పురాణేతిహాసములు శ్రీమహాభారతము శల్యపర్వము - ద్వితీయాశ్వాసము
దుర్యోధనుఁడు భీముగదాదండమునఁ దొడలు విఱిగి పడుట (సం. 9-57-45)
క. ఆలోనం గురుధరణీ | పాలుఁ డడరి వ్రేయుటయును బవనసుతునిమై
సోలె; నది గానఁ డాపతి | కేలీవిభ్రమము దోఁపఁ గ్రేళ్ళుఱికె నృపా!
275
చ. ఉఱికినఁ దేఱి పై కుఱికి యుగ్రత భీముఁడు వ్రేయ నవ్విభుం
డుఱక మహాద్భుతస్ఫురణ నూర్ధ్వ పరిభ్రమణంబు సేసినం
దెఱపి యతండు గాంచి సముదీర్ణరయంబున వైచెఁ బెన్దొడల్‌
విఱిగి నగాగ్ర ముద్భటపవిప్రహతిం బడుచాడ్పునం బడన్‌.
276
వ. అప్పుడు మహోల్కాపాతంబులును బాంసుమాంస రక్త వర్షంబులును వికృతంబు లగు కరితురగబృంహిత హేషాఘోషంబులును మఱియు ననేకోత్పాతంబులును గలిగిన నట్లు కౌరవపతి వడుటకు నుబ్బునం బొదలిన పాంచాలురుం బాండవులు నుద్విగ్నచిత్తులైరి; వియత్తలం బంతయు నొక్కమ్రోఁతగా నగ్గదాయుద్ధ విశేషంబు లగ్గించుచు సురగరుడఖచరాదులు నిజస్థానంబులకుం జని; రిట్లు తనగదతాఁకునఁ దొడలు విఱిగి సింగంబుచేతం గూలిన గంధశుండాలంబు చందంబునం బడియున్న నీ కొడుకుం జేరం జని భీమసేనుండు. 277
తే. ‘ఏకవస్త్రఁ బాంచాలి నట్లీడ్చి తేరఁ | బనిచి సభలోనఁ బఱిచిన పాపఫలము
ననుభవింపుము దుష్టాత్మ!’ యనుచు వామచరణమున బెట్టిదము గాఁగ శిరము దన్నె.
278
వ. తన్ని యలుక మలుగక యతని యాననం బాలోకించి. 279
క. ‘పసు లని యార్చుచు మము ను | ల్లస మాడిన ధర్మహీనులను నృపధర్మం
బెసఁగఁగ నే మిదె యిప్పుడు | పసు లని యార్చెదము మగుడ బంధుద్రోహీ!
280
క. విను మేను కల్లసారెలు | గొని కపటపు నెత్త మాడుకుశలతఁ గా దొ
ప్పనివారు నేపడంచుట | ఘనబాహు స్వైరకేళిఁ గాని దురాత్మా!’
281
వ. అని పలికి పెలుచ నవ్వి ధర్మనందనగోవిందపాంచాలప్రకరపార్థసాత్యకినకులసహదేవుల నాలోకించి. 282
ఆ. ‘శంక లేక కడఁగి సభ కట్లు పాంచాలి | నంటరానిదాని నొంటిచీర
తోన యున్న సాధ్వి వేనలి వట్టి యీ | డ్పించినతనిఁ జూడుఁ డంచుఁ బొదలి.
283
వ. ‘పాంచాలి సేసినతపంబు పెంపున నీశోభనంబు సమకూఱె’ ననిన విని వారు ప్రమోదంబు నొంద మిక్కిలి సంతసంబునం దేలి యక్కురుఘస్మరుండు నర్తించుచెన్ను దోఁపఁ జెలంగి. 284
చ. ‘మును మము గొడ్డువోయి రని ముష్కరతం జెడనాడినట్టి దు
ర్జనుల ననిం గడంగి ధృతరాష్ట్రతనూజుల బంధువర్గమి
త్రనికరసైన్యకోటిసహితంబుగ గీటడఁగింపఁ గంటి; మిం
క నమరలోక మైన నరకం బయినన్‌ సరి మాకు నారయన్‌.’
285
క. అని గదఁ జేకొని నృప! నీ | తనయునిమెడ వట్టి యదిమి తల గ్రమ్మఱఁ ద
న్నినఁ గని మును దన్నుట నె | మ్మన మెరియ తదగ్రజుం డమర్షముతోడన్‌.
286
వ. హర్షావేశలఘు చారిత్రుం డగు నమ్మారుతపుత్రున కి ట్లనియె. 287
చ. ‘తల యది యేల తన్నెద? వధర్మము నొందుట కాత్మ రోయఁగా
వలవదె? రాజ రా జనుజవర్గముఁ దక్కినబంధుకోటియుం
గలపరివారముం దెగిన గౌరవ మేదకఁ బోరి సంగర
స్థలమునఁ బడ్డ నీతులువచందముచేఁత జనంబు మెచ్చునే?
288
క. మును లోకము ధర్మపరుం | డనఁ బరఁగినవాఁడ విట్టు లనుచితకృత్యం
బునకుఁ జనఁ దగునె దీనం | గనియెడుఫల మేమి? దూష్యగర్వం బేలా?’
289
వ. అని దూఱి దుర్యోధనుం జూచి బాష్పాకులలోచనుం డై. 290
సీ. ‘విధి ప్రతికూలుఁ డై వేరంబు పుట్టించి | మాకు నీవును మేము నీకు నలిగి
యితరేతరద్రోహమతిఁ దెగి యింతలు | సేయుట గావించె; నీ యధర్మ
పరతయు లోభంబు బాల్యంబు మదమును | నిన్ను నింతకుఁ దెచ్చె; నీకతమున
నాకు బాంధవ కులనాశంబు వాటిల్లె; | ధృతరాష్ట్రు కోడండ్రు తీవ్రశోక
 
తే. కారి యయినవైధవ్యంబు కారణముగ | నన్ను నిందింతు’ రనువచనములు మొదలు
గాఁగ బహు విలాపంబులఁ గరుణ మావ | హిల్ల దురపిల్లె నుల్లంబు దల్లడిల్ల.’
291
వ. అనిన విని ధృతరాష్ట్రుండు సంజయున కి ట్లనియె. 292
చ. ‘అనిలసుతుం డధర్మమున నమ్మెయిఁ గౌరవమేదినీశ్వరుం
దనయెదురన్‌ వధింపఁగ గదాసమరాఖిలధర్మవేది నాఁ
జనిన హలాయుధుండు గని సంజయ! యే మని పల్కె? నంత వాఁ
డనుజులకున్‌ మఱందులకు నట్టియెడ న్మొగమోడ నేర్చునే?
293
చ. అనవుడు నాతఁ డిట్టు లను నమ్మనుజేంద్రున కప్డు రోహిణీ
తనయుఁడు కోపవేగమునఁ దామ్రముఖుం డయి లేచి బాహు లె
త్తి ‘నృపతులార! చూచితిరె తెల్లముగా బకవైరివిక్రమం
బున తెఱఁ? గిట్టివాని మనభూములఁ గంటిమె యెన్నఁ డేనియున్‌?
294
వ. గదాయుద్ధంబున నాభికి దిగువ యగుశరీరభాగంబు నొప్పించుట ధర్మంబుగా దను శాస్త్రోక్తి వినమె? వీఁడు విచ్చలవిడిఁ దెంపు సేసె’ నని పలుకు నమ్మహాత్ముని మనంబున రోషానలంబు నముత్థితం బగుటయు నప్పుడు. 295
క. నిజరథము మీఁది హలమును | భుజశిఖరమునం దమర్చి భూమి యద్రువ వా
యుజుదెసకు నడచె నుద్భట | గజరిపుచంక్రమణ రేఖ గతియం దొలయన్‌.
296
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )