పురాణేతిహాసములు శ్రీమహాభారతము శల్యపర్వము - ద్వితీయాశ్వాసము
భీమదుర్యోధనుల గదాయుద్ధము సూడ బలరాముఁడు వచ్చుట (సం. 9-33-2)
సీ. యదుకుల దీపకుం డగు రాముఁ డవ్వార్త | యంతకమును విని యక్కుమారు
లాత్మశిష్యులు గాన నాహవ మీక్షింపఁ | దీవ్రయానమున నేతెంచి దృష్టి
గోచరుం డగుటయుఁ, గురునాథ! తగ నెల్ల | వారు నెదుర్కొని గారవమునఁ
బ్రణమిల్లిన నతండు ప్రత్యభివందన | మాచరింపంగ ధర్మాత్మజుండు
 
తే. సమ్మదంబునఁ బరిరంభణమ్ము సేసె; | నరుఁడుఁ గవలును ద్రౌపదీనందనులును
వందనం బొనరించిరి; వారి నాతఁ | డర్హభంగి భాషణముల నాదరించె.
139
క. హరియును సాత్యకియు వినయ | భరితాంతఃకరణు లగుచుఁ బ్రణతు లయిన న
య్యిరువురను గ్రుచ్చి బెరయం | బరిరంభణ మాచరించెఁ బరమప్రీతిన్‌.
140
వ. ఇత్తెఱంగున నెల్లవారలు నాబలదేవునిఁ గాంచి కుశలప్రశ్నంబు సేసి; రయ్యాదవపుంగవుండు సదుత్తరం బిచ్చి ‘యేను బోయి పెక్కుదినంబు లయ్యె’ నని యుగ్గడించి, ‘మిమ్మునిందఱను జూచుటకును నాశిష్యులగదా యుద్ధం బనుసంధించుటకును వచ్చితి’ ననియె; నమ్మరుత్సుతుండును భవత్సుతుండును గదలు సేతులన యుండ నతనిఁ జేరి భక్తిం బ్రణామంబు లాచరించిన నతం డాదరించె; నంతఁ గౌంతేయాగ్రజుండు రౌహిణేయుతో ‘నన్నదమ్ముల యిరువుర యెక్కటిపోరు సూడు’మని పలికి వా రట్లు ద్వంద్వయుద్ధంబునకు సన్నద్ధులైన తెఱం గెఱింగించిన, నతండు ‘లెస్సకాక!’ యని యనుమతి సేసె-నని సంజయుండు ధృతరాష్ట్రునకు రామునాగమనంబు సెప్పె ననిన విని, తదీయప్రవర్తన శ్రవణకుతూహలాయత్తచిత్తుం డైన జనమేజయుండు వైశంపాయనున కిట్లనియె. 141
తే. ఉభయవాహిని సంగరోద్యోగసమయ | మున హలాయుధుఁ డేతెంచి మురహరుండు
పాండురాజసూనులయెడఁ బక్షపాతి | యని విరాటాదిబంధులు వినఁగఁ బలికి.
142
క. హరి యెఱుఁగని చక్కటియును | బురుషార్థము నా కెఱుంగఁ బోలునె? యీ ని
ష్ఠురత వినఁ జూడఁ జాలక | సరస్వతీతీర్థమునకుఁ జనియెడు బుద్ధిన్‌.
143
వ. మీ కెఱింగించి పో వచ్చితిఁ బోయి వచ్చెద’ నని వాసుదేవ ధర్మజు లొడఁబడి యనుపఁ జనియె నని వింటి బలదేవుండు తీర్థయాత్ర నిర్వర్తించిన తెఱంగును భీమసుయోధనుల గదాయుద్ధంబు చెల్లినభంగియు నతని కాలోన నచటి కేఁగుదేర సమకూరిన విధంబును వివరించి చెప్పు’ మనిన జనమేజయునకు వైశంపాయనుం డి ట్లనియె. 144
సీ. ‘వినుము నరేంద్ర! యవ్విధమునఁ జని యమ్మ | హాత్ముండు గోసువర్ణాదు లైన
దానార్హబహుపదార్థంబులు దన యగ్ని | హోత్రంబు దెచ్చుట కుచితజనులఁ
బుచ్చె ననేక విప్రుల నాప్తసచివుల | వలయు రథ ద్విపాశ్వములగముల
రావించెఁ దండులప్రముఖభోజన సాధన | ములు సంపన్నహృద్యములు గాఁగఁ
 
ఆ. దేరఁ బనిచె నిట్లు తీర్థయాత్రాసంవి | ధాన మాచరించి మాననీయ
మగు సరస్వతీమహాంభోధిసంగమ | స్థానమునకుఁ జనియె సవినయముగ.
145
వ. అది ప్రభాసం బనుపేరం బరఁగు న ట్లందులకుఁ జని తీర్థసేవనం బనుష్ఠించి యంతనుండియుఁ బథిశ్రాంతిప్రయాణంబుల సరస్వతి చేరువ నడచి తదీయ సకలతీర్థంబు లాడుచు నన్నపానంబుల నాసనశయనయానంబులను ధేనుకనకరత్నాంబరాభరణాదిద్రవ్యంబులను విప్రుల నతిప్రీతులఁ జేయుచు, బాలవృద్ధవనితావికలాంగదుర్బలప్రాయులఁ బరిశ్రాంతు లైనయెడలఁ దడిమికొని యథేష్ట ప్రకారంబుల శరీరస్థితి నడిపింపఁ దగువారిని నియోగించి మఱియు ననేకధర్మంబు లాచరించుచుఁ గురుక్షేత్రంబునకు వచ్చె’ ననుటయు జనమేజయుం డా తీర్థవిశేషంబులు వివరించి చెప్పు మనుడు వైశంపాయనుం డిట్లనియె. 146
క. మును చనియెఁ బ్రభాసమునకు | నని చెప్పితి నతని నది మహత్తరతీర్థ
మ్ము నరేంద్ర! యందుఁ జంద్రుఁడు | దన యక్ష్మం దీర్చుకొని గతవ్యథుఁ డయ్యెన్‌.
147
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )