| కవితలు | చీకటి నీడలు - బైరాగి | 13. తిరిగిరండి! |
| తిరిగిరండి! |
|
తిరిగిరండి! మరలిరండి! నవజగతికి మరలిరండి! భగ్నాశల మృత్యుసమాధిలో చిరప్రశాంతి దుసహవ్యాధితో వైచిత్ర్యం లేని బ్రతుకు గడిపే భావుకులంతా తిరిగిరండి! మరలిరండి! ఈ మన బ్రతుకొక పోరాటం సుఖదుఃఖపు అలల చెలగాటం ఈ జీవిత జలధి ఈ చావు బ్రతుకు తేల్చుకొండి! తిరిగిరండి! మరలిరండి! మీ క్షుద్రప్రేమ గాధలూ మీ తుచ్ఛ విరహ బాధలూ ఈ సంక్షుబ్ధ ప్రభంజన రణధ్వనిలో ముంచేసీ తిరిగిరండి! మరలిరండి! నూతన సూర్యోదయ కాంతులు సరిక్రొత్త ప్రపంచపు దూతలు తలుపులు తట్టారదిగో! స్వాగత మివ్వండి! లెండి! తిరిగిరండి! మరలిరండి! నవజగతికి తరలి రండి! |