పురాణేతిహాసములు శ్రీమహాభారతము శల్యపర్వము - ప్రథమాశ్వాసము
దుర్యోధనుఁడు శల్యుని సేనానాయకుంగాఁ జేయుట (సం. 9-6-5)
వ. అని పలికిన నీ సుతుండు ప్రీతుండై కనకకలశంబుల సరస్వతీజలంబులు దెప్పించి శాస్త్రోక్తప్రకారంబునఁ దగురాజులుం దానును సేనామధ్యంబున భద్రవిధానోపేతంబుగా నమ్మద్రవిభు నభిషేకించి బలాధిపత్యపట్టబంధంబు నిర్వర్తించిన శంఖభేరీప్రముఖమంగళతూర్యరవంబులు సెలంగ సైనిక సింహనాదంబు లుల్లసిల్ల నప్పు డా శల్యునుద్దేశించి దీవనలం బొగడ్తల నఖిల జనంబులును ముఖరులయి రిట్లు సంతసిల్లి సపరివారంబుగాఁ గురుభూమీశ్వరుండు విశ్రామంబు నొందె. నట్టియెడ మున్ను సమరజయంబునం బ్రమోదభరితుండగుచు నిజశిబిరంబునకుం జనిన పాండవాగ్రజుండు బంధుమిత్రపరిజనంబులఁ దమతమ విడిదలకుం బోవం బనుపక యుచితప్రదేశంబునఁ బేరోలగంబుండి మనవారివలనివిశేషంబు లరయఁ జారులం బనిచినవాఁడై వారలు మగిడి వచ్చునంతకు నే మేని వినోదంబులం బ్రొద్దువుచ్చి యక్కడి యుత్సాహంబు తెఱంగంతయు విని యచ్యుతునాననం బాలోకించి యిట్లనియె: 88
చ. ‘కురుపతి మద్రరాజుఁ దనకున్‌ బలముఖ్యునిఁగా నొనర్చి సం
గరమున కుత్సహించె నధికప్రమదంబున వారిసేనయుం
దిరమయి పేర్చియున్నయది దీనికి నెయ్యది సేయువార? మీ
వరయుము కార్యవృత్తి హృదయంబునఁ బాండవరక్షణోత్సుకా.
89
వ. నీ వెట్లు నిశ్చయించి పలికె దట్ల సేయుదు’ ననిన నమ్మహీకాంతునకు మురాంతకుం డి ట్లనియె: 90
సీ. శల్యు నెఱుంగుదు శౌర్యధైర్యంబు | లగ్గల మాతనికి బాహుబలఘనుండు
గాంగేయకుంభజకర్ణుల మిగిలెడుఁ | గాదేని సముఁడగుఁ గాని యసదు
గాఁ దలంపఁగరాదు కౌరవపతి మాన్యుఁ, | జేయుట నధికవిజృంభణంబుఁ
జూప భీమునకు నర్జునునకు నెనయంగ | రాదు సాత్యకి కోర్వరాదు పార్ష
 
తే. తునకుఁ దత్సోదరులకు మార్కొని పెనంగి | బ్రదుక రాదు నీవీట నా బల్లిదునకు
నెదురు రథికునిఁగాన ననేక హేతి | నిపుణశార్దూలవిక్రమ! నీవు దక్క.
91
క. ఒరులయినఁ బెక్కు దినములఁ | బొరిగొను నీ బలము నెల్లఁ బొరివోవ నతం
డరిభంజన! నీ వైనం | బరమోత్సాహమున నెల్లి పడవై తతనిన్‌.
92
ఆ. అతఁడు మేనమామ యను కృప దక్కుము | రాజధర్మమును బురస్కరించి
యతుల విక్రమక్రియా పాటవంబున | నవ్విరోధినామ మడఁపవలయు.
93
క. గాంగేయునిఁ గుంభజుఁ గ | ర్ణుం గడచితి మింక నుద్ధురుండగు మద్రే
శుం గూల్పు మంతతోడఁ దె | గుం గురుపతి పని జయంబు గొనుము కడంకన్‌.
94
వ. అనిన విని యుధిష్ఠిరుం డతని కిట్లనియె. 95
ఆ. ‘అనఘ! నీవు చెప్పినట్టులు సేసెద; | మున్ను పలికినాఁడ నన్నరేంద్రు
కడిమి నాకుఁ బాలుగాఁ బూని యుద్యోగ | వేళయందు నెల్ల వినుచునుండ.
96
వ. సదనంబునకుం జని సుఖనిద్ర సేయు మని పలికి పద్మనాభునిఁ దమ తమ్ములను ధృష్టద్యుమ్న శిఖండిసాత్యకి ప్రముఖులను దక్కటి పరిజనంబులను నిజమందిరంబులకుం బోవం బనిచి వీతశల్యంబైన మాతంగంబు చందంబున శయ్యాతలంబు సేరె బలం బంతయు నత్యంత సంతుష్టంబై విశ్రాంతి నొందె నారాత్రి యే నిట వచ్చి నీకుఁ గర్ణువృత్తాంతంబు సెప్పి నీవు వనుప మగిడి చని తెలతెల వేగునప్పుడు కౌరవసేనాసన్నివేశంబు సేరితి నా సమయంబున. 97
క. కురుపతి పడవాళ్ళం దగు | దొరలకడకు సత్వరముగ దురమునకు భటో
త్కరము ననువు సేయుటకై | బరవసము దలిర్పఁ బనిచెఁ బార్థివముఖ్యా!
98
వ. పనిచిన నెల్లవారు నుల్లంబుల నుత్సాహంబు లుల్లసిల్లఁ దమతమ చతురంగంబులకు సవరణలు సంఘటింపం దొడంగినఁ దూర్యంబులు సెలంగ నొండొరులఁ బిలుచునెలుంగులు నింగిముట్ట రథనేమిగజపద తురంగఖురపుటభటచరణ సంఘట్టితంబగు ధరణీతలం బద్రువ బహుళంబగు నులివు చంద్రోదయ సమయఘూర్ణమానంబగు మహార్ణవంబు నినదంబు ననుకరించె; న ట్లాయితంబై శల్యశకుని కృతవర్మాశ్వత్థామలును దక్కునుం గల యోధవరులును నొక్కెడ ననుజసహితుండై యున్న మనుజపతి సన్నిధిఁ గూడి యతండు వినఁ దమలో నిట్లనిరి. 99
క. ఒకఁ డొకఁడ పాండవులఁ దాఁ | కక సైన్యోపేతగాఢగతి నందఱు నొ
క్కొక తలగాఁ దలపడి వా | రి కడంక యుడుపఁగవలయుఁ గ్రీడయ పోలెన్‌.
100
వ. మన మొకళ్ళొకళ్ళకుఁ బ్రాపగుచు నేపారి పోరినం జుల్కన గెల్పు గొనవచ్చు నిత్తెఱంగు మనకు సమయంబు సుండీ! యట్లుగాక యొంటి పెనంగెడివాఁడును బెనఁగెడివానిఁ గని కూడుకొనని వాఁడును బంచవిధ పాపంబుల నొందఁగలవాఁడని యొండొరులకుం జెప్పికొని కదలి యుద్దామసామర్థ్యంబున నమ్మద్రపతి ముంగలియై నడవం జనునప్పుడు. 101
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )