| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శల్యపర్వము - ద్వితీయాశ్వాసము |
| వ. | అత్తెఱం గెఱింగించెద దక్షకన్యకల నశ్విన్యాదు లగు సప్తవింశతి సంఖ్యలఁ జంద్రుండు వివాహం బయ్యె నందు రోహిణి రూపాతిశయవతి యగుటం జేసి తదాసక్తుండైనఁ దక్కటివారు వగ నొంది తండ్రికడకుం జని చంద్రుని యన్యాయం బెఱింగించిన, నా ప్రజాపతి చంద్రునితో నుగ్గడించి ‘యది చాల నధర్మం బింక నిట్లు సేసి తేని శపింతుఁ జుమ్మీ! సముఁడవై వర్తింపు’ మనుటయు నమ్మాట దెస ననాదరంబు సేసి యతండు వెండియుఁ దొంటియట్ల వర్తించిన నెఱింగి యమ్మహాత్ముండు కోపించి యఱుఁదెవులు గొనుమని శాపం బిచ్చిన, నయ్యోషధినాథుండు నానాఁటికిఁ గృశుం డయ్యె న ట్లాతెవులుచేత నతండు పోఁడిమి మాలిన నోషధులు పసచెడియె; దానఁ బ్రజలు డయ్యం జొచ్చి; రది చంద్రకార్శ్వహేతుకం బగుట యనుసంధించి. | 148 |
| క. |
దేవత లమృతాంశునితో | ‘నీ వేటికిఁ గృశుఁడ వైతి? నిక్కము చెపుమా!’ నావుడుఁ దనతెఱఁ గేర్పడఁ | గా వారికి నతఁడు సెప్పెఁ గౌరవముఖ్యా.!’ |
149 |
| క. |
విని వార లతనిఁ దోడ్కొని | చని ప్రార్థించుటయుఁ దగఁ బ్రసన్నుం డై యి ట్లను దక్షుఁ ‘డఖిల భార్యా | జనులయెడన్ నడవవలయు శశి సమవృత్తిన్. |
150 |
| వ. | అట్లు నడచుచు సరస్వతీజలనిధిసంగమకలితం బైన తీర్థంబుజలంబుల నిమగ్నుం డై వృద్ధిఁ బొందు; వరుసన పదియేను పదియేనుదినంబులు సంక్షయంబును బ్రవర్ధనంబు నొందం గలవాఁ’ డని చెప్పి వెండియు. | 151 |
| క. |
‘అమవస సమవస నా తీ | ర్థమునఁ గృతస్నానుఁ డై సుధాకరుఁడు ప్రవృ ద్ధి మహితతనుఁ డగు’ నని యతఁ | డమరుల వీడ్కొల్పి యా మృగాంకునితోడన్. |
152 |
| వ. | ‘వనితలకు విప్రులకు నవమానంబు సేయకుమీ!’ యని పలికి వీడ్కొలిపె నట్లు శాపమోక్షంబు గని చంద్రుం డాతీర్థంబునకుఁ జని తదీయ జలస్నానంబున నాప్యాయితశరీరుండై లోక ప్రభాసుం డయ్యె; నదికారణంబుగా నాతీర్థంబు ప్రభాసం బనుపేరం బ్రసిద్ధి నొందె; నందుండి యా రోహిణీ నందనుం డరిగి చమసోద్భేదనం బను తీర్థంబున నొకరాత్రి వసియించి, యుదపానంబునకుం బోయె; దానివిశేషం బాకర్ణింపుము. | 153 |
| క. |
త్రితుఁ డనఁగా ద్వితుఁ డన నే | కతుఁ డనగఁ దపస్విసుతులు గల; రా విప్ర త్రితయము భూపాలురకును | గ్రతుదీక్ష లొనర్చి ధేనుగణముం బడసెన్. |
154 |
| వ. | పడసి యొక్కట నేతెంచునెడ నయ్యేకతద్వితులు నిజభ్రాత యగు త్రితుని వంచించి తా రాగోవులఁ దొలంగ నడిచికొని పోవువారుగాఁ బాపబుద్ధి కుత్సహించి; రాసమయంబునఁ దెరువున నొక్కవృకం బున్నఁ దద్భయంబునం దొలంగం బోయి ప్రమాదంబున ద్రితుండు నూతం బడిన నయ్యిరువురు నతని నుపేక్షించి ధేనువులం గొనిపోయి; రమ్మునికుమారుండు నిర్జలం బైన యయ్యుదపానంబున నుండి సోమపానంబు సేసినం గాని యీ దురితంబు వాయ దని తలంచి యజ్ఞసాధనంబునకుఁ బ్రతివిధులు సంకల్పరూపంబున సంపాదించికొని క్రతువొనరించిన దేవతలు సన్నిధిసేసి హవిర్భాగంబులు గైకొనిరి. సరస్వతీజలంబు తత్కూపంబున నుద్గతంబై యా సవనపతి నుద్ధరించె; నయ్యమరులు వరం బడుగు మనిన నమ్మహాద్విజుండు. | 155 |
| తే. |
‘వినుఁ డుపస్పర్శ మిందుఁ జేసిన యతండు | వడయువాఁడు మహిత సోమపానఫలము వరము నా కిది’ యనుటయు వార లట్టు | లవుట సంప్రీతి మై నిచ్చి దివికిఁ జనిరి. |
156 |
| వ. | అట్టి యయ్యుదపానంబును సేవించి వినశనంబునకుఁ జనియెఁ; దత్తీర్థంబు హీనజాతులకుఁ బొడసూపక నశించుఁ గావున వినశనం బనం బరఁగె; మఱియు భూమికంబునకుఁ బోయె; నది యప్సరోగీతనృత్య విహారభూమి యగుట భూమికం బనఁ బ్రసిద్ధం బయ్యెఁ; బదంపడి గంధర్వతీర్థంబునకు నేఁగె; నది విశ్వావసుప్రభృతిగంధర్వతపస్సిద్ధిస్థానం; బందుండి గర్గస్రోతంబునకుఁ జనియె; నందు గర్గుండు సన్మునిసేవితుండై చిరకాలంబు వసించె; నచ్చోటు గదలి యా బలభద్రుండు. | 157 |
| ఆ. |
వినుము శంఖతీర్థమునకు నైసర్గిక | మునకు నాగధన్వమునకు వరుసఁ జనియె; నాగధన్వ మనునది వాసుకి | స్థాన మచటఁ దొల్లి సకల సురులు. |
158 |
| వ. | నాగేంద్రత్వమునకు వాసుకి నభిషేకించి; రందుండి యా నీలాంబరుండు నైమిశంబున కరిగె; నయ్యెడం దొల్లి సరస్వతి యనునేఱు దూరం బై యుండ నైమిశారణ్యవాసు లగుమునులు క్రతువు సేయం దొడంగిన; నాసరస్వతి వారల సంభావించుటకు మలంగి పాఱినకతంబునం దటసమీపం బయ్యె; నవ్విశేషంబు విని విస్మితుం డగుచు నాహలాయుధం డా తీర్థంబుఁ గొనియాడి, సప్తసారస్వతంబునకుం బోయె నచ్చట మంకణుండును మహాముని వసించుఁ దొల్లి నలినభవుసత్రంబున నైమిశారణ్యమునుల యాగంబున గయుని క్రతువున నుద్దాలకునధ్వరంబున వసిష్ఠుసప్తతంతువున గురునిసవనంబున వెండియు నొకమఱి యాపరమేష్ఠి యజ్ఞంబున హిమవత్పుష్కరాదు లైన తత్ప్రదేశంబులకు సుప్రభయుఁ గనకాక్షియు విశాలయు సురతన్వయు నోఘమాలయు సువేణియు విమలోదకయు ననునామంబుల నారీవేషయుక్తయై సరస్వతి చని యజమానసకల దేవముని సంభావన వడసె నట్టి సప్తాకారంబుల నాసంయమియాశ్రమంబునఁ బ్రవర్తించుట నది సప్తసారస్వతం బనం బరఁగె; నమ్మంకణుని చరితంబులు మఱియునుం గల వాశ్చర్యకరంబులు వినుము. | 159 |