| కవితలు | జాషువ | ఖండకావ్యములు |
|
| శ్మశానవాటి |
| ఎన్నో యేండ్లు గతించిపోయినవి గానీ, యీ శ్మశానస్థలిన్ గన్నుల్ మోడ్చిన మందభాగ్యు డొకఁడైనన్ లేచిరాఁ, డక్కటా! యెన్నా ళ్ళీచలనంబు లేని శయనం? బేతల్లు లల్లాడిరో! కన్నీటంబడి క్రాఁగిపోయినవి నిక్కంబిందు పాషాణముల్! |
| ఆకాశంబును కాఱుమబ్బుగము లాహారించె; దయ్యాలతో ఘూకంబుల్ చెరలాడసాఁగినవి; వ్యాఘోషించె నల్దిక్కులన్ గాకోలంబులు; గుండె ఝల్లుమనుచున్నంగాని యిక్కాటియం దా కల్లాడిన జాడ లే; దిచట సౌఖ్యం బెంత క్రీడించునో! |
| ఇచ్చోట; నేసత్కవీంద్రుని కమ్మని-కలము, నిప్పులలోనఁగఱఁగిపోయె! యిచ్చోట; నేభూము లేలు రాజన్యుని-యధికారముద్రిక లంతరించె! యిచ్చోట; నే లేఁత యిల్లాలి నల్లపూ-సలసౌరు, గంగలోఁగలసిపోయె! యిచ్చోట; నెట్టిపే రెన్నికం గనుఁగొన్న-చిత్రలేఖకుని కుంచియ, నశించె! ఇది పిశాచులతో నిటాలేక్షణుండు-గజ్జె గదలించి యాడు రంగస్థలంబు; ఇది మరణదూత తీక్ష్ణమౌ దృష్టు లొలయ-నవనిఁ బాలించు భస్మసింహాసనంబు |
| ముదురుతమస్సులో మునిగిఁపోయిన క్రొత్త సమాధిమీదఁ బై బొదలు మిణుంగురుంబురువు పోలిక వెల్గుచునున్న దివ్వె, ఆ ముద ముడివోయినన్ సమసిపోవుట లేదది దీప మందుమా? హృదయముసుమ్మి, నిల్పిచనియె న్గతపుత్రిక, యే యభాగ్యయో! |
| కవుల కలాలు, గాయకుల కమ్మని కంఠము లీ శ్మశానపుం గవనులఁ ద్రొక్కి చూచెడి; నొకానొకనాఁ డల కాళిదాస భా రవు ల శరీరముల్ ప్రకృతిరంగమునం దిపు డెంత లేసి రే ణువు లయి మృత్తికం కలిసెనో కదా! కుమ్మరివాని సారెపై |
| ఆలోకించిన గుండియ ల్గరంగు; నాయా పిల్లగోరీలలో నే లేబుగ్గల సౌరు రూపఱియెనో! యేముద్దు నిద్రించెనో! యే లీలావతి గర్భగోళమున వహ్నిజ్వాల జీవించునో? యీలోకంబున వృద్ధిగాదగిన యేయే విద్య లల్లాడునో? |
| ఇట నస్పృశ్యత సంచరించుటకు దావేలేదు; విశ్వంభరా నటనంబున్ గబళించి గర్భమున విన్యస్తంబు గావించి, యు త్కటపుం బెబ్బులితోడ మేకఁ నొకప్రక్కన్జేర్చి జోకొట్టి యూ ఱట గల్పించు నభేదభావమును, ధర్మం బిందుఁగారాడెడిన్ |
| వాకొనరాని గొప్ప ధనవంతుని నిద్దపుఁ బాలఱాతిగో రీకడఁ బారవేయఁబడి ప్రేలికలం బొరలాడు ప్రేత మే యాకటిచిచ్చునన్ గుమిలి, యార్చి, గతించిన పేదవాని దౌ నోకద! వానికై వగవఁ డొక్కండు; దాఁచదు కాటినేలయున్ |
| భీష్ముఁడు |
| వృద్ధవీరుఁడ! నీవయస్సెంత చెపుమ? తండ్రి మరణించియే మూఁడు తరములయ్యె; నౌర! భారత యుద్ధమధ్యంబునందు పడుచు పార్థునిఁ దల్లడపరచినావు |
