| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | సభాపర్వము - ద్వితీయాశ్వాసము |
| సీ. |
ఇది సేయఁ గా దని మది విచారింపక | సద్గర్హితుండు దుశ్శాసనుండు నెట్టన ద్రౌపది గట్టిన పుట్టంబు | సభలోన విడ్చె నాశంక లేక యుడుగక యొలువంగఁ బడియు ము న్నపనీత | మైన తద్వస్త్రంబు నట్టి వలువ లలితాంగిజఘనమండలమునఁ బాయక | యొప్పుచు నున్న నయ్యువిదఁ జూచి |
|
| ఆ. |
సభ్యులెల్ల నుదితసమ్మదు లయిరి దు | శ్శాసనుండు వస్త్రచయము పర్వ తోపమాన మయిన నొలువంగ నోపక | యుడిగె లజ్జఁ బొంది యుక్కు దక్కి. |
231 |
| వ. | ఇట్లు భీమసేనుండు ద్రుపదరాజనందనకు దుశ్శాసనుండు సేసిన యవమానంబు సూచి కోపరక్తాంత నయనుం డగుచు నంతకాకారంబున దంతసందష్టదారుణముఖుండయి యెల్లవారును విన ని ట్లనియె. | 232 |
| మ. |
కురువృద్ధుల్ గురువృద్ధబాంధవు లనేకుల్ సూచుచుండన్ మదో ద్ధురుఁడై ద్రౌపది నిట్లు సేసిన ఖలున్ దుశ్శాసనున్ లోకభీ కరలీలన్ వధియించి తద్విపులవక్షశ్శైలరక్తౌఘ ని ర్ఝర ముర్వీపతి సూచుచుండ నని నాస్వాదింతు నుగ్రాకృతిన్. |
233 |
| వ. | ‘ఇట్లు సేయనైతినేని పితృపితామహుల గతికిం దప్పినవాఁడ నగుదు’ ననిన నతని యతిమానుషంబయిన మహావ్యవసాయంబున కద్భుతం బంది దిక్కులు చూడక ధిక్ఛబ్దముఖరిత ముఖు లగుచు సభాజనులు తమలో సపుత్త్రకుండయిన ధృతరాష్ట్రు నిందించుచు ‘ద్రుపదరాజపుత్త్రి వాక్యంబులు విచారింపక వృద్ధరాజు లుపేక్షించి’ రనుచుండి; రంత నుద్యతబాహుం డయి విదురుం డెల్లవారిని వారించి యి ట్లనియె. | 234 |
| క. |
సుమతులు పాంచాలీ ప్ర | శ్నము నర్థము నేర్పడన్ విచారింపుఁడు పా పము వొందు ధర్మసందే | హము దీర్పనినాఁడు సభ్యులగు సజ్జనులన్. |
235 |
| మత్తకోకిల |
ఈ వికర్ణుఁడు బాలుఁ డయ్యును నేర్పరించి యథావిధిన్ దేవమంత్రియపోలె ధర్మువుఁ దెల్పె; నీతనిబుద్ధి మీ రేవగింపక చేకొనుం డిది; యెల్లయందును ధర్మ స ద్భావ మొక్కని కేర్పరింపఁగ బ్రహ్మకైనను బోలునే? |
236 |
| ఆ. |
సభకు వచ్చి ధర్మసందేహ మడిగిన | నెఱిఁగి చెప్పకుండిరేని సభ్యు లనృతదోషఫలమునం దర్ధ మొందుదు | రనిరి ధర్మవేదులైన మునులు. |
237 |
| ఆ. |
ధర్ము వెఱిఁగి దానిఁ దా నొండుగా లాభ | లోభ పక్షపాతలోలబుద్ధి సభల నెవ్వఁడేని సభ్యుఁడై పలుకు వాఁ | డనృతదోషఫలము ననుభవించు. |
238 |