పురాణేతిహాసములు శ్రీమహాభారతము శల్యపర్వము - ప్రథమాశ్వాసము
దుర్యోధనుఁడు శిబిరంబు విడిచి సరస్వతీతీరంబు చేరుట (సం. 9-4-49)
వ. చెలంగిన కృపకృతవర్మాశ్వత్థామ శకుని శల్యులు గార్యంబు విచారించి కౌరవేశ్వరు నాలోకించి ‘మనమీరాత్రి శిబిరంబున నిద్రించుట యొప్పదెట్లనినఁ గర్ణుందెగటార్చుటం జేసి పేర్చినయుబ్బునఁ బాండవులు పైకొని పరాక్రమింప నప్పళింపఁ గలుగుఁ బో యని తలంచెదము. వినుము వంచనఁ దొలంగియుండి మనకుం గల చతురంగంబుల నాయితంబు సేసికొని పెనఁకువం బన్ని వారికి వెఱఁగగునట్టి బెట్టిదంపుటురవడిం గదిసి రణంబు సేయుద మట్లైన జయంబు గొనవచ్చు’ నని చెప్పిన నవ్వసుమతీపతి ప్రీతుండై యది లెస్స వెర వట్ల చేయుదమని సముచితభంగిం దగువారల కెఱింగించి కదలి యచటికి రెండామడ యగు సరస్వతిపొంతం బయలికి బలంబులం గొని చని సకలజనవాహనసహితంబుగా నమ్మహానదియం దిచ్ఛానురూపస్నానపానంబు లాచరించి వలయు తెఱంగున వెనుక నడతెంచిన వివిధాహారంబులం దుష్టిఁ బొంది యిష్టాలాపంబులు సెల్లుచుండ నున్న సమయంబున ము న్నాకర్జంబు నడపిన దొరలును జిత్రసేనాది భవత్కుమారులును గర్ణుకొడుకు సత్యసేనుండును లోనైన యాప్తజనంబు లమ్మనుజనాథున కి ట్లనిరి. 74
చ. ‘వెరవును లావునుం గలిగి విక్రమసంపద సొంపు మీఱి భూ
వర భవదీయమైన బలవర్గము నొడ్డన మేర్ప వీఁకమైఁ
బురికొలుపంగ నిర్భయతఁ బోరెడు నట్లుగఁ దాను ముందరై
తిరముగఁ జేయఁ జాలు నొకధీరు నొనర్పుము సైన్యనాథుఁగన్‌.’
75
వ. అనిన విని వృషస్కంధుండును పీనదీర్ఘభుజార్గళుండును భర్గవరలబ్ధజన్ముండును దివ్యాస్త్రవేదియు నవ్యాహతవిక్రమోద్దాముండును నగు నశ్వత్థామ నాలోకించి యాదరభరితుండగుచు నాధరణీవరుండతని కిట్లనియె. 76
ఆ. ‘అనఘ! నీవు నాకు నాచార్యునట్లు | నేడుగడయుఁ గాన హితము సెప్పఁ
దగు బలాధినాథుఁడుగఁ జేయ నర్హుని | నెల్ల వినఁగ నిశ్చయింప వలయు.’
77
చ. అనుటయు నాతఁడిట్టులను ‘నజ్జనపాలున కాజి నైపుణం
బున మహనీయశౌర్యమును భూరిబలంబును సర్వసత్త్వవే
దనముఁ బరాక్రమోద్ధతియు ధైర్యసమగ్రతయుం గలండు శ
ల్యుని రథినీపతిత్వమహిమోజ్జ్వలుఁ జేయుము కౌరవేశ్వరా!
78
క. నినుఁబట్టి పాండుపుత్రులఁ | దన మేనల్లురఁ దొఱంగె ధరణీశ్వర! యీ
తనిఁగడచిన పరమహితులు | మనకుఁ గలరె? యితఁడు లోకమాన్యుఁడు గాఁడే?
79
తే. కార్తికేయుం డధీశుఁడుగా నమర్త్యు | లెలమిఁ బురికొని దైత్యుల గెలుచుకరణి
మద్రవిభుఁ డగ్రణిగఁ నేచి మనము నడచి | కడిఁది పగఱ జయింతము కౌరవేంద్ర!’
80
వ. అనిన విని సమస్త జనపతులును ‘జయ జయ’ శబ్దంబులతో శల్యుం బరివేష్టించి సంగరోత్సాహంబునం బొంగిరి. కురునాథుండును గద్దియ డిగి సవినయంబున నమ్మద్రవిభున కభిముఖుండై యిట్లనియె. 81
ఉ. పొచ్చెము లేని నెయ్యమునఁ బూని విపద్దశనొందకుండఁగా
నెచ్చెలిఁగావఁ జూచు మహనీయున కిట్టిద కాల మిప్పు డీ
వచ్చుపడంగ నీ భుజబలాతిశయంబున నద్భుతంపు గె
ల్పిచ్చి కృతార్థుఁ జేయు నను నే నినుఁ జెందియుఁ దూలఁ బోదునే?
82
క. పూనుము చమూపతిత్వము | నా నమ్మినవారు నేను నరవర బలసం
తానంబుతోడఁ బరిజన | మై నడచెద మాక్రమింపు మరివర్గంబున్‌.’
83
చ. అన విని శల్యుఁ డిట్లనియె ‘నమ్మనుజేంద్రును కిప్పు డింత ప్రా
ర్థన మొనరింప నేల? వసుధావర! యే నినుఁ జేరి నప్డ నా
ధనమును బ్రాణమున్‌ బలవితానము నీకు సమర్పణంబు సే
సినయవి గావె? నీ పనుపు సేసెదఁ గౌరవసేనఁ గాచెదన్‌.
84
మ. భుజవీర్యంబున నచ్యుతార్జునులు నన్‌ బోలంగ లే రల్క వ
చ్చి జయింపంగఁ గడంగినన్‌ సురలు నాచే నొత్తు రే నేచి య
క్కజపుంజేవయు లావు జూపువడికిం గౌంతేయులే యోర్తు రా
ప్రజయున్‌ నీ ప్రజయుం దలంగఁ జెలఁగం బాటింతు నాటోపమున్‌.
85
చ. అఱిముఱి బాణజాలముల నక్కడి సైనికులం దెరల్చెదన్‌
గుఱుకొని నాకు మాఱుకొని కోల్తలఁ జేసిన వీరవర్గమున్‌
నఱికెదఁ జూచు ఖేచరగణంబుల కచ్చెరుపా టొనర్చెదన్‌
బఱపెదఁ బాండునందనులఁ బాఱక నిల్చిన రూ పడంచెదన్‌.
86
శా. గంగానందను పోటు మెచ్చక గురుం గాదంచు రాధాతనూ
జుం గీడాడుచు నీతఁ డెవ్వఁ డొకొ యంచున్‌ శల్యుఁడే! యిట్టి వా
నిం గయ్యంబుల మున్నుగాన మనుచు న్వేభంగులం జూప ఱె
ల్లం గీర్తింప ధనుఃకళానిపుణలీలాఖేలతన్‌ జూపెదన్‌.
87
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )