పురాణేతిహాసములు శ్రీమహాభారతము శల్యపర్వము - ద్వితీయాశ్వాసము
కుమారస్వామి తారకాసురుం జంపి దేవతలకు ముదంబు సేయుట (సం. 9-45-63)
వ. అట్టియెడ. 187
క. తనదొరలుఁ దాను దారక | దనుజేంద్రుఁడు గార్తికేయుఁ దాఁకిన నమృతా
శన గణ సమ్మదసంపా | దనుఁ డగుచును శక్తి యతఁడు ధరియించె నృపా!
188
వ. అమ్మహనీయసాధనంబున ననేకకోటిశక్తు లుద్భవించి నానాదానవప్రకరంబుల బడలువడం జేసి, యుల్కాసహస్రంబుల పిడుగులతండంబుల మ్రోఁతచందంబున విరావం బావహిల్ల నది ప్రయోగించి యమ్మహాత్ముండు మహిషత్రిపాదభృతోదరు లను దనుజసేనాపతులం బొలియింప నిలింపసైన్యంబులు సంరంభంబున దైత్యబలంబులం దెగటార్చె; నక్కుమారుండు ప్రయోగింప నాశక్తి పగతురం బిలుకుమార్చి క్రమ్మఱఁ గరతలంబునకు వచ్చు చుండె; నత్తారకుం డట్లు దమవారు సమసిన సక్రోధుండై యగ్గుహునిఁ గిట్టి బెట్టిదం బగు నతని శక్త్యస్త్రంబులతాఁకునం బడియె; నిట్లు జయంబు సేకొని యక్కార్తికేయుండు వెలింగె; విబుధులు ప్రమోదంబు నొందిరి; పదంపడి. 189
క. బలికొడుకు బాణుఁ డనియెడు | బలవదసురవల్లభుండు బాధించు నను
ర్త్యులఁ గ్రౌంచపర్వతాశ్రయ | బలిష్ఠుఁ డయి జగము లెల్ల భయముం బొందన్‌.
190
వ. దానిని విని యమ్మహాసేనుండు. 191
మ. కడిమిం బోయి మహోగ్రశక్తినిహతిం గ్రౌంచంబు భేదించి యె
క్కుడు గర్వంబున వచ్చి మార్కొనిన రక్షోనాథుఁ దత్సైన్యముం
గడు వేగంబున రూపుమాపి మునిసంఘంబుల్‌ ప్రశంసింపఁ బె
ల్లడరన్‌ నిర్జరదుందుభిధ్వనులు పుష్పాసార మొప్పారఁగన్‌.
192
వ. త్రిభువనానందకరుం డై విజయవిభవాతిశయంబున నొప్పె; ని ట్లఖిలలోక సంభావనీయం బగు షణ్ముఖుచరితంబు లాకర్ణించి కృతార్థుండ వైతి; కౌరవాన్వయపావన! యాబలదేవువృత్తాంతంబు కొఱంత విను; మతం డత్తీర్థంబునఁ బ్రతిష్ఠితుండైన కుమారునకుఁ బ్రదక్షిణప్రణామంబు లాచరించి యందలిపెద్దలు కుమరాభిషేకంబు సెప్పఁ జెవులపండువు సేసి. 193
ఆ. అగ్నితీర్థమునకు నరిగె; నయ్యెడఁ దొల్లి | యగ్ని డాఁగియున్న నమరు లచటి
కేఁగుదెంచి కాంచి; రిద్ధశమీగర్భ | లీనుఁ డైన యతని మానవేంద్ర!
194
వ. భృగుశాపంబునం బ్రాపించు సర్వభక్షకత్వంబునకుఁ జాకల తొలంగిన యగ్నిదేవు నట్లు గని బ్రహ్మాదిదేవత లమ్మునివచనం బమోఘంబు గావున నీవు సర్వభక్షణుం డయ్యు మాలో నగ్రపూజ్యుండ వని యొడంబఱిచి నిజస్థానంబునకుం జనునప్పు డత్తీర్థంబు పరమపావనం బని తజ్జలంబులఁ గృతస్నాను లైరి; యందుండి యాసీరి కౌబేర తీర్థంబునకుం జనియె; నది కుబేరుండు తపంబు సేసి ధనాధిపత్యంబు మొదలైనవరంబులు వడసినచో; టయ్యెడఁ గదలి యతండు. 195
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )