| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శల్యపర్వము - ప్రథమాశ్వాసము |
| క. |
ఇరువురును సందు సూడక | వెర వెడలిన యాగ్రహముల వ్రేసిన గద లొం డొరుల మెడలకెలఁకుల బ | ల్నరములు దాఁకుటయు వా రిలం బడి రధిపా! |
180 |
| వ. | ఇవ్విధంబున నమ్మహావీరులు మూర్ఛిల్లుటయు నుభయసైన్యజనంబులును హాహాకారముఖరులై రట్టియెడఁ గృపాచార్యుండు శల్యుకడకుఁ దన రథంబు రయంబునం బఱపించి. | 181 |
| క. |
పడియును గద విడువని య | క్కడిఁదిమగని గ్రుచ్చి యెత్తి గారవమున నం దిడి తొలఁగం గొనిపోయెను | వడముడి దెప్పఱియె నంత వసుధాధీశా! |
182 |
| వ. | తెప్పిఱి లేచి చూచి సేద దేఱని యమ్మద్రపతిం బేరుకొని యుద్దండగదాదండమండితంబైన కరంబునం బిలిచె నయ్యుద్ధతి సహింపఁజాలక సింహనాదంబుతోడఁ దూర్యస్వనంబులు సెలంగఁ గురుభూవరు ముందరి సైనికులు రభసంబుగా నతఁడునుఁ గూడికొని తఱుమఁ గవిసినం గౌంతేయాగ్రజునగ్రభాగంబున రథికులు చేకితానపురస్సరులై యార్పులు నింగిముట్ట నయ్యనిలతనయుఁ దలకడచి వారిం దలపడి పెనంగి రప్పుడు. | 183 |
| శా. |
ఆ కౌరవ్యవిభుండు వజ్రకఠినంబై యొప్పుప్రాసంబు దీ ప్తాకారోజ్జ్వలవృత్తి నెత్తి నిజసైన్యం బుబ్బునం గ్రాలఁ గే లీకల్పంబుగ మింట జంట మెఱుఁగు ల్నిండం బ్రదీప్తక్రమ శ్రీకాంతుండగు చేకితానుఁ బడవైచెం జూప ఱగ్గింపఁగన్. |
184 |
| వ. | ఇట్లు చేకితానుండు వీతాసుండైనం గని కౌంతేయులు గోపాటోపంబున సైన్యోపేతగతిం గడంగి కౌరవసైన్యంబుపైఁ బటుబాణంబులు గురియుచు నడరిన శల్యుండు ధర్మపుత్రుని దుర్యోధనుండు ధృష్టద్యుమ్ను నమ్మహీపతిపనుప నశ్వత్థామత్రిగర్తులు మూఁడు వేల రథంబులవారు వివ్వచ్చుని మహోత్సాహంబున మార్కొనిరి. తక్కటి యోధులు సేనయు నవ్విరోధి వరూథిని గలయం బెరయుటయు నక్కజంబయ్యె నప్పుడు పెంధూళి యెగసి చూడ్కులు నిగుడకున్నను సైనికుల సింహనాదంబులు సెలంగం జేయుటయు బిరుదులు ప్రకటించుటయు బోధకంబుగాఁ బోరిన బోరనఁ దొరఁగుఁ శోణితం బారేణువు నడంచినఁ బ్రియం బంది యిరువాఁగును ‘వ్రేయుండు పొడవుం’ డను నెలుంగులు నింగి ముట్టఁ బెనంగు నట్టియెడ. | 185 |
| చ. |
బరవస మొప్ప మద్రపతి పాండవముఖ్యునిమీఁదఁ గాండముల్ గురిసిన నానృపాలుఁడు నకుంఠితుఁడై పదునాల్గు తూపుల న్నరపతి మేనఁ గ్రుచ్చి యెలనవ్వున నొప్పిన నమ్మహీశు పే రురమున నాటె నారథికుఁ డొక్క సముజ్జ్వలబాణ మేడ్తెఱన్. |
186 |
| వ. | నాటినం గనలి యమ్మనుజేంద్రుండు చంద్రసేనుం డను తదీయచక్రరక్షకుం దునిమి నవనారాచంబులు సారథిమేన నిగిడించె. | 187 |
| ఆ. |
అపుడు శినివరుండు ననిలపుత్రుఁడుఁ జేది | బలము శల్యుఁ దీవ్రభంగి బొదువ నాతఁ డా ధనంజయాగ్రణిఁ బటుతర | పంచమార్గణముల నొంచె నధిప! |
188 |
| క. |
విను మిరువదియేడమ్ముల | శినిమనుమని యు బ్బడంచెఁ జేదిరథికులం దునిమెం దీవ్రశరోత్కర | మున నిరువది యేవురన్ సముద్భటభంగిన్. |
189 |
| క. |
కవలు తనమీఁద రయమునఁ | గవిసిన నిశితతరసాయకములను మౌర్వీ రవము సెలంగఁగ వారల | యవయవముల నినిచె నతఁ డహంకృతి మెఱయన్. |
190 |
| చ. |
కనుఁగొని ధర్మసూతి భుజ గర్వమెలర్పఁగ బెట్టు గిట్టి శ ల్యుని మెయిఁ దీవ్రమార్గణసముత్కరముం బరఁగించి కేతువుం దునిమిన నాతఁ డా పతికిఁ దూపుల వేఁడిమి సూపి వాయుసూ నునిఁ గవలన్ శినిప్రవరు నొంచె వడిం బదియేసి యమ్ములన్. |
191 |
| ఉ. |
నొంచి మదించి ఖేచరమనోహరుఁడై వడి ధర్మపుత్రు స్రు క్కించి మహోగ్రబాణపరికీలితదేహునిఁ జేసె దానఁ గో పించి శితాస్త్రముల్ గవలు భీముఁడు సాత్యకియుం గడంక గు ప్పించిన వానిఁ ద్రుంచి శరపీడితదేహులఁ జేసె వారలన్. |
192 |
| వ. | చేసి యొండొక భాసితధ్వజం బెత్తించి మెఱసిన. | 193 |
| సీ. |
భీముఁ డాతని మెయి బెడిదంపు నారసం | బడరించి వెండియు నట్టి వేడు వఱపె సాత్యకి శతబాణంబు లతనిపై | బెట్టేసె మాద్రి తొల్పట్టి యైదు తీవ్రాస్త్రముల సహదేవుండు పదునాలు | గమ్ముల నవ్వీరు నంగకములఁ బరఁగించి రమ్మద్రపతి భీమసేనాదు | లైన యన్నలువుర నతిరయమున |
|
| తే. |
వరుస డెబ్బదిమూఁటను నిరువదేను | వాఁడి తూపుల నేనింట మూఁడు మార్గ ణములఁ బీడితులుగఁ జేసి నఱకె భల్ల | నిహతి సహదేవుచాపంబు నృపవరేణ్య! |
194 |
| శా. |
ఆ మాద్రీసుతుఁ డన్యచాపధరుఁడై యత్యుగ్రబాణంబులన్ మామా! యెక్కడఁ బోయె? దంచు వెస నమ్మద్రేశు నేయంగ ను ద్దామోదగ్రత భీమసాత్యకులు శాతప్రస్ఫురన్మార్గణ స్తోమంబుల్ గురియంగ ధర్మసుఁతుడుం దూపుల్ మెయిం గ్రువ్వఁగన్. |
195 |
| చ. |
కలయఁగ నెత్తురుల్ దొరఁగ గైరిక నిర్ఝరజాలరంజితా చలమును బోలి పొల్పెసఁగి శల్యుఁడు వారల నస్త్రపంచకం బుల వెస నొంచి త్రుంచెఁ గురుభూవర! ధర్మజు చాప మమ్ముతో బలమును శౌర్యమున్ సురలు ప్రస్తుతి సేయ మహోగ్రమూర్తియై. |
196 |
| ఉ. |
వేఱొక చాపమెత్తి పృథివీవర! ధర్మతనూజుఁ డింతతోఁ దీఱఁగఁ జేయుదుం బగ యతిప్రకటంబుగ నంచు సూతుమైఁ దూఱఁ దురంగమాంగములు దూఁటులు వోవఁగ శల్యునెమ్ములన్ గీఱ సిడంబు గాఁడఁ బరఁగించె సముజ్జ్వలచండకాండముల్. |
197 |
| వ. | ఇవ్విధంబున విజృంభించిన. | 198 |