| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శల్యపర్వము - ప్రథమాశ్వాసము |
| క. |
శ్రీ గిరిజాసమవాయమ | హాగురు తరశుభగ సంపదాలంబ! సదా యోగిజన క్షేమ సమీ | హాగర్భిత దివ్యచిత్త! హరిహరనాథా! |
1 |
| క. |
దేవా! జనమేజయ ధా | త్రీవల్లభుఁ డుత్సుకత్వరేఖాసౌమ్య శ్రీవిలసితుఁడై యిట్లనుఁ | దా వైశంపాయనున కుదాత్త వినీతిన్. |
2 |
| క. |
దురమున నమ్మెయిఁ గర్ణుఁడు | పరిమార్పంబడిన నల్పపరిజనుఁడై య క్కురుపతి యజయ్యులగున | య్యరులయెడం బిదప నెట్టులయ్యె? మునీంద్రా! |
3 |
| తే. |
ఏను మును విన్న యక్కౌరవేంద్రపాండు | విభు తనూజుల చరితంబు వేడ్కఁ బెంచెఁ జెవుల తియ్యంబు దళుకొత్తఁ జెప్పు మనఘ! వారిదైన యనంతర వర్తనంబు. |
4 |
| వ. | అని యడిగిన వైశంపాయనుం డమ్మహీనాయకున కి ట్లనియె నట్లు కర్ణుండు దెగిన దుర్యోధనుండు హతావశిష్ట వసుధావరులు పరివేష్టింపఁ గొంచెపు మూఁకలతోడ విడిదలకుం జని సుహృజ్జనంబులు దేర్ప విషాదం బుడిచి సముత్సాహదోహలియై శల్యునిం దనకు సేనాపతిఁ గావించి వేగుటయు బలుపుఁబొలుపును వెలయఁ బొలికలనికి నడచెఁ బాండవేయులును బలంబుతోడం బన్నియేతెంచిన నయ్యిరువాఁగునకు సురాసురసమరంబునుం బోని సంగ్రామం బయ్యె నంత మధ్యాహ్నంబున నమ్మద్రపతి యుధిష్ఠిరు పరాక్రమంబునం దెగియెఁ బదంపడి తనభటులుం జెలులుఁ జుట్టంబులును సమసిన నుక్కుదక్కి యక్కురువిభుం డనిపని సాలించి వెఱం బొందెడుడెందంబుతో నొక్కరుండునుం దొలంగం బాఱి యొక్క మడువుసొచ్చి దాఁగి యుండె నట గెలుపునుబ్బునం బొంపిరివోవు పాండవేయు లతం డందునికి యెఱింగి యయ్యెడకు నరిగి నలిరేఁగి చుట్టుముట్టి పిలిచిన వెడలి వడముడి తోడిపెనంకువం బెద్దయుంబ్రొద్దు పెనంగి యాభూనాథుండును బ్రొద్దు సాల వాలినప్పుడు భీముగదాఘాతంబునఁ దొడలు విఱిగి పడియె నంత నిశాసమయంబున నశ్వత్థామ కృపకృతవర్మలు దనకుం దోడుగా ధర్మనందనస్కంధావారంబుఁ బొదివి పాంచాల ప్రభద్రక మాత్స్య ప్రభృతి శేషసైన్యంబుల సమయించె మఱునాఁడు సంజయుండు కురుక్షేత్రంబున నుండి పూర్వాహ్ణంబునఁ గరినగరంబున కరుగుదెంచి. | 5 |
| చ. |
పొరిఁ బొరి మోము బాష్పజలపూరము గ్రమ్మఁగ నూర్ధ్వబాహుఁడై చరణయుగంబు దొట్రువడ సంభృతశోకత రాజవీథి నె వ్వరిఁ గనియైన హా మహితవైభవ హా ధృతరాష్ట్రపుత్ర! హా కరిపురనాథ! యం చెలుఁగు గద్గదికం దగులంగ నేడ్చుచున్ || |
6 |
| క. |
జననయన చకోరానం | దనుఁడగు నృపచంద్రుఁ డనుచితంబయిన విధం బున నస్తమించె నంచుం | దనుడోలన భరితభూరిదైన్యుం డగుచున్. |
7 |
| వ. | చని ధృతరాష్ట్ర మందిరంబు ప్రవేశించి లోపలికొలువున గాంధారియుం గోడండ్రును విదురుండును మఱియును దగు చుట్టంబులునుం బరివేష్టింపఁ గర్ణులేమికిఁ బ్రేముడించు పలుకులు సెల్ల నుల్లంబు దురపిల్లనున్న యన్నర నాథుం గని డగ్గుత్తికవెట్టుచుఁ దనపేరు సెప్పికొని చేరి పాదప్రణామం బాచరించి యేడ్పు బెరయు నెలుంగుతో నిట్లనియె. | 8 |
| సీ. |
‘జననాథ! శల్యుండు సమసె సౌబలుఁడు గీ | టడఁగె నులూకుండు మడిసె సకల సంశప్తకులుఁ గడచనిరి కాంభోజశ | తానీకములు దెగటాఱె యవన పార్వతీయమ్లేచ్ఛబలములు ద్రుంగె నల్ | దిక్కులమన్నీలుఁ దక్కుఁగలుగు నరనాయకులును జచ్చిరి కుమారులు గల | యందఱుఁ దెగిరి కర్ణాత్మజులును |
|
| తే. |
బొలిసిరయ్య! వృకోదరు పలుకు దప్ప | కుండఁ దద్గదాదండప్రచండనిహతి రెండు దొడలును విఱిగి ధరిత్రిఁ బెలుచఁ | గూలి రూపఱి రారాజు ధూళి బ్రుంగె. |
9 |
| వ. | మఱియు ధృష్టద్యుమ్నుండును శిఖండియు నుత్తమౌజుండును యుధామన్యుండును లోనుగాఁ గల పాంచాలురును జేదిమాత్స్య ప్రభద్రక ప్రభృతి బలంబులు లోనుగా నవశిష్టజనంబులును నీమనుమలైన ప్రతివింధ్యాది ద్రౌపదేయులును సకల రథసామజ ఘోటక సుభటసమేతంబుగా మృతిఁ బొందిరిట్లు కౌరవ శిబిరంబును బాండవస్కంధావారంబును విధి వశంబున వనితావశేషంబులయ్యె నిందుఁ గృపకృతవర్ములు నశ్వత్థామయుఁగా మువ్వురును నందుఁ బాండవు లేవురును గృష్ణసాత్యకులుగా నేడ్వురును భవత్సుతుండయిన యుయుత్సుండును శేషించి రివ్విధంబునఁ బదునొకండు నేడక్షౌహిణులు నఖిలక్షోణికి దుర్యోధను నధిపుఁ గావింపనుం జంపనుం బూను కాలంబగుటయు నాలంబున నిశ్శేషత్వంబు నొందె’ నని చెప్పుటయు నమ్మహీపతి మూర్ఛిల్లె. విదురుండును వివశుండై యొఱగె. గాంధారియుఁ గోడండ్రును జెయ్వేది పుడమింబడిరి; తక్కటిచుట్టంబులు మొగంబులు మొగుడం జిత్రరూపంబుచందం బైరి. సంజయప్రయత్నంబున నందఱుం గ్రమంబునం దేఱి రప్పుడు మేను వడంక న మ్మానవనాథుండు నలు దిక్కులకు మొగంబు ద్రిప్పి విదురునుద్దేశించి ‘పుత్రహీనుండ ననాథుండ నగుట యెఱింగితిఁ దమ్ముండ! యిటమీఁద నీవ నాకు గతి యగు’ మనుచు మగుడనిగుడు మూర్ఛాతిశయంబునం బరవశుండయిన నతండును నారీజనంబును శీతాంబుసేచనంబులను లలితవ్యజనవీజనంబులను గొండొకసేపునకు సేదదీర్చినం గూర్చుండి యక్కురువిభుండు గుంభనిక్షిప్త భుజంగంబు చందంబున నిశ్వాసంబు నిగుడ్చుచు నూరకున్నం గనుంగొని యక్కాంతాసముదయంబును సంజయుండును రోదనంబు సేసిరి, పదంపడి యవ్విచిత్రవీర్యనందనుండు. | 10 |
| ఆ. |
అనఘ! వశము గాదు మనసు గోడండ్ర మీ | వదినెఁ జుట్టములను సదనములకుఁ బుచ్చు మనియెఁ బలుకు లచ్చుపాటడఁచు గ | ద్గదిక దైన్య మెసఁగ విదురుతోడ. |
11 |
| క. |
అనుటయు నాతం డందఱ | కును మెలపునఁ జెప్ప వగలఁ గుందుచు నల్ల ల్లన తమనిలయంబులకును | జనిరి మఱియు నేడ్చుచుండె సంజయుఁ డలఁతన్. |
12 |
| వ. | అమ్మేదినీశ్వరుం డేది గతి? యని దుఃఖాతిశయంబునఁ జేతులు విదిర్చి యా సూతనందను దిక్కు మొగంబయి. | 13 |
| క. |
‘చావరు నొవ్వరు పాండవు | లేవురు నని నీవు చెప్ప ని ప్పలుకులు దుః ఖావేశకరములై చే | తోవృత్తి దహింపఁ జొచ్చె దుర్భరభంగిన్. |
14 |
| క. |
తనయు లని నందఱుం బడి | రనఁగా విని పెక్కు పఱియలై పోవక యి ట్లునికి యరయ వజ్రమయం | బని తలఁపఁగఁదగు మదీయ మగు హృదయంబున్. |
15 |
| ఉ. |
కన్నులు చీకులై సుతనికాయము బాలవిహారలీలలుం జెన్నగు ప్రాయమొంది విలసిల్లు తెఱంగును జూడఁ గాన కి ట్లున్నను బంధుకోటి సమయోచితలాలనఁ బల్కుపల్కులన్ విన్నవి వీనులిప్డు గొఱవిం దముఁ జూఁడినయట్ల పొక్కెడిన్. |
16 |
| వ. | అని దుర్యోధను నుద్దేశించి. | 17 |
| సీ. |
ఇట రమ్ము నన్నుఁ గౌఁగిటఁ జేర్పు కొడుక! మీ | యమ్మ నూరార్ప రావయ్య వృద్ధు లగు మమ్ము విడుచుట దగునె? యేగతిఁ బోవు | వారము సెప్పుము? కౌరవేంద్ర! యంధత్వవికలుల నరయక యి ట్లుపే | క్షించితి నామీఁదఁ గృపయుఁ బ్రియము నెక్కడ వోయె? భూమీశులు గొలువంగ | నుండుదీ వ ట్లొంటి నున్నవాఁడ | |
|
| తే. |
వధికబల దుర్నివారుండవైన నీకుఁ | బాండుపుత్రుల చేత నప్పాటఁ జావు వచ్చె నిచ్చలు భక్తిమై వచ్చి కొలిచి | గారవింప నింకెవ్వరు గలరు నాకు? |
18 |
| వ. | కయ్యంపుమాట పుట్టినయప్పుడు నీవు నాతోడ. | 19 |
| శా. |
‘చాపాచార్యుఁడు భీష్ముఁడుం గృపుఁడు నశ్వత్థామయుం గల్గ నా కీ పాండుక్షితిపాలపుత్రులెదు రిం దెవ్వాఁడు దృప్యద్భుజా వ్యాపారుం డనిఁ గర్ణుఁడొక్కరుఁడు మాయం జేయు మద్బాణవి ద్యాపారీణత గెల్తు నొక్కఁడన యే నయ్యేవురన్ వ్రేల్మిడిన్. |
20 |
| తే. |
మున్ను చెప్పినవారు గా కెన్నఁ గలరు | సుమ్ము! బాహ్లిక భగదత్త సోమదత్త శకుని భూరిశ్రవశ్శలశల్యసింధు | రాజ విందానువిందాది రథికవరులు. |
21 |
| క. |
ఏనును గర్ణుఁడు దమ్ములు | నా నలువురు వీరులైన నటు సూడు పృథా సూనుల నెట్ల జయించెద | నో నమ్ముము నా బలంబును గలితనంబున్.’ |
22 |
| క. |
అని యూఱడిల్లఁ బలికిన | విని భవదీయానివార్య విక్రమమునఁ బాం డు నరేంద్రసుతులు దెగుదుర | యని తలఁచితి నీవె తెగితె యవ్వీరులచేన్? |
23 |
| క. |
అమరనదీతనయుఁడు సిం | హము గాక నరుండె? పార్థుఁ డట్టి మహాత్మున్ సమయించెనట్లు జంబుక | సముని శిఖండిఁ గొని విధి కసాధ్యము గలదే! |
24 |
| చ. |
శరగురుఁడట్టి యోధుఁ డటె చచ్చె ననిన్ దొర గాని వానిచే వెరవున లావునన్ జనులు వెక్కసమందఁగఁ జేయు సింధుభూ వరుఁడటె! రిత్తవోయె ననివార్యుల బాహ్లిక సోమదత్తులం బరు లవలీలఁ జంపిరటె! పల్కుదు నేమని యేను దైవమున్? |
25 |
| క. |
నీ నమ్మిన భూరిశ్రవుఁ | డేనికలా వతఁడు నెందు నెనలేని మగం డైన భగదత్తుఁడును వ | మ్మైన తెఱంగట్టె! యేమి యందుఁ గుమారా! |
26 |
| ఉ. |
నచ్చిన కర్ణు విక్రమమునం బరవీరులయందొకండునుం జచ్చుట లేదు దుర్దమము శల్యభుజావిభవంబు లోకముల్ మెచ్చినయట్టి దందు నొకమేలు వినంబడ దమ్మహాత్ములన్ మ్రుచ్చులఁ జంపినట్టులు పరుల్ దెగటార్చిరి దైవ మిచ్చినన్. |
27 |
| తే. |
కొడుక! తమ్ములు దోడ్పడఁ గడఁగి శత్రు | వరుల గెలిచెద నంటి వొక్కరుఁడు దక్క కుండ నీ తమ్ముఁ గుఱ్ఱల నూచముట్టు | గొనియెనే విధి! యేగతిఁ జనుదుఁ జెపుమ! |
28 |
| క. |
కదిసి పవనజుఁడు బెట్టుగ | గద వ్రేసినఁ దొడలు విఱిగి కయ్యపునేలన్ మదమఱి పడినప్పుడు నీ | మది నేమని తలఁచితో కుమార! యెఱుంగన్!’. |
29 |
| వ. | అని పెక్కు భంగుల విలపించి. | 30 |
| చ. |
తలఁపఁగ భాగ్యవంతుల కుదాత్తశుభంబగుఁ గాక పుణ్యహీ నుల కది గల్గనేర్చునె తనూభవు లాఱడిఁ బోయిరింకఁ గా నలఁ జరియింపఁ బోవుటయ నా కుచితం బటు గాక చండినై నిలిచితినేని మాటలనె నిచ్చలు భీముఁడు చూఁడుచుండఁడే! |
31 |
| క. |
విను దుర్యోధన దుశ్శా | సనులఁ బలికి పలికి నిచ్చ చావుగ నప్పా వని యలఁచుఁ గాన నడవికిఁ | జనుటయ మేలైన తెఱఁగు సంజయ నాకున్!. |
32 |
| వ. | అని పలికి యత్యంత దుఃఖదూషితస్వాంతుం డగుచు నమ్మహీకాంతుండు నిట్టూర్పు నిగిడించి యా సూత నందనున కిట్లనియె. | 33 |
| క. |
‘సురసరిదాత్మజుఁడును శర | గురుఁడును గర్ణుండుఁ దెగుటకుం దలఁకక యె వ్వరి బాహుబలముగొని యే | మరి కోల్తల సేసి రొక్కొ! మనవా రనికిన్.’ |
34 |
| వ. | అని తన కొడుకు చలం బూహించి. | 35 |
| చ. |
‘మును విదురుండు సెప్పె నతిమూర్ఖమనోగతి యైన యీ సుయో ధను చరితంబు గీ డఖిలధాత్రిజనంబులకుం బొనర్చు నా శన మని దానిఁ గొంద ఱవిచారులు పాటిగఁ బట్టరైరి నా కును మది వారికె ట్లటుల కుత్సిత మయ్యె విధాత త్రిప్పునన్. |
36 |
| క. |
అప్పు డటు లతఁడు సెప్పఁగఁ | దప్పఁ దలంచిన ఫలంబు దగఁ గుడువక పోఁ జొప్పడునె సూతనందన! చెప్పు మనికి నెవ్వఁ డమరు సేనాపతియై? |
37 |
| చ. |
దురమున నర్జున ప్రకట దోర్విభవంబు నెదుర్పఁ జాలు ను ద్ధుఁడొకరుండు గల్గెనె విధూతవిరోధిబలుండు శల్యుఁ డె వ్వరి భుజశక్తిఁ జిక్కెఁ? గురువర్గము సంక్షయమట్లు సెల్ల దు స్తరబలభాసి భీముని గదంబడియెం గురుముఖ్యుఁ డెమ్మెయిన్? |
38 |
| వ. | కృపకృతవర్మాశ్వత్థామ లెబ్భంగి బ్రతికిరి? ధృష్టద్యుమ్న శిఖండి ప్రముఖ పాంచాలురును జేది మాత్స్య ప్రభద్రక ప్రభృతి బలంబులును నా మనుమలైన ప్రతివింధ్యాది ద్రౌపదేయులును దక్కునుం గలుగు యోధవీరులు నెవ్విధంబున మృతిఁ బొందిరి? పాండవు లేవురును బద్మనాభసాత్యకులును యుయుత్సుండును నెత్తెఱంగునఁ దెగటాఱక తప్పి రింతయుఁ బరిపాటిఁ దేటపడం జెప్పు’ మనిన విని సంజయుండు ధృతరాష్ట్రున కిట్లనియె. | 39 |
| ఉ. |
సూతసుతుండుఁ జేయఁగల శూరులు దర్పసమగ్రభూపతి వ్రాతముఁ బెక్కుదంతిరథవాజి భటావలులున్ భుజాబల స్ఫీతులు పాండునందనులచేఁ దెగటారిన నోడి వీటికిన్ నీ తనయుండు హీనరథినీయుతుఁడై యటు లేఁగి నెవ్వగన్. |
40 |