| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 137. ఇంద్రకీలాద్రి |
| 137. ఇంద్రకీలాద్రి (వాయుసందేశము నుండి) |
| అల్లదే ఇంద్రకీలాద్రి, ఆకసమ్ము పై కెగయబ్రాకు, నల్ల యా ప్రాతగుడిసె పార్థు డా శైలశిఖరాన పాశుపతము బడయ శివుగూర్చి ఘోరతపమ్ము జేసె! |
| కార్యశూరత దక్కి నిర్వీర్యు లౌచు కన్నభూమాతకును కళంకమ్ము గూర్చు పరమనాస్తికు లిపుడు తపఃప్రభావ మెల్ల బూటక మంచు నిందింతు రకట! |
| ఆ నగోత్తమమున కధిష్ఠానదేవి కనకదుర్గాభవాని లోకాలతల్లి తొల్లి తన యుగ్రశక్తుల నెల్ల నొక్క బాలసన్యాసి ఘనతపోబలముకతన గోలు పడి, యొంటి నివసింప దాళలేక స్త్రీజనోచిత కోమలప్రేమ చకిత చిత్తయై, మొన్నమొన్ననే చెంత జేర విభుని మల్లికార్జునుని రప్పించుకొనియె! |
| ప్రాతదయ్యును నా వధూవరులప్రేమ నవనవానందజనక మై భువనతతికి పరగ నిత్యకళ్యాణమున్ పచ్చతోర ణముగ శోభిల్లజేయు నన్నగవరమును! |
| ఆలయము ప్రక్క కోనే రగాధమైన, దప్సరస్త్రీలు రాత్రుల నచట జలక మాడి, దేవిని పూజించి వీడినట్టి పసుపుకుంకుమ మక్షతల్ కుసుమము లవె! |
| ఆ కొలని చెంతనున్న గుహాంతరముల యుగములాదిగ మునివరుల్ యోగనిరతు లై నిమీలితలోచను లగుచు లోక సంగ్రహార్థముగ తపమ్ము సల్పుచుంద్రు! |
| అద్రిశిఖరమ్ముపై కిరాతార్జునులు మ హాహవ మ్మొనరించిన యట్టిచోట నేటికిని చిన్నె లగుపించు వాటివలన విజయవాడ యంచు పురికి పేరు కలిగె! |
| చుట్టు నున్నట్టి పర్వతాల్ పెట్టనట్టి కోటలై యొప్ప శాత్రవకోట్ల కెల్ల మిగుల దుర్భేద్యమై పండువగుచు కనుల కలరు మా విజయునివాడ, చెలిమికాడ! |
| కాలువలు నల్గడల నలంకారములుగ జెలగ, జలయంత్రనిర్గత జలకణాళి మౌక్తికాహారభూషిత మందిరాంగ ణోల్లసత్ పుష్పవల్లుల నొప్పుపురము! |
| వారకాంతలు నివసించు వాడలందు గాన నృత్తానుకర మృదంగములదైన స్నిగ్ధగంభీరఘోషము చెవులబడిన తోడనే మేఘరవమంచు దోచు నీకు! |
| భాగ్యవంతులు మేడల పాన్పులందు మందమతులట్లు పొరలాడుచుందు రకట! అన్నమో రామచంద్రా యటంచు నెండ నేడ్చు బీదవానికి నిల్వనీడలేదు! |
| కాంచుమా కృష్ణవేణి, దుర్గాంబ పైడి ముక్కుపో గందుకొన పంత మూని వేగ వచ్చు నాటోపముగ పరవళ్ళతోడ చెంగలించుచు నార్చుచు భంగపడుచు! |
| ఇంద్రకీలాద్రి కాసింత సందు నీయ కృష్ణవేణి మోమోట మింతేని లేక చీల్చి భేదించి ప్రవహించు చెచ్చెర నదె చనువునిచ్చిన నెక్కెను చంక కనగ. |