పురాణేతిహాసములు శ్రీమహాభారతము శల్యపర్వము - ద్వితీయాశ్వాసము
దుర్యోధనుఁడు ద్వైపాయనంబను మడుఁగున డాఁగియుండుట (సం. 9-28-51)
క. ఇమ్మడువులోన డాఁగెద; | నిమ్ముల నెచ్చటికినైన నేఁగెదఁ; దగు వృ
త్తమ్మునఁ దొలఁగి నిలిచి మఱి | యెమ్మెయినేనియును దీర్తు నేఁ బగయ సుమీ!’
15
వ. అని చెప్పి యమ్మడువు సొచ్చి మాయావిశేషంబున జలంబులు శరీరంబు సోఁకకుండ సంస్తంభనంబు సేసికొని యుండె; నంత రథ్యంబులు పరిశ్రాంతినొంది తూఁగాడ నస్త్రశస్త్రాదిక్షతంబు లగు నవయవంబులతోడ రాజదర్శన విషణ్ణులగుచుఁ గృపకృతవర్మాశ్వత్థామ లచ్చట మెలంగి దబ్బాటుగా నన్నుం గని ‘సంజయా! బ్రదికితే?’ యని పలికి ‘కురుపతి ప్రాణంబులం గలఁడే?’ యని యడిగిన నజ్జననాథుఁ డొక్కండును బాఱుతెంచి నీరిలో డాఁగియున్న తెఱం గెఱింగించి యా హ్రదంబు సూపి యే మిరువురము నొండొరులతో నాడినమాటలు దేటపడం జెప్పిన వార లత్యంత విషాదంబు నొంది. 16
చ. ‘నరవరుఁ డేము సంగరమునం బడకున్కి యెఱుంగఁ డక్కటా!
బరవస మేది వచ్చెఁ బిదపన్‌ వినియున్‌ మముఁ గూర్చికోలు దు
స్తర మనుబుద్ధి నిప్పటికి శత్రుల కన్మొఱఁగం దలంచి యీ
వెరవున డాఁగె; సర్వపృథివీపతి దుర్దశ నిట్లు పొందునే?
17
వ. అవ్విభుండు పెనుఁబ్రాపై నిలిచిన నేము పగతురతోడం బెనంగంజాలుదు మను సమయంబున విజయవిజృంభితు లగు పాండవులు సబలంబుగా నచ్చేరువ నడతెంచిన నా రథికులు దా రచ్చోట నిలుచుట కార్యంబు గా దని తలంచి ననుఁ గృపాచార్యు రథంబు మీఁద నిడికొని మనశిబిరంబున కరిగి; రందు. 18
చ. కలగొనఁ బాఱుచున్‌ సతులు గన్నుల నశ్రుజలంబు లొల్క వీఁ
పులపయి పెన్నెఱుల్‌ విరియఁ బొడ్మఁగ లాలలు రోదనధ్వనుల్‌
సెలఁగఁగ మోములుం దలలుఁ జేతులుఁ గెంపుగ మోఁదికొంచు భ
ర్తల సహజన్ములన్‌ సుతులఁ దండ్రులఁ బేర్కొని యార్తి నొందుచున్‌.
19
వ. హతశేషు లైన పతాకాతపత్రచామరభృదాది జనంబులవలన సకలజనసంక్షయంబు వినుచు నేలంబడి పొరలుచు లేచుచునికి యత్యంతకరుణంబై యుండె; నప్పుడు మాన్యవనితాజనంబులకావలివారునుం గడంగి వారలం దగిన వాహనంబులపై నిడికొని యిక్కడకు వచ్చిరి; తక్కినభీతజనంబులు పలుదెసలం బాఱి; రట్టియెడ నీ కొడుకు యుయుత్సుండు శోకసంతప్తచిత్తుండై. 20
శా. ‘గంగానందనుఁ డాదిగాఁగఁ గురుసంఘం బెల్ల సంగ్రామధా
త్రిం గూలెం; బతియొక్కరుండు పటు కౌంతేయప్రతాపంబు పే
ర్మిం గీడ్పాటున కోర్చి పాఱె; విధి నామేఁ బ్రాణముల్‌ నిల్పె; నా
కుం గాంతాజనులం దగంగఁ బురికిం గొంచేఁగు టర్హం బగున్‌.
