| కీర్తనలు | భద్రాచల రామదాసు | ఎన్నెన్ని జన్మము లెత్తవలయునో యేలాగు తాళుదు ఓ రామా ఎ.. |
| వరాళి - చాపు (పంతువరాళి - త్రిపుట) |
| పల్లవి: |
| ఎన్నెన్ని జన్మము లెత్తవలయునో యేలాగు తాళుదు ఓ రామా ఎ.. |
| అను పల్లవి: |
| నన్నింత కన్నడజేయుట నీకు న్యాయము కాదు సుమీ ఓ రామా ఎ.. |
| చరణము(లు): |
| మొదట నెరుగనితనమున సగమాయువు నిదురపాలై పోయెగా ఓ రామా పదపడి తక్కిన పదియేండ్లు బాలత్వమునను బోయెగా ఓ రామా ఎ.. |
| వదలక యౌవనమున పరభామలవలల దగులనాయెగా ఓ రామా ముదిమిని సంసారాంధకూపములో జిక్కి మునిగితేలనాయెగా ఓ రామా ఎ.. |
| తనువస్థిరంబని తారకనామము తలపోయలేనైతిగా ఓ రామా దినదినము పొట్టకొరకై దీనుల వేడివేడి దీనత్వ మొందితిగా ఓ రామా ఎ.. |
| అనుదినమును గురువుపదేశ యోగము నభ్యసించనైతిగా ఓ రామా ఎనసి నిముషమైన మీపాదములపైని మనసు నిల్పగనైతిగా ఓ రామా ఎ.. |
| వాసిగ నిహములో బడిన పాటులెల్ల బాపిన నామముగా ఓ రామా మీ సేవజేసియు మిమ్మే నమ్మిన భవపాశము లంటవుగా ఓ రామా ఎ.. |
| లేశమైన కృపజేసి భద్రాచలవాస కావగరావుగా ఓ రామా ఆశతో నే రామదాసుడనని మీకు దోసిలొగ్గితిగా ఓ రామా ఎ.. |