పురాణేతిహాసములు శ్రీమహాభారతము మౌసలపర్వము - ఏకాశ్వాసము
అర్జునుఁడు వేదవ్యాసునొద్దకుఁ బోయి యాదవక్షయంబు చెప్పుట (సం. 16-9-1)
సీ. పోయి మరున్నదిపొంత యాశ్రమమున | నర్హాసనమున నేకాంతనిరతి
నాసీనుఁడై యున్న యమ్మహాత్మునిఁగని | యత్యంతభక్తిసాష్టాంగవినతి
యాచరించినఁ జూచి యమ్మహనీయ వి | ద్యానిధి సేరంగ నతనిఁ బిలిచి
తన సమీపంబున నునిచి తద్వదనమ్ముఁ | గనుఁగొని ని న్నెఱుగంగ రాదు
 
తే. వెడమొగం బైన దిదియేను విజయ! యెట్ట | కేల కెఱిఁగితి నిదియేమి? కినుకవొడమి
వధమునకు నయోగ్యుండగువానిఁ జంపి | తే? పరాజితుఁడైతె? నీ తెఱఁగు సెపుమ.’
207
చ. అనవుడు నాతఁ డిట్టు లను నమ్మహితాత్మునితోడఁ బద్మ లో
చనుఁడు నవాంబుదప్రతిమ చారుతనూలసితుండు దేవకీ
తనయుఁడు రామదేవుఁడును దానును మేను దొఱంగిపోయె నే
మనఁగల? దెల్ల యాదవులు నాఱడి బోయిరి సంయమీశ్వరా!
208
క. మహితాయుధ సంప్రహతులు | సహించు దృఢదేహధృతుల సడిసన్న మహో
త్సహనులు యాదవవీరులు | నిహతు లయిరి తుంగలను మనీషిప్రవరా!
209
తే. అట్లు రామకృష్ణులు సర్వయాదవులును | దెగినఁ జిత్తంబు పొగులంగ మగువపిండు
బాలవృద్ధులఁ గొనిరాఁగఁ బథమునందు | నన్ను బోయలు దాఁకిన నగుచు నేను.
210
చ. ఘనతరబాహుశక్తియును గాండివశక్తియు నస్త్రశక్తియు
న్మనమున నచ్చి యప్డు మునినాథ | కడంగితి నెట్టకేల క
ద్ధనువు గుణంబుఁ గూర్చితి; నుదగ్రత బాహుల లేకయుండె న
స్త్రనికరమంత్రతంత్రములు సంస్మృతిఁ బొందవ యేమి సెప్పుదున్‌?
211
క. బోయల సంహృతికిఁ బ్రకృతి | సాయకసంపాతనములు సాలవె? యని యే
నేయఁ దొడఁగ దొనలు చెనఁటు | లై యుండె; నొకండుఁ జేయునది లే దయ్యెన్‌.
212
క. నెవ్వగయు నచ్చెరువు మది | నివ్వటిలఁగ నప్పు డేను నివ్వెఱపడితిన్‌
జివ్వన ముసరి కిరాతులు | క్రొవ్వెసకం బెసఁగఁ జూఱగొని రజ్జనులన్‌.
213
ఆ. చాపదండ నిహతి నోపిన భంగిఁ గి | రాతకోటి నాఁగి రామకృష్ణ
వల్లభాదు లైన వనితలఁ గొందఱ | వృద్ధబాలకులను వెరవుతోడ.
214
క. కాచికొని వచ్చి తగ నా | నేచిన య ట్లచట నచట నిలిపితి మునినా
థా! చేటును భంగంబును | నై చిత్తము శోకమునకు నగ్గం బయ్యెన్‌.
215
తే. పడని పాటు వాటిల్లిన వెడమొగంబు | వడక యెట్లుండవచ్చు? దపఃప్రకీర్త
నీయ! యిం కిట యే నేమి సేయువాఁడ? | నెసఁగు దయతోడ నానతి యిమ్ము నాకు.’
216
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )