| శతకములు | శ్రీ కాళహస్తీశ్వర శతకము |
|
| శా. |
శ్రీవిద్యుత్కలితాజవంజవ మహాజీమూతపాపాంబు ధా రావేగంబున మన్మనోబ్జ సముదీర్ణత్వంబు గోల్పోయితిన్ దేవా! నీ కరుణా శరత్సమయమింతేఁ జాలు సద్భావనా సేవం దామరతంపరై మనియెదన్ శ్రీకాళహస్తీశ్వరా! |
1 |
| శా. |
వాణీవల్లభ దుర్లభంబగు భవద్ద్వారంబున న్నిల్చి ని ర్వాణశ్రీఁ జెఱపట్టజూచిన విచారద్రోహమో నిత్యక ల్యాణక్రీడలఁబాసి దుర్దశలపాలై రాజలోకాధమ శ్రేణీద్వారము దూరఁజేసెదిపుడో శ్రీకాళహస్తీశ్వరా! |
2 |
| శా. |
అంతామిథ్య తలంచిచూచిన నరుండట్లౌటెఱింగిన్ సదా కాంతల్పుత్రులు నర్థమున్ తనువు నిక్కంబంచు మోహార్ణవ భ్రాంతింజెంది చరించుఁగాని పరమార్థంబైన నీయందుఁ దాఁ జింతాకంతయుఁ జింతనిల్పఁడు గదా శ్రీకాళహస్తీశ్వరా! |
3 |
| శా. |
నీనా సందొడబాటు మాట వినుమా! నీచేత జీతంబునేఁ గానింబట్టక సంతతంబు మదివేడ్కన్గొల్తు నంతస్సప త్నానీకంబున కొప్పగింపకుము నన్నాపాటియే చాలుఁదే జీనొల్లం గరినొల్ల నొల్లసిరులన్ శ్రీకాళహస్తీశ్వరా! |
4 |
| మ. |
భవకేళీ మదిరామదంబున మహాపాపాత్ముఁడై వీఁడు న న్ను వివేకింపఁడటంచు నేను నరకార్ణోరాశిపాలైనఁ బ ట్టవు? బాలుండొకచోట నాటతమితోడన్నూతఁ గూలంగఁ దం డ్రి విచారింపకయుండునా కటకటా! శ్రీకాళహస్తీశ్వరా! |
5 |
| శా. |
స్వామిద్రోహముఁజేసి యేనొకని గొల్వంబోతినో కాక నే నీమాటన్విన నొల్లకుండితినో నిన్నేదిక్కుగాఁ జూడనో యేమీ యిట్టి వృథాపరాధినగు నన్నీ దుఃఖవారాశి వీ చీమధ్యంబున ముంచియుంపఁదగునా శ్రీకాళహస్తీశ్వరా! |
6 |
| మ. |
దివిజక్ష్మారుహధేనురత్న ఘనభూతి ప్రస్ఫురద్రత్న సా నువు నీ విల్లు, నిధీశ్వరుండు సఖుఁ, డర్ణోరాశి కన్యావిభుం డు విశేషార్చకుఁ డింక నీకెన ఘనుండుం గల్గునే నీవు చూ చి విచారింపవు లేమి నెవ్వఁడుడుపున్ శ్రీకాళహస్తీశ్వరా! |
7 |
| శా. |
నీతో యుద్ధముఁ జేయనోప, గవితా నిర్మాణశక్తిన్నినుం బ్రీతుంజేయఁగలేను, నీకొఱకుఁ దండ్రిం జంపఁగాజాల నా చేత న్రోకట నిన్ను మొత్త వెఱతుం జీకాకు నాభక్తియే రీతి న్నాకిఁక నిన్నుఁ జూడఁగలుగున్ శ్రీకాళహస్తీశ్వరా! |
8 |
| మ. |
ఆలుంబిడ్డలు దలిదండ్రులు ధనంబంచు న్మహాబంధనం బేలా నామెడఁగట్టినాఁడవిఁక నిన్నేవేళఁ జింతింతు ని ర్మూలంబైన మనంబులోనఁ గడుదుర్మోహాబ్ధిలోఁ గ్రుంకి యీ సీలామాలపుఁజింత నెట్లుడిపెదో శ్రీకాళహస్తీశ్వరా! |
9 |
| శా. |
నిప్పై పాతకతూల శైలమడఁచు న్నీనామమున్మానవుల్ తప్పన్ దవ్వులవిన్న నంతకభుజాదర్పోద్ధత క్లేశముల్ తప్పుందారును ముక్తులౌదురని శాస్త్రంబుల్మహాపండితుల్ చెప్పంగాఁ దమకింక శంకవలెనా శ్రీకాళహస్తీశ్వరా! |
10 |