21
వ. ఏకాదశాక్షౌహిణీ భర్త మన్నించు మానవతులు గాసి యగుదురే?’ యని మనంబునం దలపోసి రథంబు డిగి యత్తెఱంగు శౌరికి నజాతశత్రునకు నెఱింగించిన నప్పాండవాగ్రజుండు పరమకృపాపరుండు గావునఁ బ్రీతుం డై శౌరియాననం బాలోకించి ‘యది మేల కాదె?’ యని పలికి, యతం డనుమతి సేయ నవ్వైశ్యాపుత్రుఁ బరిరంభణంబు సేసి ‘లెస్స తలంపు తలంచి’ తని సంభావించి వీడుకొలిపిన, నతండు రథారూఢుం డై రథ్యంబులఁ ద్వరితగతి నడపి భూపతి ప్రేయసీజనంబుల కధ్యక్షు లగువృద్ధకంచుకులం గలసి వారును దానును వారల నుచితప్రకారంబులఁ దేర్చి పురంబు ప్రవేశించునప్పుడెదుర విదురుం గాంచి. 22
చ. అతఁ డడుగంగ శల్యసుబలాత్మజులుం బలమంతయున్‌ రణ
క్షితిఁ బడు టేర్పడం బలికి, చెప్పెఁ దురంగము డిగ్గి మేదినీ
పతి యొకరుండు పాఱుటయుఁ బాండవముఖ్యుఁడు ప్రీతిఁ బంపఁగా
నతివల నిల్లు సేర్చుటకు నై యిట రాకయు మానవేశ్వరా!
23
వ. అనిన విని యతండు శోకవ్యాకులుం డగుచు నవ్వైశ్యాపుత్రుం బొగడి కాలోచితకృత్యం బాచరించి ‘లెస్సచేసి’ తని పలికి మఱియు నిట్లనియె. 24
తే. ‘ఎప్పుడును సంజయుఁడు వచ్చి యెఱుఁగఁ జెప్పుఁ | బతికి సమరవిశేషంబు లతఁడు నేఁటి
తెఱఁగు చెప్పెడిఁ గాక యేతెంచి మున్న | మనము వినిపింపఁ గాఁ దగ దనఘ! దీని.
25
వ. ‘ఒండు ముఖంబున నివ్వార్త నగరు సొరకుండునట్లుగా సంవిధానంబు సేయవలయు; నీవు దుర్యోధను ప్రియాజనంబులను దద్రక్షకులను దోడ్కొని భవదీయమందిరంబునకుం జనుము; తక్కటివారి నంతంత నడఁకువతో నిలువ నియమింపవలయు’ నని పలికి తానును యుయుత్సుండును సావధానప్రయత్నంబున నవ్విధానంబు సంఘటించి, నీ తమ్ముండు పెద్దమొగసాలం జాలుమానుసులం గావలివెట్టి, యభ్యంతరంబు ప్రవేశించి యుండె; నక్కడఁ గౌరవసేనాసన్నివేశం బత్యంతవిరళజనం బయ్యె; మున్ను మాతంగతురంగసుభట బృంహిత హేషిత భాషణంబులవలన శబ్దాంతరంబు కర్ణగోచరంబు గానియట్టి యా శిబిరంబు నిశ్శబ్దం బయి యుండె ననిన విని యాంబికేయుం డిట్లనియె. 26
క. ‘సూతసుత! యిట్లు పగతుర | చేత మనబలంబు రాజసింహులు బంధు
వ్రాతమ్మును సమసినఁ దుది | నే తెఱఁగున నడచితిరి? నరేంద్రుఁడు మీరున్‌?’
27
వ. అనుటయు నమ్మహీకాంతునకు సంజయుం డిట్లనియె ‘నంత నయ్యెడకుఁ గౌంతేయులు సైన్యంబును దారును సుయోధనాన్వేషణపరు లయి రయంబున నరుగుదెంచు కలకలంబు వీతెంచిన. 28
క. కృతవర్మయుఁ గృపుఁడును గురు | సుతుఁడును గనుఁగొనుచు నొండుచోటికిఁ జని; ర
ట్లతిరభసంబునఁ గుంతీ | సుతు లచటికి వచ్చి నీదుసుతుఁ బలుగడలన్‌.
29
వ. అన్వేషించి కానమికి విషాదంబు నొందుచు మరలి చనిరి; చనునప్పు డజాతశత్రుండు నీ పుత్రునగరిలోని జనంబులఁ గృపతోడం గనుంగొని ‘వెఱవకుండుఁ’ డని పలికి చనియె; నట్లు వారు నిజశిబిరంబునకుం జనుటయు, మనయోధవరులు నేను మనంబున నడలు గదుర నమ్మడువుకడకుం బోయితిమి; కృపాదు లగు మువ్వురు దమరాక యెఱింగించి యమ్మనుజపతి కి ట్లనిరి. 30
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )