| శతకములు | వేంకటేశ శతకము |
|
|
శ్రీదేవి యురమున శిరసునఁ దులసి భూ, కాంతవీఁపుఁన బదాగ్రమున గంగ కమలాసనుఁడు నాభిఁగాముండు మనసున, సవ్యవామాక్షుల శశియు రవియు ధ్వజమున గరుడుండు తపసుల కాంతుల, సకలవాయువులు నాసాపుటముల జగములు కుక్షిని జలధులు తరులందు, ఘనరోమముల దేవగణము లెల్లఁ |
|
|
గలిగి శోభిల్లు నీమూర్తిఁ దలచి నీకు, సీసశతకంబు చెప్పెదఁ జిత్తగింపు కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ. |
1 |
|
ధర్మంబుగలచోటఁ దలకొను జయమెల్ల, దయగలచో సుకృతంబు నిలుచు సత్యంబుగలచోట సమకూరు శుభములు, నేమంబుగలచోట నిలుచు సిరులు పాడిగల్గినచోటఁ బంతంబులీడేఱు, దాక్షిణ్య మున్నచోఁ దగులు మైత్రి భక్తిచేసినచోట ఫలమిచ్చు దైవంబు, మనసు నిల్పినచోట మలయు సుఖము |
|
|
లితరమగుచోట వెదకిన నేలయుండు, సొరదినీదైనకృపగలచోటఁగాక కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ. |
2 |
|
పరమనాస్తికునకు భక్తివాదము లేల, షండున కేటికి సతుల పొందు పాపకర్మున కేల వరపురుషార్థంబు, ధనలోభి కేల బాంధవము చింత మూర్ఖునకేటికి మొదలనే మొగమాట, మనృతవాదికిని మర్యాద యేల వెట్టివానికి నేల విమలవిచారంబు, పరదూషకున కేల పరముచింత |
|
|
సరసునకుఁగాక వివరింప సద్గుణంబు, లెందుఁజూచిన మందున కేల గలుగు కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ. |
3 |
|
తపసికి నేటికిఁ దలపోయ రోషంబు, బ్రాహ్మణునకు నేల పాపచింత బుద్ధిమంతునకేల పొసఁగని సఖ్యంబు, పరమయోగికి నేల ప్రజలరచ్చ మహిరాజునకునేల బహుజనద్వేషంబు, కార్యవంతునకేల కడుఁ జలంబు కీర్తికామునకేల కెరలినలోభంబు, మంచివానికి నేల మంకుగుణము |
|
|
కీడుమేలును మతివితర్కించి చూచి, భవ్యగుణములను గొల్చి బ్రతుకవలయు కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ. |
4 |
|
మరణంబు లేకుండ మందుచేఁ గలిగినఁ, గాలునకేటికిఁ గలఁగ బాఁఱఁ బాయంబు చెడని యుపాయంబు దొరకిన, నేయెడ ముదిమికి నేలతలఁకఁ గామితార్థము లిచ్చు కామధేనువు గల్గఁ, గఱవున కేటికి వెఱచి యొదుఁగ వజ్రదేహంబు గా వరము సిద్ధించిన, శస్త్రాస్త్రముల కేల జలదరింప |
|
|
శరణుసొచ్చిన యటువంటి జనులకెల్లఁ, గావఁ బ్రోవఁగఁ దాతవు గలవు నీవు కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ. |
5 |
|
కులమువారల కియ్యకో లైన దిల్లాలు, వరుసతో రక్షించువాఁడు తండ్రి ప్రియముతోఁ జన్నిచ్చి పెంచినయది తల్లి, తనకుఁ దోడగువాఁడు తమ్ముఁడరయ నాపదం బెడఁబాపునాతండు బంధుండు, వంచన సేయనివాఁడె భటుఁడు మోక్షమార్గము చూపు ముఖ్యుండె యాచార్యుఁ, డాత్మకు నిష్టమౌనతఁడు సఖుఁడు |
|
|
ఎఱిఁగి వీరలతోఁ బొందునెఱపవలయు, గుఱుతెఱింగిన సద్వివేకులకు నెల్ల కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ. |
6 |
|
శౌర్యంబు గలుగుట జన్మసాఫల్యంబు, శాంత మాత్మవివేక సాధనంబు మానంబు దనకును మహనీయ సంపద, సిగ్గుతో బ్రతుకు సంజీవనంబు సవినయవచనంబు సర్వవశ్యకరంబు, వెలయునాచారంబు వెనుబలంబు దానంబు సేయుట తన కది దాఁచుట, సజ్జనసంగతి సౌఖ్యమొసఁగు |
|
|
గాన బుధులీ గుణంబులు మానకెపుడు, తగిలి మిమ్ముభజింతురు తలఁచితలఁచి కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ. |
7 |
|
ధరదేవతాలయ ద్రవ్యసక్తుఁడు గాక, తొడిఁబడ బ్రాహ్మణద్రోహి గాక చెనసి పతివ్రతాజనకాముకుఁడు గాక, వాఁడిమి నగరఁ గొండీఁడు గాక గర్వముతోడ నొక్కట మదాంధుడు గాక, పరఁగ నవిశ్వాసపరుఁడు గాక కుటిలవర్తనమునఁ గ్రూరచిత్తుఁడు గాక, సకలశాస్త్రములందు శఠుఁడుగాక |
|
|
మెలగనేర్చిన యట్టి ధార్మికునకెందుఁ, గలుగు శుభములు మీ కటాక్షంబువలన కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ. |
8 |
|
గడుసరిఁ దాటోటుఁ గష్టు వేడుకకానిఁ, గలహప్రియుని ధూర్తుఁ గపటచిత్తు సుంకరి జూదరి జూటు ననాచారి, మునిముచ్చుఁ జలపాది ముడియవిడుపుఁ గుచ్చితు నపకారిఁ గుటిలాత్ము నవివేకిఁ, గైలాటకానిఁ డక్కరిఁ దుటారి వేఁటకానిఁ బిసాళి వెఱ్ఱి నప్పులపోతు, మాయదారిని జారుమద్యపానిఁ |
|
|
జేరవలదు మఱిపొందుసేయఁ దగదు మానవున కర్థితోఁ గలలోననైన కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ. |
9 |
|
జలకంబు తగుపాటి జపము దేవార్చన బ్రాహ్మణసేవ పురాణగోష్ఠి దానంబు చోరశాత్రవ వినిగ్రహచింత, స్వజనగజాశ్వరక్షణము గణన యాప్తమంత్రి పురోహితాలోచనంబులు, రాజ్యాధిధనవిచారంబు భుక్తి సంగీతసాహిత్య సౌఖ్యానుభవములు, గూఢచారుల కొల్వు గుప్తనిద్ర |
|
|
సలుపవలయును బ్రతిదివసంబునందు, నయమెరింగినయట్టి భూనాయకుండు కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ. |
10 |