| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 031. కాంచలేను! కాంచలేను! |
| 31. కాంచలేను! కాంచలేను! |
| కాంచలేను, కాంచలేను కనులు మూతవడెడు స్వామి! |
| మించుదీగయట్లు మిగుల మెఱయుచుండె నీదుమూర్తి క్రించుదనము నొందిన నే గాంచలేను నీ తేజము! కాంచలేను... |
| ఆనలేను, ఆనలేను అధరామృతమును నాథా! |
| ప్రాణదాన మిచ్చి తాపబాధల పోగొట్టు నీదు ప్రణయామృత మానలేని భాగ్యహీనురాల దేవ! ఆనలేను... |
| నిలువలేను, నిలువలేను నిన్ను కౌగలింపలేను! |
| ప్రేమ పవిత్రమ్మగు నీ హృదయమ్మును దాకినంత పాపమునిండిన నాయెద వ్రయ్యలౌనుగాదె నాథ! నిలువలేను... |
| పలుకలేను, పలుకలేను భయము సిగ్గు వొడము నాథా! |
| వల పెల్లను నాయందే నిలిపినట్టి దేవ నిన్ను ద్రోహముచేసిన నాదగు దోసమెల్ల బయలుపడదె! పలుకలేను... |
| కాంచలేను, కాంచలేను కనులు మూతవడెడు స్వామి! |