పురాణేతిహాసములు శ్రీమహాభారతము శల్యపర్వము - ప్రథమాశ్వాసము
శల్యభీమసేనుల గదాయుద్ధము (సం. 9-10-42)
క. ఉరవడి రథికజనంబులఁ | దెరలిచి యేపారు తనదుతేరు మెఱయ ను
ద్ధురగతిఁ గౌంతేయాగ్రజు | నరదమునకుఁ గవిసె వాలురమ్ములు నిగుడన్‌.
167
సీ. కనుఁగొని భీముండు గన్నుల నిప్పులు | రాల శుండాలకీలాలరంజి
తంబును రిపుసైన్యదైన్యప్రదంబును | నాత్మీయవాహినీహర్షకరము
నై శతధారా మహాభుజగ క్షమా | ధరశృంగసమత నుదగ్ర మగుచు
నెనిమిది యంచుల నెసఁగు మెఱుంగుల | దారుణంబగు గదాదండ ముగ్ర
 
తే. రేఖ సారించి రౌద్ర ముద్రేక మందఁ | గదిసి మద్రాధిపుని తురంగములఁ జదియ
మోఁదె నాతండు దోమరమునఁ దదీయ | విపులవక్షంబు భేదించె నృపవరేణ్య!
168
క. ఉరమున నాటిన ఘనతో | మరమును డాచేతఁ బెఱికి మారుతి మద్రే
శ్వరుసూతుఁ వైచె దానన | ధరణిని బోరగిలఁబడ నుదగ్ర స్ఫురణన్‌.
169
మ. విరథుండై పొలివోని దర్పమున నవ్వీరుండు ఘోరంపు ము
ద్గరముం గేల సమర్చి తేరు డిగి దుర్దాంతాకృతిన్‌ వజ్ర భా
సురశక్రుండును దండచండ యముఁడున్‌ శూలోగ్ర ఫాలాక్షుఁడున్‌
సరి సేయందగువారు గాఁగఁ బొలిచెన్‌ సంస్తుత్యసంరంభతన్‌.
170
వ. ఇ ట్లవష్టంభ విజృంభితుండైన యాసేనాధిపతిం జూచి యేచి భీముఁ డుద్దామరభసంబున నతనికి సమ్ముఖంబుగా నడరినఁ బణవాది వాదిత్ర నిర్భరనినదంబులు సెలంగె, నప్పు డయ్యిరువాఁగు నిరువుర నేనికపోరు చూచు విధంబునఁ గనుఁగొనుచు గదారణంబునకు శల్యుండు దక్క మారుతి మార్కొనఁ జాలు మేటిమగలు నివ్వడముడి వెలిగా నిమ్మద్రపతిమీఁదఁ గవియునట్టిజెట్టి బిరుదులుం గలరే? యనుచు నచ్చెరువొందుచుండ. 171
ఆ. మండలప్రచార మహితాకృతులు గర్జ | నలుగఁ బొలిచి మాఱు మలసి ఱంకె
లెసఁగఁ బోరి కమరి యేపారు వృషభయు | గంబునట్లు వారు గవిసి రధిప!
172
చ. మదమున నిమ్మెయిం గదిసి మద్రవిభుండును భీమసేనుఁడున్‌
గదలమెఱుంగు లాకసము గ్రమ్మఁగ నుద్భటభంగిఁ ద్రిప్పి బె
ట్టిదముగ వ్రేయ నిప్పులు వడిం దొరఁగించె సమగ్రవిస్మయ
ప్రదరవభంగులై యవి పరస్పరఘోరవిఘట్టనంబునన్‌.
173
వ. ఇట్లు దొడంగి. 174
క. ధిక్కారంబులు చరణద | భక్కారంబులును మెఱయ బలువు వెరవు పే
రుక్కును నెక్కుడు వేగము | నక్కజములుగా నుదీర్ణులై పోరునెడన్‌.
175
చ. వెరవున నంగముల్‌ నుసులవ్రేటులు వమ్ముగఁ దాఁకినప్డు ది
క్కరి రదన ప్రహారములఁ గంపము నొందకయుండు మేదినీ
ధరములఁ బోల్పఁ బట్టగు నుదగ్రపుమూర్తుల కిద్దఱందు ని
ష్ఠుర రభసంబు శౌర్యము పటుత్వము ద్రాసునఁ బెట్టిన ట్లగున్‌.
176
వ. ఒక్కొక్కమా ఱుబ్బున. 177
క. ఎనిమిది యడుగుల కొలఁదిని | వెనువెనుకకుఁ బోయి నిగిడి వేగంబునఁ గి
ట్టిన తగళులకైవడిఁ దాఁ | కు నగంబుల భంగిదోఁచుఁ గురుకులముఖ్యా!
178
వ. ఇత్తెఱంగునం బెనంగి నెత్తుట జొత్తిల్లినయంగంబులు పుష్పిత కింశుకంబులఁబోలఁబరిశ్రమంబు నొందియుఁ బొలివోవని దర్పంబున. 179
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )