| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శల్యపర్వము - ద్వితీయాశ్వాసము |
| సీ. |
కడుబెట్టిదం బగు గాలిచేఁ గూలిన | మహనీయసాలభూరుహము పోల్కిఁ, బ్రబలకిరాతమార్గణములఁ ద్రెళ్ళిన | రాజితవన్యవారణము మాడ్కిఁ, గల్పాంత వాయుసఖస్ఫురణంబున | నివిరి పోయిన మహార్ణవము కరణిఁ, గాలపర్యయమునఁ దూలి మేదినిమీఁదఁ | బడిన పూర్ణేందు బింబంబు పగిది. |
|
| తే. |
దుఃస్థుఁ డై యుండియును నొప్పు దొరుఁగకున్న | యన్న రేశ్వరుఁ గనుఁగొని యడలు నెడల తోడ మేనులు దూలఁగఁ దొట్రుపడుచుఁ | జేరి యాతని చుట్టు వాసీను లైరి. |
399 |
| వ. | ఆసీనులైన యెడ నగ్గురుసుతుండు. | 400 |
| ఉ. |
‘అక్కట! యెప్డుఁ బల్వురు ధరాధిపతుల్ గొలువంగ నుండు నీ వొక్కరుఁ డున్నవాఁడవు; మహోన్నతపీఠ మలంకరించు నిన్ దెక్కలిఁ దాఁకి ధాత యిలఁ ద్రెళ్ళెడునట్లుగఁ జేసె; నీబలం బెక్కడఁ బోయె? సైన్యపతు లేరొకొ యిక్కడ రారు? భూవరా! |
401 |
| తే. |
కడలుకొనఁ జుట్టుఁ బట్టెడు గొడుగు లెవ్వి? | యెసక మెసఁగంగ సీవురు లేల పట్ట రంగమున? నాననంబున నవని ధూళి | గదిరె; జలక మే లాడవు కౌరవేంద్ర? |
402 |
| చ. |
అనిమిషవాహినీ తనయుఁ డస్త్ర గురుండును నీకు నెప్పుడుం గనువెలుఁ గై చరింతురు వికర్ణుఁడు దుస్ససేనుఁడున్; నిను నొకయప్డుఁ బాయ రవినీతు లొకో నృప! వార లెల్ల నె మ్మనమున శంక లేక యొకమాటును నిక్కడఁ జేర రెవ్వరున్. |
403 |
| క. |
నీయెడఁ జంచల యయ్యెను | శ్రీ యెవ్వరి నచలనృత్తిఁ జెందెడు విధి య ట్లై యున్నవారి నిట్టులు | సేయఁడె? యే నింక నేమి సేయుదు నధిపా! |
404 |
| తే. |
అని విలాపంబు సేసిన విని విభుండు | గన్నుఁగవ నశ్రు లురలంగఁ గరపుటములఁ దుడిచికొనుచు డగ్గుత్తి దొడరు నెలుఁగు | నెట్టకేలకు నూల్కొల్పి యిట్టు లనియె. |
405 |
| క. |
‘మనుజులకు నిట్టిచందము | మును ధాత సృజించినది; ప్రమోదము ఖేదం బున వచ్చును బర్యాయం | బున; దీని నెఱుంగవలదె పురుషుం డనఘా!;’ |
406 |
| వ. | అని యారథికవరుల నాలోకించి. | 407 |
| సీ. |
‘పయిపయి నెంత లాపదలు వచ్చిన నైన | నుత్సాహ మెడలక యుద్ధ మరులు సేడ్పడునట్లుగాఁ జేసెడి బంధులు | మిత్రులు సోదరుల్ పుత్రులట్లు బలసమేతంబు భండనంబునఁ ద్రుంగ | నొక్కఁడు నిల్చుట యొప్పు నెట్లు? మద్బాహువీర్యంబు మహిత ధైర్యంబును | దలమున్కలైన సధర్మవృత్తి |
|
| తే. |
సంగరంబు సేయఁ జాలక శత్రు లిట్లు | నొంప సద్గతి వడయుట సొంపు గాదె యదియుఁ గాక విద్విషులచే నాజిఁ బడక | యుండ మిముఁ గాంచునమ్మేలు నొదవె నాకు. |
408 |
| చ. |
వినుఁడు మహానుభావుఁ డగు విష్ణు నెఱింగి యెఱింగి యే మిముం గొని వెఱ పేది కాదె పగకుం దలకొంట; జయంబు గోరి మీ రును బలశౌర్య సంపదనురూపముగాఁ బొగడొందు భంగులం బెనఁగితి; రేమి సేయుదురు బెట్టిదుఁ డై విధి తప్పఁ జూచినన్? |
409 |
| వ. | వగవ కుండుం’ డని యేఁ బొదలోనం బొంచి యున్నది మొదలుగ గదాయుద్ధంబు పొడి విడిచి వడముడి పుడమిఱేనిం బడవైచి తలదన్నుట తుదిగా నైన వృత్తాంతం బెల్ల నప్పు డారథికవరులకుఁ దేటపడం బలికిన విని పాండవుల దెస నీసును రోసంబు నెత్తి గురునందనుం డరుణాననుం డగుచు నవుడు గఱచి కఠినాక్షరకలితంబు గా నక్కౌరవేశ్వరున కి ట్లనియె. | 410 |
| ఉ. |
‘పాండవ లట్లు మజ్జనకుఁ బాపవిధిఁ దెగఁ జూచినప్పుడుం జండతర ప్రకోపము నసహ్యపు శోకము నిట్లు చిత్త మొం డొండఁ గలంప నే నిపుడ యొక్కఁడుఁ దక్కక యుండ వారి ను ద్దండ మదస్త్రవహ్నిఁ బరిదగ్ధులఁ జేయక యెట్టు లుండుదున్? |
411 |
| తే. |
వినుము సత్యంబు వల్కెద మనుజనాథ! | యడరి యందఱఁ బాంచాలు రాదిగాఁగఁ గలుగు బాంధవమిత్ర సంఘములతోడఁ | గూడ నేఁ డిదె కృష్ణుండు సూడఁ ద్రుంతు. |
412 |
| వ. | పనుపు’ మనిన హృష్టుండై యజ్జనపతి గృపాచార్యుం గనుంగొని యొక్క కలశంబున జలంబు నినిచికొని రమ్మనుటయు, నమ్మహీసురవరుండు దమ్ముం జూడ వచ్చి యచ్చట నున్న సమీపాశ్రమమునికుమారులం బ్రార్థించి యొక్కకలశంబు దెప్పించి దానిం దోయపూర్ణంబుఁ గావించి తెచ్చిన. | 413 |
| చ. |
అతనికి నెమ్మి నిట్లనియె నమ్మనుజేంద్రుఁడు ‘నీవు వేగ మం చితముగ ద్రోణపుత్రు నభిషిక్తునిఁ జేయుము ప్రీతి మచ్చమూ పతియఁగ భూసురుండు నృపుపంపునఁ గయ్యముసేఁత లోకవి శ్రుత మగుధర్మ మట్లగుటఁ జూవె యొనర్చెద నవ్విశేషమున్.’ |
414 |
| వ. | అనవుడు నతండు సంప్రీతుం డై యగ్గురునందనునకు సేనాధిపత్యాభిషేకం బాచరించిన. | 415 |
| ఉ. |
ఆ రథికోత్తముం డధికహర్షముఁ బొందుచు నమ్మహీశ్వరున్ గారవ మొప్పఁ గ్రుచ్చి యిఱిగౌఁగిటఁ జేర్చి యుదాత్తసింహనా దారవ ముల్లసిల్లఁగఁ బ్రియంబుమెయిం గృప యాదవోత్తముల్ సేరి కెలంకులం జనఁగఁ జెచ్చెర నేఁగె నుదగ్రమూర్తి యై. |
416 |
| వ. | ఇ ట్లశ్వత్థామ కృప కృతవర్ములును మహోద్యోగంబున. | 417 |
| క. |
అరినిరవశేషనిరసన | పరమానంద ప్రచరిత పాండవ పుత్త్రో త్కర బాంధవనికర పరి | స్ఫురణాఢ్య తదీయశిబిరమున కభిముఖు లై. |
418 |
| వ. | చని రని యిట్లు ధృతరాష్ట్రునకు సంజయుం డశ్వత్థామోత్సాహంబు తెఱం గెఱింగించె నని వైశంపాయనుండు సెప్పిన విని జనమేజయుం డట మీఁది వృత్తాంతం బెఱింగింపు మని యడుగుటయు. | 419 |