| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 051. ఏమొ |
| 51. ఏమొ |
| ఈ యగాధ నిశీధాన నెట్టయెదుట వెలుగు కన్పించెనని అదే కులకబోకు కొఱివిదయ్యాలొ? యెవరైన నరులయొక్క కరములం దుండు దీపాలకాంతు లేమొ? |
| ఈ యఖండ సముద్రాన నేరి కోరి సంచులకు నిండ దెస్తిని సంపదంచు మురవగా బోకు కిందుమీ దెరగకుండ నత్తగుల్లలొ? మంచి రత్నాలొ యేమొ? |
| ఈ కీకారణ్య మధ్యాన నిచట నచట దిరిగి యేవేవొ వేళ్ళేవొ తీగ లిన్ని మోపులకు దెచ్చినా నని మోజుపడకు చచ్చుతీగలొ? జీవనౌషధులొ యేమొ? |
| ఈ మహాతిరణాలలో నీడ నాడ నెఱుకలేని మనుష్యుల పరిచయమ్ము లబ్బెగాయంచు నుబ్బి తబ్బిబ్బులవకు శత్రులో? ప్రాణమిచ్చేటి మిత్రు లేమొ? |