైచె న
ద్దారుణశక్తి నవ్విభుఁ డుదాత్తసమిత్కృతికల్యు శల్యునిన్‌.
282
తే. అట్లు పాండుభూపాలకు నగ్రసుతుఁడు | మద్రనాథుని వైచిన రౌద్రమెసఁగ
గంకటముదూఱి వక్షంబు గడచి వెన్ను | వెడలిచని యమ్మహాశక్తి పుడమిఁ జొచ్చె.
283
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )