| కీర్తనలు | భద్రాచల రామదాసు | రావయ్య భద్రాచలరామ శ్రీరామా |
| బిలహరి - చాపు (- ఆది) |
| పల్లవి: |
| రావయ్య భద్రాచలరామ శ్రీరామా రావయ్య జగదభిరామ లలామా రా.. |
| అను పల్లవి: |
| కేవలభక్తి విలసిల్లునా భావము దెలిసిన దేవుడవైతే రా.. |
| చరణము(లు): |
| ప్రొద్దున నిన్ను పొగడుచు నెల్లప్పుడు పద్దుమీరకను భజనలు చేసెద గద్దరితనమున ప్రొద్దులు పుచ్చక ముద్దులు గులుకుచు మునుపటివలె రా.. |
| నన్నుగన్నతండ్రీ మదిలో నీ కన్న నితరులను గొలిచెదనా ఆ పన్నరక్షకా పర దినకర కుల రత్నాకర పూర్ణసుధాకర రా.. |
| అంజలిజేసెద నరమరలేక కంజదళాక్ష కటాక్షము లుంచుము ముజ్జగములకును ముదమిడు పదముల గజ్జెలు కదలగ ఘల్లుఘల్లుమన రా.. |
| దోషము లెంచని దొరవని నీకు దోసిలియొగ్గితి తొలుత పరాకు దాసుని తప్పులు దండముతో సరి వాసిగ రామదాసునిక బ్రోవగ రా.. |