పురాణేతిహాసములు శ్రీమహాభారతము శల్యపర్వము - ప్రథమాశ్వాసము
ధృష్టద్యుమ్నసాత్యకులచేత సాళ్వుఁ డేనుంగుతోడఁ బీనుంగై పడుట (సం. 9-19-24)
వ. ధృష్టద్యుమ్నుం డెదుర్కొనిన నతనిఁ ద్రొక్కించువాఁడై యవ్వీరుండు వారణపతిఁ గొల్పిన నతండు. 314
మ. పటునారాచచయంబు కుంభయుగళీభాగంబునన్‌ బెట్టు నా
టుటయుం గ్రొవ్వఱి పాఱె నగ్గజము సాటోపంబుగాఁ గ్రమ్మఱిం
చుటకున్‌ సాల్వుని మెచ్చెఁ గన్గొను జనస్తోమంబు కోపోద్గమో
ద్భటవేగంబున వచ్చి పట్టె నది యాపాంచాలు తే రుగ్రమై.
315
క. ఆతఁడు గద చేతం గొని | భీతి గదురుమనముతోడఁ బృథ్వికి దాఁటన్‌
సుతాశ్వసమేతంబుగ | నా తే రయ్యేనుఁ గెత్తె నాకసమునకున్‌.
316
ఆ. ఎత్తి త్రిప్పి యాడి యిలతోడ వ్రేసి పా | దములఁ జదుపఁ జూచి దారుణాస్త్ర
తతులు నిగుడఁ బవనతనయ శిఖండి సా | త్యకులు సాల్వుఁ దాఁకి రతిరయమున.
317
క. అతఁ డందఱ బాణంబులు | వితథంబులు సేసి యస్త్రవిద్యాపారీ
ణత సూపె నవ్విధం బ | ద్భుతము నినిచె గగనచరతతులచిత్తములన్‌.
318
వ. అప్పుడు. 319
తే. ఆజ్ఞ పాటించి మదివెఱ యుజ్జగించి | రయము మెఱయ నప్పాంచాలరాజసుతుఁడు
గదిసి యెగసి కుంభస్థలి గదఁ బగుల్పఁ | గొండ గూలిన ట్లక్కరి గూలె నధిప!
320
క. ఆలోనన శినివరుఁడు వి | శాలాస్యప్రదరనిహతి సాల్వునిశిర మా
భీలముగఁ ద్రుంప నాతఁడు | గూలిన మనమూఁక విచ్చెఁ గురువంశనిధీ!
321
ఉ. వాలి యెలుంగు సూపి కృతవర్ముఁడు సైన్యము నిల్వరించి యు
న్మీలిత విక్రముం డగుడు మేమెయి నాతనిఁ దాఁకె నస్త్ర వి
ద్యాలసితుండు సాత్యకి యుదగ్రత వారలు పోర వారి దో
ర్లీలలు సూచి రోటువడి రెండు బలంబులు యోధవీరులున్‌.
322
వ. ఇట్లు పెనంగు చుండి. 323
క. కృతవర్ము నొంచె నెనిమిది | శితశరముల శినివరుండు శినివరుచాపం
బతఁడు దునిమె బలువిలుగొని | యతని హయంబులను సూతు నాతఁడు గూల్చెన్‌.
324
మ. విరథుండై యభిరామశూలమున నవ్వీరుండు శైనేయు వై
చె రయం బార నతండు భల్లమునఁ ద్రుంచెం బెక్కు తుండంబు లై
తొరుఁగం జూచి విషాదియై నిజరథ స్థుం జేసి తద్బాణగో
చరతాదుర్దశ కా వృథోద్యముఁ గృపాచార్యుండు దప్పించినన్‌.
325
క. మన సేన విఱిగె నృప నీ | తనయుం డొక్కరుఁడు నత్యుదగ్రతఁ గుంతీ
తనయుల నద్దెసఁ గల యో | ధని కాయముఁ బొదివె బాణధారలఁ బెలుచన్‌.
326
మ. పతి యిమ్మై సముదీర్ణవిక్రమకళాపారీణుఁడై విద్విష
చ్చతురంగంబులయందు నొక్కటియు విస్ఫారోల్లసన్మార్గణ
హతికిం దప్పక యుండునట్లుగ సమగ్రాశ్చర్యసంపాదకో
ద్ధతబాహావిభవంబు సూపె సురబృందస్తోత్రపాత్రోద్ధతిన్‌.
327
వ. అప్పుడు రెండు వీళ్ళ నతని పాటిమేటిమగలు లేరనుబుద్ధి నాకుం బొడమెఁ బదంబపడి పాండవులును జేయఁగల వారలును నవ్వీరుం బొదివిన నతం డందఱ కన్ని రూపులై ధర్మసుతుని శతశరంబులను భీమసేను డెబ్బది సాయకంబులను సహదేవుని నైదింటను నకులు నఱువదినాల్గింటను ధృష్టద్యుమ్నుని సప్త మార్గణంబులను ద్రౌపదేయుల నైదైదు తూపులను సాత్యకి మూఁడు కాండంబుల నొప్పించి సహదేవుధనువు దునిమిన నక్కుమారుండు వేఱొక్క విలు గొని చలంబున నక్కురువిభుం గదిసినఁ దక్కటి రథికులుం గూడికొని యొక్కొక్కరుండు పె క్కమ్ములు పైఁ గురియఁ గేలిచందంబున వాని నన్నింటి వారించుచుఁ దత్తనువుల శోణితంబు పూరించుచు నాజెట్టి జోదు బెట్టిదుండై పెనంగ మన యోధులుం బురికొని యద్దొరల మార్కొనిరి. మన సైన్యంబు దైన్యంబు విడిచి మరలి వారిబలంబులఁ దలపడియె నట్టియెడ. 328
క. భీముఁడు గురుతనయుఁడు ను | ద్దామ భుజావీర్యశౌర్యధైర్యములు జన
స్తోమము లగ్గింపఁగ సం | గ్రామ మొనర్చిరి నితాంతగాఢస్ఫూర్తిన్‌.
329
చ. పరుషపరాక్రమస్ఫురణఁ బాండవముఖ్యుని వాజులం జతు
శ్శరహతిఁ గూల్చె సౌబలుఁడు సత్వరుఁడై సహదేవుఁ డమ్మహీ
శ్వరుఁ దనతేరిమీఁద నిడి సంగరమధ్యముఁ బాపె నాతఁ డొం
డరదముమీఁదికిం జని రయంబున నయ్యరిఁ దాఁకె నుద్ధతిన్‌.
330
క. శరములఁ బొదివిన నాతఁడు | దిరమై యేయంగ రణము దివిజగరుడ ఖే
చరసిద్ధిప్రకరాద్భుత | కరప్రకారమున నొప్పెఁ గౌరవనాథా!
331
సీ. శకుని నందనుఁడును నకులుండు నొండొరు | లకుఁ జండ బాహుబలంబు సూపి
రతుల శౌర్యమున సాత్యకికృతవర్ములు | పోరిరి విలుద్రుంచి కౌరవేంద్రుఁ
డేసె ధృష్టద్యుమ్ను నేచి యొండొకవింట | నతని నాతఁడు నొంప నక్కజంపుఁ
గయ్య మయ్యిరువుర కయ్యె ద్రౌపదిపుత్రు | లేవురు పతిఁ గిట్టి యింద్రియములు
 
తే. బాలిశునిఁ జిక్కువఱిచినపగిదిఁ దలరఁ | జేయ నతఁ డీడఁబోవక సాయకములు
పెక్కు రయమున నిగిడించి యక్కుమార | వితతిఁ గలఁపఁ దత్సంగర మతిశయిల్లె.
332
వ. మఱియు ననేకు లనేకులం బొదివి పోరాడ నంతకంతకుఁ బేర్చిన యగ్గలిక మొగ్గరంబులు రెండునుం గలయం బెరసినం బేర్చిన పెంధూళి భానుబింబంబు గప్పె నప్పుడు దొరుఁగు నరతురంగమాతంగరుధిరధారల నడంగిన నధికంబైన సంగరంబునకుం గడంగిన కౌంతేయుల యురవడికి నోహటించి మన మోహరంబు దొరలు మరలిన మరలనీక నీ కొడుకు పురికొలుపుకొని తఱిమినం గనలి ధర్మసుతుండు. 333
తే. మూఁడు నారాచములఁ గృపు వాఁడి చెఱిచి | వాలి కృతవర్మహయముల నాలుగింటఁ
గూల్పఁ దనతేరిపై నిడి గురుసుతుండు | దొలఁగుఁ గొంపోయె నవ్విరథుని నృపాల!
334
చ. కురుపతి చూచి చిత్తమునఁ గోపము పెంపెసలార నేడు నూ
ఱరదము లాతనిం బొదువునట్లుగఁ బంచిన నొక్క పెట్ట బం
ధురతర వారివాహములు తోయజబాంధవుఁ గప్పుచాడ్పు దోఁ
ప రయముమైఁ గడంగి యవి పైకొని యవ్విభుతోఁ బెనంగఁగన్‌.
335
క. కనుఁగొని శికండిముఖయో | ధనికాయం బడరి యా రథప్రకరంబున్‌
సునిశితశరప్రకరములఁ | దనుమాడెన్‌ రౌద్రరసము దొలుకాడంగన్‌.
336
వ. ఆ సమయంబున మనదెస నుల్కాపాతశర్కరావర్షాదులగు నుత్పాతంబులు గలిగె వానికి శంకింపక శకుని గడంగి యోధవరులతో ‘మీరు కోల్తల సేయుం డేను బెడముట్టునఁ దాఁకి ధర్మనందనాదులను సమయించెద’ నంచు సముద్ధతిం గదిసె, నప్పుడు మద్రేశబలపురస్సరంబైన యమ్మోహరంబు రభసంబునం దఱిమి పాండవసేనా సంరంభంబున కోర్వక తిరిగిన నా సుబలసూనుండు ప్రబలతురంగ దశ సహస్రంబులతో వేగంబు మెఱయ వైరిసేనవెనుకఁ గిట్టి ‘యేను గలుగ మీకు భయం బేల?’ యని యక్కౌరవసైనికులం బేరుకొని యదల్చి యార్చిన నా కౌంతేయవాహిని కలంగినఁ గని ధర్మనందనుండు సహదేవు నాలోకించి. 337
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )