| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శల్యపర్వము - ద్వితీయాశ్వాసము |
| సీ. |
బదరిపాచన నామ పరమతీర్థమునకుఁ | జనియె; భరద్వాజతనయ తొల్లి యచటఁ బ్రభావతి యనునది యింద్రుండు | పతి గాఁగఁ గోరి తపంబు సేయ నతఁడు వసిష్ఠునాకృతి దాల్చి వచ్చిన | నయ్యింతి యర్ఘ్యపాద్యాదు లిచ్చి భక్తితోఁ జేరి ‘మత్పాణి శక్రున కిచ్చు | దాన; నప్పూనిక మానఁ గాని |
|
| తే. |
వలయుపనిఁ బంపుఁ’ డన్న నవ్వొలయ నమ్మ | హాత్ముఁ ‘డది యట్ల యగుఁ గాని యతివ! వీనిఁ బక్వములు సేయు’ మని కొన్ని బదరిఫలము | లా నితంబినిచే నిచ్చి యవుల నుండ. |
196 |
| వ. | అదియును గృతస్నానయుఁ గలితధౌతపరిధానయు నై ప్రొయి నగ్ని రాజఁబెట్టి యాఫలంబులు జలంబులతోడఁ గూడ నెక్కించి వండుచుండ నవి పాకంబునకు రాకయుండ వెండియుఁ దన సవరించిన కాష్ఠంబులు గ్రమంబున నిడి యనలంబు ప్రబలంబు సేయఁ గాష్ఠంబులు సమసెఁ గాని యారేఁగుఁబం డ్లురియవయ్యెఁ; గాష్ఠంబులు గలయెడకుం బోయి తెచ్చునంత కగ్ని యాఱెనేని దుష్పాకం బగు నని యా మగువ తనకా లింధనంబుగా నిడి పాకంబు సేయఁ గనుంగొని పాకశాసనుం డచ్చెరువొంది ప్రత్యక్షంబై ‘శుభాంగి! నీదు నిష్ఠాతిశయంబునకు మెచ్చితి. భవదభిమతం బిచ్చితిని. తనువు విడిచి త్రిదివమ్మునకు రమ్ము. సర్వపాపహరం బైన యీ తీర్థంబు లోకత్రయప్రఖ్యాతం బయ్యెడు’ మనియె. నమ్మహాభాగయు నాసుమనోవిభునకు మనోరమ యై వెలసె; నట్టి బదరిపాచనంబుననుండి. | 197 |
| ఆ. |
ఇంద్రతీర్థమునకు నేఁగె నా బలభద్రుఁ | డచట నూఱుక్రతువు లాచరించి యనిమిషేశ్వరుండు గనియె శతక్రతుఁ | డనుప్రసిద్ధితోడ నతులపదము. |
198 |
| వ. | అచ్చోటు గదలి హలాయుధుండు రామతీర్థంబునకుం బోయెఁ; బలుమాఱు రాజుల నెల్లను బొరిగొని పరశురాముం డతృప్తుండై ప్రాయశ్చిత్తంబుగా నయ్యెడఁ గశ్యపు నుపదర్శనంబున రాజసూయంబులు నశ్వమేధంబులు వాజపేయంబులు ననేకంబు లొనర్చి యమ్మునీంద్రునకు దక్షిణ సమస్తక్షోణియు నొసంగె; నందుండి యయ్యేకకుండలుండు యామునంబునకుం జనియె; నది వరుణుండు రాజసూయంబులు సేసినప; ట్టయ్యధ్వరంబు నవసానంబున దేవాసురులకు సకలభూతసంక్షయకరం బగు చున్న సంగరంబు ప్రవర్తించె. | 199 |
| ఆ. |
అచటు గదలి యాతఁ డాదిత్యతీర్థసం | సేవనమున కరిగె ధీవిశాల! యందుఁ గ్రతు వొనర్చి యాదిత్యుఁ డుజ్జ్వల | జ్యోతిషాధిపత్యశోభి యయ్యె. |
200 |
| వ. | ద్వైపాయనుండును శుకుండును గృష్ణుండును జైమినియు దేవల జైగీషవ్యాదు లగు నైష్ఠికు లనేకు లయ్యెడ నద్భుతయోగసిద్ధిం బొందిరి. | 201 |
| తే. |
అచటినుండి సారస్వత మను వసిష్ఠ | తీర్థమున కేఁగె నా బలదేవుఁ డధిప యందుఁ దొల్లి నిష్ఠాతిశయంబుమై ద | ధీచి యనుముని నియమంబు లాచరించె. |
202 |
| వ. | ఆ నియమాచరణంబునకు నింద్రుండు శంకించి తద్విఘ్నకరణంబునకు నలంబుస యనునప్సరోవనితం బుత్తెంచినఁ దదీయదర్శనంబున నమ్ముని వీర్యంబు స్ఖలించిన దాని సరస్వతి గర్భంబుగా ధరియించి పుత్రుం గాంచి తపస్విజనగోష్ఠి నున్న యత్తపోధనుకడకుఁ దెచ్చి ‘వీఁడు నీకొడుకు; భవత్తేజంబు వృథ వోనీక యేను వహించి కాంచితి; వీనిం గైకొను’ మనిన నతండు వాని నెత్తికొని యాలింగనంబును మూర్ధఘ్రాణంబును జేసి యాసరిద్వర నాలోకించి ‘నీవు బ్రహ్మసరస్సున జనియించితి; పుణ్యనదులయందు మేటి’ వని సంస్తుతించి ‘నీజలంబులం దర్పణంబు సేసిన విశ్వేదేవతలుఁ బితరులు గంధర్వులుఁ దృప్తులౌదు’ రని యనుగ్రహించి ‘యిక్కుమారుండు నీ పేర సారస్వతుం డనం బరఁగుఁ బదంపడి పండ్రెండేం డ్లనావృష్టి యైన నయ్యాపదఁ బొంద కుండఁ బెక్కండ్రు మునుల రక్షించి వేదాధ్యయనంబులు సేయించు’ నని చెప్పి యొప్పగించిన సరస్వతి ప్రీత యై తనయుం గొని చనియె; నా కాలంబున. | 203 |
| క. |
అమరులకు నసురులకుఁ గల | హము గలిగిన బలవిరోధి యాయుధనికురుం బము సవరించు మహోద్యో | గమునఁ బ్రవర్తించె వీరకౌతుక మలరన్. |
204 |
| వ. | అ ట్లుద్యోగించి. | 205 |
| చ. |
జగముల నెందునుం బడయఁ జాల కతండు దధీచియస్థులం దగియెడునాయుధంబు లగుఁ దత్పరతం జని వేఁడ నాతఁ డి చ్చు గురుతరాక్షయోజ్జ్వలయశోనిరతుం డని పంపఁగా నిలిం పగణము వోయి వేఁడిన నృపాలక! యిచ్చె నతండు ప్రీతితోన్. |
206 |
| వ. | ఇచ్చి యతం డవ్యయలోకంబున కరిగె; నమరవరుండును దదస్థుల వజ్రాయుధంబు నొనర్చి పేర్చె; నంత నాసారస్వతుండు ద్వాదశవార్షికం బగుననావృష్టి దురితంబునఁ దన్నుఁ జేరి పిన్న యనక విద్యావిశేషకలితంబైన గౌరవంబున శిష్యత్వంబు భజియించిన యఱువదివేవురు మునుల సరస్వతీప్రభావజనితం బగు నన్నంబున రక్షించుచు వేదంబుఁ జదివించె; నా సారస్వతతీర్థంబున నుండి యాసంకర్షణుండు వృద్ధకన్యాశ్రమంబు నకుం బోయె నయ్యెడ గర్గవంశవర్యుం డగు ఖని యను తపోధనుండు. | 207 |
| తే. |
పరమతపమున నొకకన్యఁ బడసి పెంచి | దివమునకు నేఁగె; నది తపస్స్థిరతఁ బూని పతి వరింపంగ నొల్లక బ్రహ్మచర్య | మున వెలింగి య య్యాశ్రమమున వసించె. |
208 |
| వ. | పదంపడి యత్యంతవృద్ధ యై పరలోకగమనంబు గోరె; నప్పుడు యదృచ్ఛాసన్నిహితుం డైన నారదుం డక్కన్యక కిట్లనియె. | 209 |
| క. |
‘విను! పాణిగ్రహణము సే | యనివనితకుఁ బుణ్యలోక మప్రాప్యము గా వున నే యుపాయమున నై | నను దగియెడు వరు వరింపు నలినదళాక్షీ!’. |
210 |
| ఆ. |
అనిన నిజతపంబు నర్ధంబు లంచంబు | గాఁగ నిచ్చి యదియు గాలవాత్మ జుని వరించె; నతఁడు సుదతితో సమయంబు | పలికికొనియె ధరణిపాలవర్య! |
211 |
| వ. | సమయంబు నేకరాత్ర సహవాస సమ్మతికలితం; బట్లు పాణిగ్రహణ సంస్కారవతి యై యావృద్ధకన్యక దైవయోగంబున నారాత్రి మనోహరయౌవనయుఁ బరమానులేపమాల్యాంబరభూషణాభిరామయు నయ్యె; నమ్మునియుఁ బ్రీతుండై యన్నాతిసంగతి నన్నిసి గడపెఁ; బ్రభాతంబున నన్నితంబిని యతని కిట్లనియె. | 212 |
| తే. |
‘ఒక్క రేయి నీపాల నాయునికి గాఁగఁ | బలికికొన్నార; మది సెల్లె నలఘుచరిత! పోయి వచ్చెద’ నని దివంబునకుఁ బోవ | నుత్సహించె నమ్ముని మది నుమ్మలింప. |
213 |
| వ. | ఇట్లుత్సహించి ‘యిత్తీరంబున దేవఋషిపితృతర్పణపరుండై యొక్కనాఁడుపవసించినవాఁడు పంచాశద్వత్సర పరిపూరణీయం బగు నైష్ఠిక బ్రహ్మచర్య ఫలంబు వడయువాఁ’డని పలికి తనువువిడిచి దివంబున కరిగెఁ; గురువంశోత్తమా! యయ్యెడ నారేవతీపతి శల్యుండు రణంబునఁ బాండవులచేత నిహతుం డగుట విని, వగచుచు నచ్చటికిఁ జేరువ యగు శమంతపంచకంబునకుం జని, యందులమునులఁ గురుక్షేత్రవిశేషంబు లడిగిన. వార లతనికి నది ప్రజాపతి యుత్తరవేది యనియును, సమస్తదేవతలు నందు వరిష్ఠంబు లడిగిన, వార లతనికి నది ప్రజాపతి యుత్తరవేది యనియును, సమస్తదేవతలు నందు వరిష్ఠంబు లగుసత్రంబు లాచరించి రనియును, దానిఁగురుం డనురాజు దున్నుటం జేసి దానికిఁ గురుక్షేత్రం బనునామంబు గలిగె ననియు నెఱింగించిన, న య్యేకకుండలుం ‘డాభూమీశ్వరుఁ డేమి ప్రయోజనంబునకు దున్నె?’ ననుటయు, నాతపోధను లి ట్లనిరి. | 214 |