| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శల్యపర్వము - ప్రథమాశ్వాసము |
| వ. | మందిరంబుఁ బ్రవేశింపక యొక్కబయల నిఖిలబంధుమిత్రపరిజనవృతుండై నిలిచె నయ్యవరసరంబునఁ గృపార్ద్రచిత్తుండై కృపాచార్యుం డన్నరేంద్రున కిట్లనియె. | 41 |
| క. |
‘సమరము మిముబోంట్లకు ను | త్తమ ధర్మం బిదియ తొంటి ధాత్రీశులు కృ త్యముగఁ గొని యాచరించిరి | తమకు సుగతి గోరి కీర్తితస్ఫురణమెయిన్. |
42 |
| క. |
ఐనను నొకపలు కడ్డము | గా నొడివెద దానిలెస్సగా విని యది మే లైనను జేసెదు గాదే | న్మానెద వేర్పడఁగ వినుము మనుజాధీశా! |
43 |
| చ. |
అమరనదీ తనూభవుఁడు నస్త్రగురుండును కర్ణుఁడుం బరా క్రమమహనీయు లావహధురంధరు లట్టిర తక్కుఁ గల్గు భూ రమణులు బంధుమిత్రులు దురంబున నందఱఁ బాండునందనుల్ సమయఁగఁ జేసి రట్లు భుజశక్తియు దైవబలంబు నెక్కుడై. |
44 |
| చ. |
వెరవును లావునుం గలుగు వీరులు పోరులఁ బడ్డ హీనతం బొరసితి మస్త్రశస్త్రహతి భూవర చిక్కినవారు నొల్లఁ బో యిరి విను పాండురాజసుతు లేవురు గంటికి రెప్పచందమై హరి తముఁ గావఁగా వెలసి రక్షతదేహవిలాససంపదన్. |
45 |
| క. |
శ్వేతాశ్వపాటవం బు | ద్ద్యోతితమై మెఱయఁగాఁ జతుర్దంతరుచి స్ఫీత మగు గజముక్రియ నరుఁ | డాతత కురుసైన్యసరసియందుఁ జరించున్. |
46 |
| క. |
జ్యారవము నాదముగ నతి | ఘోరత వైరులను కరటికోటికి రయదు ర్వారం బగు నర్జున కం | ఠీరవము శితాస్త్రనఖపటిష్ఠతఁ జూపున్. |
47 |
| తే. |
అర్జునోదగ్ర దవశిఖ హరిమహాని | లంబు ప్రేరేఁప వైరిబలప్రకీర్ణ గహనదహనవిహార ముగ్రముగఁ జలుపఁ | దేఱి చూడను రాకున్కి దెల్ల మధిప! |
48 |
| ఉ. |
ద్రోణుఁడు సూతనందనుఁడు ద్రోణ తనూజుఁడు నేను శల్యుడుం ద్రాణపరాయణత్వమున దర్పము సూపఁగఁ నీవుఁ దమ్ములున్ బాణపరంపరల్ గురియ ఫల్గునుఁ డందఱ మీఱి సైంధవ ప్రాణము నాఁచికోలు నరపాల! తలంపఁగ మర్త్యకృత్యమే! |
49 |
| ఉ. |
ఇంతకుమున్ను సెల్లెఁ బదియేడుదినంబుల సంగరం బతి శ్రాంతతఁ గుంది రిందుఁ గలసైనికు లద్దెసఁ గల్గుయోధు లా క్రాంత విరోధిదర్పుఁడు పురందరనందను బల్మికల్మి ని శ్చింతత నుల్లసిల్లెదరు చెక్కు చెమర్పక కౌరవేశ్వరా! |
50 |
| క. |
బలవిక్రమ ఘనులగు దొర | లిలిగిన మనసేన మేదినీశ్వర! విను క న్నులు సెడినట్లున్నది యీ | కొలఁదిం బొరిగొనుట నరునకున్ సుకరమగున్||’ |
51 |
| వ. | అని చెప్పి కృతవర్మ శల్య గురుపుత్రులను దన్ను నెన్ని. | 52 |
| క. |
దామోదరు తమ్ముండును | భీముఁడు నిరుగెలఁకులందుఁ బేర్చి తఱుమ ను ద్దామగతి నడరు కవ్వడి | కే మిందఱుఁ దలఁప నొక్క యెత్తుకుమారా! |
53 |
| చ. |
అనిలసుతుండు పూన్కి బలుపారఁగఁ గొండొక దీర్చె నేపు నొం దిన భుజసంపదం గొఱఁత దీర్పఁగ నింకఁ గడంగకుండునే? మనకు నజాతశత్రుని సమంచితమార్దవ మూఁది సంధి సే య నుచితమైన కాలమిది యాగ్రహముం జొరనీకు చిత్తమున్. |
54 |
| క. |
సమరము నిష్కారణవై | రమునం బాటిల్లె నెల్ల రాజులు భరతో | త్తములును మడిసిరి విడు కో | పము; దీర్ఘ క్రోధుఁడైనపతి కీడొందున్. |
55 |
| క. |
తమకు బలం బెక్కినతఱి | సముచితమగు విగ్రహంబు శత్రుల కుత్సా హము మీఱినపుడు గర్త | వ్యము సంధి యనంగ విందు మార్యులచేతన్. |
56 |
| క. |
కలవారెల్లను దెగి నీ | తలన నిలిచెఁ గార్య మధిప! తగ నొడఁబడు మి ట్టలమగు నాత్మవినాశము | కలుగుట యది విపులపాతకం బండ్రు బుధుల్. |
57 |
| క. |
తనకై కాదే! మదినె | ల్లను గోరుట వినుము దాఁ బ్రళయమొందెన యే నిని వారని యుద్యోగం | బునకు ఫలంబేమి? రాజపుంగవ! చెపుమా! |
58 |
| క. |
నినుఁ గాచికొనుము నీ వు | న్నను సర్వమ గల్గు ధర్మనందనునిఁ దగం గను మతఁడు రాజునని తన | మనమున నెక్కించుకొనఁడు మదగర్వంబుల్. |
59 |
| తే. |
రాజ్యభాగంబు దగ ధృతరాష్ట్రునకును | నీకు నన్నదమ్ములకు నా నృపతి యొసఁగు నాతఁ డెపుడు శుశ్రూష సేయంగఁ గోరు | గురుజనములకుఁ గావునఁ గూడుటొప్పు. |
60 |
| చ. |
హరియును గా దనండు గరుణాన్వితులై తగ నమ్మహాత్ము లె ప్పరుసునఁ గార్యనిశ్చయము పల్కినఁ గీచకవైరియుం బురం దరతనయుండునుం గవలు దానికి మార్పులుకంగ నెమ్మెయిం జొర రగు సంధియెట్లు ననసూయత నూల్కొని చేయు మిత్తఱిన్. |
61 |
| ఆ. |
ఇంత చెప్పు టనికి నేనోడి ప్రాణ ర | క్షణము సేసికొనుట గాదు నీకుఁ బథ్యమనియుఁ దఱిమి పల్కితి విను విన | వేని నొచ్చి తలఁచె దిట్టులగుట. |
62 |
| వ. | అని యగ్గౌతముండు శోకాయత్తచిత్తుం డగుచుం దనకు హితోపదేశంబు సేసిన విని దుర్యోధనుండు వేఁడి నిట్టూర్పు నిగిడించి యొక్కింత సేపు చింతాక్రాంతుండై యూరకుండి వ్రాల్చిన కనుదోయి విచ్చి యవ్విప్రవరు మొగంబు సూచి యిట్లనియె. | 63 |
| చ. |
‘చెడుటకు నోర్వ కీ విటులు చెప్పితి నాకు హితంబు నెయ్య మె క్కుడు గలయట్టి చుట్టమునకున్ నయశిక్ష దగుం గదా! భరం పడి బవరంబులం బెనఁగు భంగిని గార్యము దెల్పఁ జాలిన ప్పుడు నిను రక్షణార్థివని భూసురసత్తమ యే నెఱుంగుదున్!. |
64 |
| వ. | నీ కూర్మి పేర్మింజేసి దొలఁగింపం జూచి సంధి కర్తవ్యంబని పలికితివి గాని యప్పలుకులు నాకు రుచియింప వెట్లంటేని. | 65 |
| సీ. |
కపటంపు జూదంబు ఘటియించి రాజ్యంబు | గొని ధర్మజుని మది గుందఁ జేసి సభ కేకవస్త్ర రజస్వల నమ్మెయిఁ | బాంచాలి ముందల పట్టి యీడ్చి సంధిసేయఁగఁ బూని శౌరి యేతెంచిన | నవ్విధంబున నప్రియం బొనర్చి పలువురు గూడి సౌభద్రు నొక్కని బాలుఁ | గిట్టి యత్తెఱఁగున గీటడంచి |
|
| తే. |
నేఁడు దుశ్శాసనుని ఱొమ్ము, నెత్తు రనిల | సుతుఁడు మదమునఁ ద్రావుట సూచి కొఱఁత ప్రతిన దీర్చు నతండని భయముఁ బొంది | పొందు గోరిన నదియేల పొసగుఁ జెపుమ? |
66 |
| ఉ. |
రాజులు భక్తిఁ గొల్వఁగ ధరావలయం బఖిలంబు దర్పవి భ్రాజిత వృత్తి నేలి యనురక్తులఁ బ్రోచుచు శత్రుకోటికి న్దేజము దప్పఁ జేయుచు నతిప్రమదంబున నున్న నాకు నిం కాజియె కాక యొక్కని దయం గను రాజ్యసుఖంబు లేటికిన్? |
67 |
| వ. | నిశ్చయం బిట్టిద యగుటం జేసి. | 68 |
| ఆ. |
పొడుతు నెట్లు పాండుపుత్రులతోఁ గయ్య | మేను నీవు దీనికియ్యకొనుము పలుకు వినమి గాఁగఁ దలఁపకు ముచితంబు | తెఱఁగు ధీరజనుల కెఱుఁగరాదె? |
69 |
| చ. |
విభవమునుం బ్రతాపమును విశ్రుతకీర్తియు మాయ ధర్మపు త్రభటసమానవృత్తమున దైన్యమునొందుట కోర్వరాదు వీ తభయతఁ బోరఁ బేర్కొని యుదాత్తపదంబున కేఁగి భీష్మ కుం భ భవ జయద్రథాదు లగు బంధులమిత్రులఁ గూడు టొ ప్పగున్. |
70 |
| వ. | అంత వలవ దిమ్మాట మగపాడి కాడితిం గాని. | 71 |
| ఆ. |
ఏను దెంపుచేసి యీ యున్నరథిక జ | నంబుతోడఁ గడఁగి నడవ బెట్టు దఱిమి పాండురాజతనయుల మర్దింతు | ననఘ! నీవు మెచ్చునట్లు గాఁగ!’ |
72 |
| చ. |
అన విని చుట్టు నున్న నృపులందఱు సంతస మంది యన్నరేం ద్రుని వినుతించి యోటమికి రోయుట నొందిన చింతవంత యె ల్లను దిగఁ ద్రోచి నెమ్మనములన్ రణకౌతుక మావహిల్లు నా ననములు దోఁప దర్పవచనంబుల సేనకు నుబ్బొనర్చుచున్. |
73 |