| కోడెవయస్సు ని న్నలమి గోటికి మీసము చిక్కునాఁడు, ము య్యేడిరునాళ్ళు పోరు వెలయించిన భార్గవరాముఁ డెంత య ల్లాడెనో! మూడుగాళ్ళ ముసలయ్యవు; నేఁటి కెదిర్చి కృష్ణుఁడున్ గ్రీడియుఁ దల్లడిల్లి; రవని న్నిను గెల్చు మగఁడు పుట్టెనే? |
| "వెలిమావుల్ రుధిరంబు గ్రక్కె; గతిదప్పెందేరు; సంధించు న మ్ములతో గాండివమూడె; సాఁగవు కరంబుల్; బావ! ఆలంబు నా వలగా" దంచు ధనంజయుండు కనులన్ బాష్పంబుల న్నించఁడే? బలమో! లేక మహత్త్వమో! యిది తలంపన్ రాదు గంగాసుతా? |
| ఆరయ నీవు ధర్మయున కాయువు పట్టెఱిఁగింపకుండినన్ శౌరియు, సవ్యసాచి మరునాడు రణంబున నిల్తురే? కృపా పారగ! నిక్కపుం గినుక పైకొని నీవు ధనుస్సుఁ పట్టినన్ నీరయి పోవె లోకములు! నింగి గుంభిల్లునఁ గూలిపోవదే! |
| అంబ శిఖండియయ్యె; నతఁడాడుది; వాని మొగంబుఁ జూడనం చుం బరిపూర్ణ పౌరుష విశుద్ధికి భంగము గల్గకుండ వి ల్లంబులు బారవైచితివి యర్జునవీరుని కీర్తి నిల్ప! గం గాంబిక ధన్యయయ్యెనుగదా! నినుగాంచి; ధనుష్మదగ్రణీ! |
| గురువు గొడ్డలి ద్రిప్పుకొని తప్పుకొనుదాఁక-మరలి వెన్కరాని మార్గణంబు ముత్తరంబులనుండి ముదిరి ముద్దలుగట్టి-చేవ డిందని పచ్చి యౌవనంబు వసు సప్తకము సానఁబట్టి జీవము వోసి-యొసఁగు కక్కసపు టాయుధబలంబు స్వర్గతరంగిణీ స్తన్యంబు బలిమిని-సంప్రాప్తమైన తేజశ్చయంబు గవ్వకుం గాని పాడు శిఖండిముందు-వ్యర్థపుచ్చితె పార్థుని పరువుకొఱకు! జగము నగలించు నీ దివ్యశంఖరవళి-పవ్వళించెనె యమ్ములపడక మీద! |
| కౌరవుని యాస గంగలోఁ గలసిపోయె; పరశురాముని వేఁడి నిశ్వాసములకు నింద్రగిరి క్రాఁగి బూదియయ్యెను గదోయి! శంతనకుమార! నీ విల్లు జారిపోవ. |
| రాజరాజు |
| నిన్నుఁ బోలు మహీనేత నిక్కవముగఁ బుట్టెనో? పరాశరదివ్యముని సుతుండు మున్ను, మాతాత పరిహాసమునకుఁ గాను కల్పనముచేసి వ్రాసెనో? కౌరవేశ! |
| మాతాత సత్యవంతుండు పూతములగు నాల్గు వేదములు వ్రాసిన వి ఖ్యాతకవీంద్రుం; డాతని చేతికల మబద్ధములు వచింపదు సుమ్మీ! |
| వ్యాసకల్పిత మహాభారతామ్నాయంబు-గుట్టుగా నిమఁ దిట్టుగొనుచునుండ ముగురు సత్కవుల పెంపుడు కావ్యరాజంబు-పదిమందిలో బట్టబయలు సేయ నింతలింతలు సేయు దృశ్యప్రబంధాళి-మొత్తమై ని న్నాడిపోసికొనఁగ చెప్పుడుమాటకు జెవి యొగ్గు భవనంబు-క్రూరాత్ము డని పండ్లు నూరు కొనఁగ తొడలు తెగిన బాధతో, నింత దుష్కీర్తి-తోఁ, బరాజయంబు తోడురాఁగ నరకమునకుఁ బోయినావో? స్వర్గమునకుఁ-జేరినావో? నీవు కౌరవేంద్ర! |
| నీసావాసముచేసి ముజ్జగముఁ బిండింజేయగాఁ జాలు రా ధాసూనుం డొక వ్యర్థజీవి యయి నిందాబద్ధుఁడై పోయె; నీ యాసల్ భీముగదాభిఘాతమున నుగ్గై యూరు యుగ్మంబుతో నీ సింహాసనసీమ దుఃఖపడు చుండె న్నేఁడు కన్నీళ్ళతో! |
| సవ్యసాచికరాన సాము నేరిచికొన్న-బలమైన కొవ్వాఁడి బానములకు వాయుసూనుని బాహుబలముతోఁ బోరాడు-మొక్కవోవని పుట్టె డుక్కుగదకు పాంచాలి నులివెచ్చ బాష్పాంబువులఁ దేలు-వజ్రనిష్ఠుర శాపవాక్యములకు యమతనూభవుని దీనాలోకములఁ దోలి-దీపించు శీతలాలాపములకు సకల భువనంబు లాలించి సమ్మతించు-వనజనాభుని శుభ రాయబారమునకు సమ్మతింపక, రక్త నిర్ఝరములందుఁ-దానమాడితి వేల? గాంధారితనయ! |
| అంటఁగరాని యగ్ని కెనయైనది ద్రౌపది; యట్టి సాధ్వి వ య్యంట మొగాన బూని, "యకటా!" యని యశ్రులు రాలనేడ్చినన్ దుంటరివై సహోదరులతో సభలోనఁ బరాభవించినా వంట! మఱందివై వదినకా మొనగానితనంబు సూపుటల్! |
| కురుభూపాలుఁడు బుద్ధిమంతుడని వాకోబూనితింగాని, యా దరణీయంబులు హేతువు ల్గలుగవద్దా? నీ చరిత్రంబునన్ గరళాన్నంబును, మాయజూదమును లాక్షాగేహమున్ ద్రౌపదీ పరిభావంబు భయంకరంబులయి చూపట్టుం గురుక్ష్మాపతీ! |
| నీయతనంబు లన్నియును నెత్తురుకూడు భుజించి మాయమై పోయెఁగదా? వృథాపయశముం దలదాల్చిన నీకు నేఁడు నిం దాయువుఁ బోసినారు కవు లక్కట, పెందొడలూడి, కుంటివై! యీ యవమానజీవితము నెట్లు సహింతువయా సుయోధనా! |
| భారతవీరుఁడు (భారతి, జనవరి 1927) | |
| గీ. | ఘనకురుక్షేత్ర సంగ్రామ గగనమునకు భానుమంతుఁడవై వైరి వర్గములను కలఁచి గెలిచిన దండిమగండ వీవు; కర్ణ, కారణమేమి దుఃఖపడ నింక? |
| గీ. | సమరధర్మంబు విడి ధనంజయుఁడు సంపె; నతనిచేఁ జచ్చె రాధేయుఁ డనెడు పల్కు పుట్టెననుచింత గలదు కాఁబోలు నీకు నట్లుగాదయ్య గెలుపు నీయదియె కర్ణ! |
| గీ. | ధర్మముఁ దలంచి నినుఁ గన్నతల్లి ననుఁగు సోదరుల రేణువులభాతిఁ జూచినావు ఔర నీస్వామిభక్తి నీయద్వితీయ సుగుణసంపద వర్ణింప నగునె కర్ణ! |
| శా. | వీరాగ్రేసర, నీవు పాండవబలాబ్ధిన్ మందరంబట్లు దో స్సారం బార మథించి యంచితయశస్సారంబు లోకంబునన్ బారంజల్లిన సద్ధనుర్ధరుఁడ వెవ్వం డీడురా నీకుఁ గ ర్ణా, రాజన్యుల కెల్ల నీచరితమన్నన్ గర్ణపేయంబగున్. |
| మ. | ఒకపాంచాలికి భర్త లేవురని మర్త్యుల్గూడిమాటాడువా డుకయే కర్ణకఠోరమై మసలుచుండున్ డెందమం దట్టివా నికి నాకాఱవ భర్తృనామము ధరన్ నిర్మింప కంచున్ మురా రికి వాక్రుచ్చి యశంబుఁ జాటవె ధరిత్రీమండలిన్ భానుజా! |
| మ. | జననంబందిన తత్క్షణంబ కఠినస్వాంతంబునన్ గంగ క ప్పనగావించిన క్రూరురా లనక లోభస్వాంతయై కుంతి “నా యన, కర్ణా, సుతభిక్షరా” యనఁగ నాహా! మారుమాటాడ కి చ్చిన విఖ్యాతవదాన్యమాన్యుఁడవు యొచ్చెం బేది నీకీర్తికిన్. |
| గీ. | పార్థనామము చెవిలోనఁ బడినయంత భగ్గుమని మండిపోవు నాపాదమస్త కంబు నీకట్టి మీ వైరకారణంబు చాటుచున్నది కర్ణ, నీ స్వామిభక్తి. |
| చ. | అరదము నేలఁ గ్రుంగినపు డైనను, భార్గవరాముశాపవా క్సరణిశరంబు లూహ కెడసన్నపు డేనియు, శల్యుఁ డెన్ని ని ష్ఠురములు పల్కుచున్న, రణశూరత దక్కక వైరివీరకం ధరపటుకర్తనోద్యమమునన్ జెలువారవె సూర్యనందనా! |
| శా. | కింకన్ రుద్రునిఁ బోలి తేరి నడుచక్కింజేరి, దృప్యద్ధను ష్టంకారంబొనరించుచున్ రిపులకంఠశ్రేణిఁజెండాడునీ వంకన్ జూడఁ గిరీటియంతటి ప్రతాపస్ఫారమార్తాండుఁడే జంకెన్ నీ కెదురెక్కు వీరుఁ డొకడున్ జన్మించెనే, భానుజా! |
| మ. | చెవులన్గుండలముల్ ప్రభావిభవరాజిం జిమ్ము వర్మంబుఁ బు ట్టువుతోఁగల్గిన ముద్దుబిడ్డఁడవు, నీటుంగోటు దీపింప రెం డవమీనాంకుని వోలి విల్లుఁ గొని జన్యక్షోణులం జొచ్చి శా త్రవనాశం బొనరించు నిన్నుఁగని, కర్ణా! కుంతి యెట్లోర్చెనో! |
| చ. | మివులఁ బవిత్రవంతమయి మేదినిఁ గాలువకట్టి మర్మరా రవము సెలంగ నీదురుధిరంబు స్రవించుచు “యర్జునాయధ ర్మువు, భవ” మంచు నెంతవలపోసెనొ! శత్రుకళేబరంబు లం టవలసెనంచు నెంత వనటంబడినాఁడవొ, కర్ణ! కూలుచో. |
| ఉ. | “చండగభస్తిమండల మొసంగిన నాతొలుచూలుకాన్పు క ర్ణుం”డనుకుంతిమాటకుఁ దనూలత కంపమునంద ధర్మసూ నుం డెలుఁగెత్తి యేడిచి నినుం గొనియాడుచుఁ బల్కె నట్టిశూ రుం డిఁకఁ బుట్టఁబోఁడని నిరూపణసేయుచు సూర్యనందనా! |
| కం. | కర్ణుని తల భారతమని దుర్ణయవాక్యముగఁ బల్కుదురు జను లోశౌ ర్యార్ణవ! నీ చరితము సం పూర్ణముగ నెఱుంగలేకపోవుట కతనన్! |
| భారతవీరుఁడు (భారతి, సెప్టెంబరు 1928) | |
| ఉ. | “ఈ కవచంబుఁ గుండలము లీయకు మల్లదె దొంగబాపఁడై నాకవిభుండు వచ్చెడిని నా యనుఁగుంగొడుకా” యటంచు మ ర్త్యాకృతి నుండి పల్కెడు నహస్కరునిం గని నవ్వి యవ్వి యే పోకడఁ బెట్టు నీ సుగుణము న్నుతియింపఁ దరంబె భానుజా! |
| చ. | నరుఁడు బృహన్నలాఖ్య నలనాఁడు విరాటునిఁ గొల్చుచుండి, యు త్తరునకు సాయమై, కురుశతంబును మూర్ఛిలఁ గొట్టునాఁడు, భా స్కరసుతుఁ డోడె నందు రని కన్నుల నీ రిడకయ్య, శక్తులై గురుఁడు, నదీసుతుం డెదురుకొన్నది లేదుగదోయి, భానుజా! |
| శా. | గంగాపుత్రుఁడు రాజునానతి శతాంగశ్రేణి యర్పించు నాఁ డంగీకారము గాక నీ కొక రథం బర్పించెనే కాని, యో యంగాధీశ్వర, యుగ్రవత్కదనపంచాస్యుండ వౌ నీకు నీ యంగత్రాణములున్ రథంబులును సాహాయ్యంబు లేమాత్రముల్. |
| ఉ. | సంగరసీమ నీకుఁ దొలిసాయకమైన భుజంగభర్త, పా ర్థుం గుఱిచూచుచో నది విరుద్ధగతిం జని టెక్కెముం గిరీ టాంగదముల్దహించి, యినజా, ననుఁ గ్రమ్మర నేయుమన్న, ఛీ యెంగిలిబాణ మేయ ననవే! రణవీరుఁడ వీవ యర్కజా! |
| ఉ. | నిక్కపుఁ బేఁడబుఱ్ఱవలె నీతొడ నింద్రుఁడు బొక్కసేయ నాఁ డక్కట నెత్తురు ల్వరద లై ప్రవహించుచునున్న ధైర్యమున్ దక్కక నిద్రఁ జెందు జమదగ్నికుమారుఁ గదల్పలేదు హా! యెక్కడి చిత్తదార్ఢ్య; మిది యెక్కడి దీగురుభక్తి భానుజా! |
| మ. | కురురా జొక్కఁడుగాక నీ దగు మహత్కోదండపాండిత్యము న్వరదానప్రతిభానిసర్గగుణ మెవ్వారేని గుర్తించిరే యరవిందాప్తకుమార, చింతపడకయ్యా! నేఁటి కింకన్ దిగం తరదేశంబులఁ బాఱుచున్నవి భవద్దానాంబుధారానదుల్. |
| శా. | నీ నేర్పు న్సహజప్రతాపవదనోన్మేషంబు నీక్షించి, యీ ర్ష్యానైశిత్యముఁ దోఁపనీక, కులగోత్రప్రశ్నలన్ దెచ్చి ల జ్జానిర్జీవునిఁగా నొనర్చెడు కృపాశ్వత్థామలే లేక, క ర్ణా, నీ వేరికి తీసిపోయెదవు, మార్తాండాత్తతేజశ్వి వై? |
| ఉ. | అంబుజనాభు నంతటి మహాత్ముఁడు పార్థునితేరిమీఁద గు ఱ్ఱంబులు దోలుచుండ సమరం బొనరింపఁ దెగించునే లలా టాంబకుఁడైన? నీ తెగువ యబ్బురముం గలిగించు! వీరలో కంబున నీకుఁ జాలిన మగండు జనింపఁడు సూర్యనందనా! |
| ఉ. | “నా యరదంబు క్రుంగిన దనంత, కిరీటి, క్షణంబు తాళుఁ డో యీ! యిది యుద్ధ ధర్మ” మని యీవు వచించుచునున్న నిన్ను న న్యాయముగా వధించిన ధనంజయుఁడా విజయుండు నీవు కా వా, అకటా! యి దెక్కడి నిరర్థకధర్మము సూర్యనందనా! |
| ఉ. | “భారతయుద్ధరంగమున పాండుతనూభవమధ్యముండొ, కా దా, రవిజుండొ! తీరవలె తథ్యము నా కిటు గాక కంటికిం గూరుకు రాదు, రా” దనుచు ఘోరముగా శపథంబు చేసి నీ కూరిమిఱేనికై తనువుఁ గోల్పడి తెంతటి సాహసుండవో! |
| చ. | “కుడిభుజమైన కర్ణుఁ డనిఁగూలె, సమస్తముఁ దీఱె” నంచు డీ ల్పడి, ధృతరాష్ట్రనందనుఁడు పాండుకుమారుల కోహటించి య మ్మడువునఁ జొచ్చె, శూరజనమండన, నీవు గతింపకున్న, భీ ముఁడు తొడఁ గొట్టి నీ నృపునిముందర నిల్చి గదం ధరించునే! |
| తే. | ఫల్గునుఁడు దక్కఁ దక్కిన పాండుసుతులు భండనంబున నీచేతఁ బడినయపుడు తల్లి కిచ్చినవరము చిత్తమున మెఱసి యడిద మెత్తని సత్యసంధుఁడవు కర్ణ! |
| శల్యసారథ్యము (భారతి, సెప్టెంబరు 1931) | |
| సీ. | అహిమస్తములకు నొయ్యారంబు నేర్పించు వలపుఁ బిల్లనఁగ్రోవి పాటకాఁడు పసితనంబునయందు పడగపాములనెక్కి చిందులాడిన గొల్లచిన్నవాఁడు పదియారువేల గోపస్త్రీలతోఁగూడి యపవాదుబూనని యందగాఁడు లోకాంతమున మఱ్ఱియాకుఁ దెప్పందేలి తలదాఁచుకొన్న చిత్రస్వరూపి |
| తే. | భాసురములైన తన చేరెఁడేసికనుల మచ్చుఁజల్లెడు వేలుపు మాంత్రికుండు తొడరి విజయునియరదంబు దోలుచుండె కాంచి వి ల్లందుకొనుము భాస్కరకుమార! |
| చ. | ములుకులు నీధనుస్సున విముక్తములై చని, కృష్ణమూర్తికిన్ వలఁగొని యావల న్నరునిపైఁ గసిబూనుట, దుస్తరంబుగా దలఁప విదేటివెఱ్ఱి? భుజదర్పము వెన్నుని ముందు సాగునే మలపుదునా రథంబు? యనుమానముఁ దోచె జయంబు కర్ణుఁడా? |
| మ. | వ్యయమైపోయిన యమ్ములన్మరలఁ గూర్పం దక్షమైయున్న, య క్షయతూణీరములిచ్చి పార్థుఁడు శరాసారంబు గుప్పించినన్ జయ మాదేవుఁ డెఱుంగు గుఱ్ఱములపై, నాపై, భవత్సేనపై దయజూపించుట కూపిరాడఁగలదా? దౌర్భాగ్యధానుష్కుఁడా! |
| ఉ. | తూలినపందికై, హరుఁ డెదుర్కొని రేఁచిన గ్రుద్దులాట కు స్తీల, బలిష్ఠుఁడై, కఱకుఁ దేలినవాఁడు మహేంద్రసూతి యా శూలికి గుండెలే దతనిఁ జూడ నెగాదిగ, యుద్ధభూమిలో రాలఁదలంచితే? పరశురాముని శిష్యుఁడనన్న బిఱ్ఱునన్. |
| తే. | ఖాండవము నర్జునుఁడు కాల్చు కాలమందు పరుగులెత్తిన ముసలిసర్పమును వింటఁ దొడిగినాఁడవు, భళిభళీ! విడువవలవ దబ్జనాభుఁడు గరుడవాహనుఁడు సుమ్ము. |
| మ. | బలవంతుండగు శౌరి, రోషము రగుల్పన్ బార్థుడుం గెంపుచూ పులవేగంబునఁ దూపులన్నడిపి నీమూర్ధంబు ఖండింపఁడే? తలపై శాపము లాడు నీకు నొక యుద్ధంబేల? నీరక్తమున్ బొలయున్ గాకులు గ్రద్దలున్ గుడుచునేమో! నేఁడు సూతాత్మజా! |
| మ. | ఇలకున్ గ్రుంగె రథంబు చక్ర మిపు డేదీ? నీకు గత్యంతరం బలుక న్నీ ప్రతిపక్షిగాండివధరుండై, చెండుచున్నాఁడు నీ బలమున్ గాలములేదు స్యందనము లేవందీసికొ మ్మేటికీ తలపోఁత ల్శరణంబు వేఁడుకొనరాదా? కర్ణ! బీభత్సునిన్. |