| కీర్తనలు | భద్రాచల రామదాసు | జనకతనయ నాదు మనవిగైకొని జగజ్జనకునితో దెల్పవే ఓ జననీ |
| శహానా - చాపు |
| చరణము(లు): |
| జనకతనయ నాదు మనవిగైకొని జగజ్జనకునితో దెల్పవే ఓ జననీ పనిపూని ననుపెట్టు బాధలన్నియును పాటించి మహి లెస్సగా ఓ జననీ జ.. |
| పండ్రెండేండ్లనుండి పగలురేయి యాపన్నుడై మిమ్ములన్ ఓ జననీ యెన్నెన్నో విధముల సన్నుతించిన కాని కన్నుల జూడరు ఓ జననీ జ.. |
| కన్నీరు లేకుండ నుండు తీరు నాకు ఎన్నడు లేదుగదా ఓ జననీ కన్నతండ్రులింత కరుణమాలి భువిని గాచువారలు గలర ఓ జననీ జ.. |
| అజుని హరుని ప్రేమనాశ్రయించి నన్ను ఆదరించకపోదుర ఓ జననీ గజరాజు మకరిచే గాసిజెంది వేడ గాచి రక్షింపలేదా ఓ జననీ జ.. |
| నిజముగ మీపాదభజన చేసినవాని నిర్దయ జూచినారు ఓ జననీ సుజనాళి మున్ను ఎటువలె బ్రోచిరో నిజముగాదని దోచెను ఓ జననీ జ.. |
| అసిపత్రముల బూని యుగ్రులై నొసలిపై విసరుచుందురెప్పుడు ఓ జననీ మిసమిసమను కోరమీసముల్దువ్వుచు కసిదీర నన్ను దూరిరి ఓ జననీ జ.. |
| అశనిపాతముల నన్నలసట నొందగ విసరివిసరి గొట్టగా ఓ జననీ వశముగాదు నిమిషమైన నోర్వజాల జలజాక్షి దిక్కెవ్వరే ఓ జననీ జ.. |
| గడియగడియకు నన్ను కదిసి దూతలవలె కడుభీతినొందింపగా ఓ జననీ ఎడతెగని యాపద ఈప్రొద్దు గలిగె నేనెవరితో విన్నవింతు ఓ జననీ జ.. |
| తడవేల పైకము తెమ్మని తహశీలు తాఖీదు చేయింపగా ఓ జననీ ఇడుములబడలేను ఉర్విపై ప్రాణములు విడిచి మిమ్ముజేరుదు ఓ జననీ జ.. |
| అదిగో వచ్చెదరని ఇదిగో వచ్చెదరని ఎదురుచూచుచుంటిని ఓ జననీ ఒదిగి చిన్నపోయి బందిఖానాలో నేనొంటరిగా నుంటిని ఓ జననీ జ.. |
| సుదతిరో తెల్లవారిన వెనుక నన్నింక బ్రతుకనియ్యరు భటులు ఓ జననీ అతిభీతినొంది నేనర్థించితి నిమిషమాలస్య మికచేయక ఓ జననీ జ.. |
| పరమపురుషుడింత యరమర చేసిన పరులనెవ్వరి వేడుదు ఓ జననీ సరసిజోదరునకు సమ్మతిగాకున్న సత్కీర్తి దక్కునటే ఓ జననీ జ.. |
| మరిమరి మిమ్మెపుడు మందలించి నామనసు నీరైపోయెగా ఓ జననీ సరి నాయిష్టము చెల్లె నేటివరకు వెరపులన్నియు తీరెగా ఓ జననీ జ.. |
| అతివరో యన్నదమ్ములనిటు పంపుమీ యర్థముతో గూడను ఓ జననీ గతివేరేలేదు సద్గతినొందుటకును పతితపావనుడు దప్ప ఓ జననీ జ.. |
| ఇతరమెరుగక మీరేగతియని నమ్ముక యిదివరకున్నాడను ఓ జననీ సతతము భద్రాచలరామదాసుని తరియింప సమయము ఓ జననీ జ.. |