| కవితలు | ప్రాతస్స్తవము | విశ్వనాథ సత్యనారాయణ |
| ప్రాతస్స్తవము విశ్వనాథ సత్యనారాయణ (భారతి, జూన్ 1936) | ||
| శా. | లే! యింకన్ నిదురించుటేమిటిర లే! లే! చిట్టినాతండ్రి! కృ- ష్ణా! యన్నాయి కళిందజాపులినదేశక్రీడనార్థమ్ము న- ప్డే యేగెన్ మఱి నీవుకూడఁ జనవా వేగమ్మ లేవయ్య తం- డ్రీ! యాదిత్యనవాంశువుల్ పసపు పండించెన్ గవాక్షమ్మునన్. | |
| తే. | ప్రక్కయంతయుఁ జిమ్మితి పద్మనాభ అన్న చూడుము పుస్తకమ్మట్లు పండు - కొనును నీవేమొ ప్రక్కంత క్రుమ్మిక్రుమ్మి ప్రక్క యటులుండ నీ విట్లు పండుకొందు. | |
| క. | మొగము కడిగెదను లే సం- పెగఱెక్కనుబోలె ఱెప్పవిప్పుము, నునుచి- ర్నగవు పసరుమొగ్గవలెన్ దొగరుపెదవిమీఁద వచ్చి దోబూచాడున్. | |
| మ. | ఇదిగో తండ్రికిఁ జిట్టిన వ్వుదయమయ్యెన్ లే! యదూత్తంస! నీ- వొదుగన్ బోవని సందుసందులకునై యూరెల్లఁ దా నేడ్చెడున్ గద! నీ యల్లరి లేక, గజ్జియలు ఘల్ఘల్గా గృహమ్మెల్లఁ ద్రొ- క్కెదు నాట్యమ్ముల లేవవయ్య! ప్రభువా! కృష్ణా! యశోదాత్మజా! | |
| చ. | పొలపొల కన్నువిప్పి మఱి మూసెదు చిట్టికి నిక్కమాడు చ- క్కిలిగిలి యున్నదా! కలదు, కేలును జంకకు హత్తుకొంచు న- వ్వులచిఱువెల్గులోఁ బెదవి పొందె నుషోనవరేఖ! తిర్గి య- వ్వలిమొగమై ముడుంచుకొని పండెద వల్లరి కాదు లెమ్మురా. | |
| చ. | తఱకలుకట్టగాఁ బెరుఁగు ద్రచ్చిన కవ్వపుమ్రోఁత నిద్రలే- చి రురుశిశుంబలెన్ నెగచి చిందులుత్రొక్కెదు, ప్రొద్దదెక్కియున్ సరి నునుసెజ్జ వీడవు పసందులబిడ్డవు నేఁడు తండ్రి! యి- క్షురసము నీకునై యెదురుచూచెడు మీఁగడతోడ వెన్నతోన్. | |
| తే. | చాలు నిఁక నిద్ర లెమ్ము కృష్ణయ్య! లెమ్ము లేఁతక్రోఁతులై పండ్లిగిలించుకొంచు నక్కి నిను తొంగి కనుగొంచు నన్నుఁ జూచి పరువు లిడెదరు నీదు సావాసగాండ్రు. | |
| చ. | ప్రిదులని చంద్రవంక సవరించెద, రత్నపురావిరేకఁ బైఁ గుదురుగ నిల్పుదాన, జడకుప్పెలు వేసెద జుత్తు దువ్వి, యీ నిదురను మాని పైడిబరణింబలె మెల్లఁగ లేచిరమ్ము నా యెదగల యింద్రనీలమణి యేడిర! యల్లదె మెల్ల లేచెడున్. | |
| శా. | ఒయ్యారమ్ముల నిద్రకాని నిదురేలోయీ! యశోదాశిశూ కయ్యమ్ముల్ మిగిలెన్ విచిత్రశిశువా! గ్రామమ్మునందెల్ల నో యయ్యా కోపమువద్దులే, యననులే, ఔ పైడిఖిల్లావులే! సయ్యాటమ్ముగ నంటిలే యదుకులస్వామీ! రమావల్లభా! | |
| తే. | అయ్య నిద్దురలేచెనా యంచు నడిగె నందగోఁపుడు మీయయ్య సుందరాంగ! కొసలు ప్రక్కలఁబడి పులిగోరు నలిగి- పోవుచున్నది లేవరా బుచ్చితండ్రి! | |
| ఉ. | అచ్చపువేల్పుబువ్వ బుడగై తరఁగై గరుడాళువారిపై వచ్చెడు చిట్టికోసమని వాఁకిట నున్నది యెవ్వరోయి! వేఁ బుచ్చుకొనుండు దానిఁ జిఱుపొంగులనవ్వుల కన్నుదమ్ములన్ విచ్చుచునున్నవాఁడు యదువీరుఁడు, బుగ్గ గులాబిమొగ్గగాన్. | |
| ఉ. | చిమ్ములదూడవంక నెగఁజిమ్మెడు కోరలకన్నుదోయితో గుమ్మమువద్ద నున్నదదిగో! కను నీకయి గుమ్మపాలగో- వమ్మ, మఱీవు త్రాగకయ యా తన దూడనుగూడఁ ద్రావనీ- దమ్మ! మఱింక లే! నురుసు లారకమున్నుగఁ ద్రావఁగావలెన్. | |
| ఆ. | అనఁగ ననఁగ నొక్క యబ్బాయి యున్నాఁడు లిప్తలోన నిద్ర లేచు నంట కన్నువిప్పువఱకు గంటసేపనుకొమ్ము కన్నువిప్పుపైని గంటసేపు. | |
| ఉ. | దిండిది మంచమిద్ది తెగఁద్రెంచుక లేవవలెన్ సుమండి! లే- దండి! యిదేగతిన్, మసలినంతటిసేపును బద్ధకంబు పో- దండి! జగమ్ము మీకొఱకు ద్వారమునొద్దనె వేచియుండె లే- వండి! యదూద్వహా! విసువువచ్చెను ప్రాణము తల్లిగారికిన్. | |
| ఉ. | ఎత్తఱి తెల్లవారి నిదురించరు మాదగుకోవలోన మా మొత్తముమీఁద నెవ్వరును, బోలిక యింటనె యున్నదేకదా! మెత్తగ పండుకో! నిదుర మేల్కొనఁగాఁ దగదయ్య! అయ్య! మే- నత్తల చాలికందురుగదా! నిజమే! యదువంశమండనా! | |
| ఉ. | ఈ యెలనవ్వులో జనని యెంతటికోపము పోవు నంచు నీ- వే యెదలో నెఱుంగుదువులే! పసిదొంగ! మరింకఁ జాలు లే- వోయి బడాయి! లేవఁగదవోయి! ననుం గడుపార కన్నతం - డ్రీ! యదువృద్ధలోచనమణిచ్ఛవిభూతశరీరవల్లరీ! | |
| శా. | అంతేకావలె నిద్రమేల్కొనవు నీ వన్నాయి తా వచ్చి యా- యింతా మీఁగడ పాలు వెన్న తిని యప్డే చెప్పకుండన్ జనెన్ సంతోషించితిఁ గండ్లుచల్లవడెఁ గన్నా! లేవరా యంచు నే- నెంతేనిం బతిమాలుచుండినను నీ వింతేని విన్నావురా!! | |
| తే. | ఇంక నిద్దురలేవ వీ వెట్లుకాని నెలలతరబడి నీబిడ్డ నిద్రపోవు- నుర్వియెల్లఁ జాతుర్మాస్య లుండవచ్చు- నని జగంబునఁ జాటింతునయ్య కొడుక! | |
| క. | ఇఁకఁ జాలు లేవవోయీ యొకకొలికికిఁ దెత్తుఁగాని యూరెల్లను నీ వొకవేల్పువులే మాపా- లికి స్వామీ! లేవవయ్య! లేవయ్య! ప్రభూ! | |
| తే. | వెనుక త్రిప్పుచేతులను గుప్పిళ్లుపట్టి కనులు తుడుచుచుంటివి మణికట్లతోడ నిక్కి నీల్గుచునుంటివి నిద్ర యింక- నయ్యెనని యనుకొమ్మందువా! ముకుంద! | |
| మ. | ఇది యేదోకథవోలె నున్నయది మీకీరాత్రియెల్లన్ బ్రభూ యదువంశాంబుధిచంద్ర! నిద్ర యది లేనట్లున్నదే! తేలుఁగా- నదియున్ గొంచెముసేపులోన, కడుపేదయ్యా! బలే నిండియు- న్నదియే, యుట్లవి యేమియేన్ మిగిలెనా! నందార్భకా! యూరిలో. | |
| క. | ఇదియా నినుఁ గనవచ్చిన యదపుచెడిన కుఱ్ఱకుంక లందఱకన్నుల్ చెదిరిన మందారమ్ములు చిదిపిన కట్టెఱ్ఱకావి చిమ్ముచునుండెన్. | |
| చ. | మతకరిబుద్ధు లెంతకును మానవు నిన్నునుబట్టి యాప బ్ర- హ్మతరముకాదు, నా కడుపునం దెటుపుట్టితివోయి! చాలు! నా మెతకతనమ్ముగాక, పుడమిన్ నినువంటి కుమారు లుందురే యతివ గయాళిమూఁక యిపుడై పడిపోవును వచ్చి నాపయిన్. | |
| ఉ. | గొల్లలగూడెముల్ తడకకొంపలు తల్పులులేవు నీవు వ్రే- పల్లెకు మేటివైతి వొక పాతికక్రోఁతులు నీకుఁ దోడు మీ- రెల్లరు నుట్లకెక్కుపనికేమొ హుజూర్సరదారులైరి! యీ పిల్లలతోడ నింకఁ గనుపింపుమ యింకొకమాఱు చెప్పెదన్. | |
| ఉ. | పాయకరాత్రులన్ గదలవద్దనిచెప్పినమాట గాలికిం బోయెను జాలుచాలు నటువో పురుగుండును బుట్రయుండు కా- ళీయుని సంగతిన్ దలఁచలే నిపుడైనను నా యదృష్ట మ- న్నా! యలకోటిదేవతలు నాఁడు నినున్ బ్రతికించి యీయరే. | |
| ఉ. | చేతముకూడ సొమ్మసిలు చీఁకటిలోపల నల్లదొంగ వే రీతిని గానుపింతువు దరిద్రులకున్ నిదురించువేళ నీ- వా తరుణమ్ము వేచికొని యందఱవెన్నలు దొంగిలింతు నీ చేతము సుంతయున్ గుణము చెందదురా నవనీతలుబ్ధుఁడా! | |
| క. | తన యింటఁ బాలు లేవో తన యింటను బెరుఁగు లేదొ తానేమిటికో వనజాక్షుఁ డూరిపైఁ జని తిని ‘యాగీ’ లింటిపైకిఁ దెచ్చును చెపుమా! | |
| తే. | ఎవఁడురా వాఁడు మొన్నఁ దానేమొ వచ్చి యయ్య యవతారపురుషుఁ డటంచు చెప్పె నిపుడు వచ్చినఁ తెలియుఁగదే నిశాప్ర- ళయశిశున్ నిన్నెఱుంగువేళకును లేఁడు. | |
| క. | ఆ మొగము నట్లుపెట్టెదు స్వామీ! నామాట గిట్టుబడి కాలేదా? ఆమెతలు మఱగువారికి సామెత లేమిటికి వట్టి చాదస్తమ్ముల్. | |
| తే. | చెప్పిచెప్పి నా గొంతుక నొప్పివెట్టె కొన్ని పెరుఁగులు నిశిఁ దోడుకొనును గొనవు తోడుకొనుచున్న పెరుఁగులు దోఁచెదేని కూడుకొనుచున్న కాపురాల్ కూలిపోవు. | |
| ఉ. | ప్రన్నని బుల్లియేడుపుల రాగము తీసెదు నీవు చేయలే- దన్నను చాలదా! యటుల నందురఁటే! గజదొంగ లమ్మకుం గన్నులుకప్ప నీ యొడుపు గాని, నిజంబుగ నీకు నేడు పం- చన్నల! వచ్చుచున్నదఁటరా! కనులన్ దడి యేది చెప్పరా. | |
| మ. | అది ఆలాగున నేడ్వఁగా వలయురయ్యా! రంగమార్తాండ! క- న్తుదలన్ నీళ్ళులుకూడ తెచ్చితివికాదోయీ! నటోత్తంస! యే- మిది నిక్కమ్ముగ నేడ్చుచుంటివిర! యేమీ! సామి! నీ గుండె యెం- తదిరా! అమ్మను నేడిపించుటకునైనం గొంక వింతేనియున్. | |
| కం. | మా నాయనగా ఏడ్వకు మా నాయనగారు చూడ మాంధాత గదే! లేనివిపో నపవాదులు గానీ, మా తండ్రి యిల్లు కదలఁడు గదవే! | |
| మ. | ఎవరా బాబును గూర్చి యిట్లనిరి బాబెచ్చోటికిం బోయె? రే- బవలున్ నా యొడిలోన నుండును గదే! బంగారు నా తండ్రి ఆ యెవరో గిట్టనివార లందురు శిశూ! నేనెత్తుకొందున్ నినున్ జివురుం గేల్మెడ ముద్దుపెట్టుకొనరా! చిట్టీ! ననుం జెక్కిటన్. | |
| శా. | తా మెవ్వారలు తండ్రి నిట్లనిరి నే దండించెదన్ వారలన్ రా! మా బంగరునాన్న ! యెత్తుకొనెదన్ రావయ్య కృష్ణయ్య! యే- డీ? మా యాదవవంశదీపమణి యేడీ? చిన్నినందయ్య యే- డీ? మా వేల్పులకెల్ల వేల్పుదొర యేడీ? వాఁడు నీవా ప్రభూ? | |
| తే. | చాలు నేడ్వకురా బాబు చచ్చిపోయి నానురా నాదు బంగారునాన్న చిట్టి- కనులఁ గన్నీరు తెప్పించి కన్నకేమొ ఆటయరదమ్ము తెచ్చు మామయ్య నేఁడు. | |
| తే. | బుజముపైఁ బండుకొని బాబు మొగము నత్తు- కొనెడు నిటుచూడు! నన్నుఁ గన్గొనఁగనిమ్ము మనసు కిలికించితం బందుకొనిన తండ్రి తమ్మిమొగము చిర్నగవులు తాండవించు. | |
| ఉ. | నా రతనాలు! నా మణులు! నా వరహాలును, నింద్రనీలపున్ హారతి! నాదు ముత్తెములహారము! వజ్రము, పుష్యరాగమున్! కోరిక లుబ్బఁగా దిగిన కుచ్చులపల్లకి! నా మనస్సులో నూరిన తియ్యనీటిజల! యుల్లలదుజ్జ్వలవారివేణియున్. | |
| కం. | మజ్జారే! చక్కలిగిలి బుజ్జాయికిఁ బొట్టమీఁద ముద్దిడుకొన్నన్ బొజ్జఁ గలవేమొ! బుజ్జికి ముజ్జగముల కిలకిలారు ముద్దులనవ్వుల్. | |
| కం. | మొగము కడిగించుకొనె మా సొగసరి దువ్వించుకొనియె జుత్తును సొగసీ- సొగయని చలిదన్నము తినె ఖగరాడ్గతి నింక నేమి గంతులు త్రొక్కున్. | |
| సీ. | కుణుకుణుకుణుకుణుక్వణనమ్ము లొనరింపఁ | గవ్వించు బంగరుమువ్వలగమి కిణకిణకిణకిణస్వనములు వెలయింప | జిలుగురత్నాల గజ్జియలపేట ఘణఘణఘణఘణధ్వనులు పంచారింప | నెఱినగిషీల యందియలజంట ధణధణధణధణ ధ్వానమ్ము లొలయింప | కలుపుకేల్జత హొన్నుగంటలసడి | |
| తే. | యదుకులోద్యానకేకి నాట్యమ్ముచేసె | నందగర్భసరోహంస నడలునెఱపె నెమ్మి నాట్యమాడెను యశోదమ్మకొడుకు | అంచనడకలు నడచెఁ గ్రిష్ణమ్మగారు. | |