| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శల్యపర్వము - ద్వితీయాశ్వాసము |
| వ. | దానికిం బవమానసూనుండు సోదరభుజబలనిజబలంబు లేకముఖత్వంబున నెప్పుడుం గలుగు మనోబలంబు వలనం జలింప కుండె; నట్టియెడ వేగంబ వినయవినతుం డగుచు నచ్యుతుం డడ్డంబు సొచ్చి దీర్ఘవృత్తపీనంబు లగుబాహువుల హలాయుధుఁ బట్టి కైలాసశైలంబు గదిసిన యంజనమహీధరంబుమాడ్కి నొప్పి యనూనస్వరంబున నతని కిట్లనియె. | 297 |
| క. |
తనవృద్ధియు మిత్రునివ | ర్ధనమును దత్సఖసమృద్ధి ప్రబలుటయును శ త్రునిదెస నిన్నియుఁ జెడుటయు | నను షడ్విధములను దన్ను నతిశుభ మొందున్. |
298 |
| వ. | ఏతత్ప్రకారంబు విపరీతం బగుట యొప్ప; దట్లు గావున మిత్రునకుం గీడు వాటిల్లి నెడ నేర్పు గలుగునేని మైత్రిపరుం డయిన పౌరుషశాలి యది శమింపం జేయు సత్యపరాక్రము లగు పాండవులు మనకుఁ బరమ మిత్రులు; విశేషించి మన మేనత్తకొడుకు, లనీతిపరులచేతం బరిభవింపంబడినవారు గావున వీరల కభ్యుదయంబు గలిగించుట నీకుం గర్తవ్యంబు. | 299 |
| తే. |
ప్రతిన నెఱపుట నృపులకుఁ బరమధర్మ | మగుట మనమునఁ జర్చింపు; మనిలసుతుఁడు గద సుయోధను తొడలు భగ్నములు సేయు | వాఁడు గా సభఁ బూనినవాఁడు గాఁడె? |
300 |
| వ. | అట్లుంగాక మైత్రేయమహాముని శాపంబున దుర్యోధనుతొడలు భీమసేనుగదాఘాతంబున భగ్నంబులు గాఁ గలయవి యై యుండె; నిప్పు డట్లయ్యెం గావున దీన దోషంబు దోఁపదు; క్రోధం బుపసంహరింపుము; కుంతీనందనుల యభివృద్ధి మనకు సమృద్ధిఁ జేయు’ ననిన నతనికి హలాయుధుం డి ట్లనియె. | 301 |
| తే. |
‘ఓపి ధర్మార్థ కామంబు లొకటి నొకటి | నాశ మొందింప కుండంగ నడపవలయుఁ గాక! ధర్మంబు సెడ నర్థకామములను | గోరు పురుషుండు నిందకుఁ గుదురుగాఁడె? |
302 |
| క. |
మునిశాపంబును బ్రతినయు | నని చెప్పితి; గలుగుఁ గాక!’ యని విను ధర్మం బున వానిన్ నెఱపక యి | ట్లనిలసుతుఁడు గలఁచెఁ గాదె యన్నెఱి యెల్లన్.’ |
303 |
| చ. |
అన విని కృష్ణుఁ డిట్టు లను ‘నాతనికిన్ నిను నిజ్జగంబు ధ ర్మనిరతమానసుండు మధురత్వనిరూఢుఁడు దోషదూరుఁ డం చనిశము సంస్తుతించును మహాత్మ! యడంపుము క్రోధ; మీతఁడుం దనదు ప్రతిజ్ఞ కై రిపు గదాహతుఁ జేసె; నధర్మ మే లగున్? |
304 |
| వ. | అదియును నిలిచి మార్కొన్న యప్పుడును నడచు నెడను గాదు; పొడ వెగసి పై కుఱికినఁ దన్నుం గాచికొనుటయుం బ్రతిన నెఱపుటయును గారణముగా దొరకొనిన నాభికి దిగువ గదా! యని యుడిగి చావ వచ్చునే? గద నూరుభంగంబు సేయుదు ననుభీమసేను పూనికి పదుమూఁడు వత్సరంబులేని వేఁచిన యది యక్కులపాంసనుం డేల తలంపకుండె? మఱచెనేనిం జెడుఁగాక! మనకేమి? కలియుగంబు చొరవ యాసన్నం బయ్యె; నివ్విధంబులు ధర్మంబు లై చెల్లకుండునే? యట్లుంగాక పుట్టినంతనుండియుం గపటంబున నపకారంబులు సేయుచున్న వీనిఁ గపటప్రకారంబునఁ బడవైచుట ధర్మహాని యై తోఁపదు; వీఁడు పాండవ యాదవ వంశవర్ధనుం డగు సుభద్రానందనుం దెగటార్చిన తెఱం గెఱుంగమే?’ యనిన నా బలదేవుండు బలు మొగంబుతో ‘నిట్టి చెనఁట గెలుపు గెలిచిన భీముండు వొగడు వడయుం గాక! రణధర్మంబు దప్పక పెనంగినట్టి ధర్మాత్ముం డైన దుర్యోధనున కుత్తమలోకం బయ్యెడు’ మనుచు నతనికిం జెప్పి రథాధిరూఢుం డై పాండవేయపాంచాలయదుప్రవరులు చిన్నంబోవ నిజపురంబున కరిగెఁ; దదనంతరంబ వాసుదేవుండు ధర్మపుత్రు నాలోకించు నెడ నతండు దీనాననంబుతోడ మానసంబు విషాదంబు నొంద నూరకున్న, నారాయణుం డతని కిట్లనియె. | 305 |
| ఆ. |
‘బంధునాశకుండు పాపాత్ముఁ డీసుయో | ధనుఁడు వీని సమరధరణిఁ గూల్చి శిరము దన్నె భీముఁ; డరయంగ నది యధ | ర్మంబె? నీకు నేల మఱుఁగఁ జెపుమ! |
306 |
| వ. | తలఁ దన్నువాఁడ నను ప్రతిజ్ఞయుఁ గీచకారాతికిం గలదు గాదె?’ యనిన విని కుంతీనందనుండు దేవకీనందనున కిట్లనియె. | 307 |
| క. |
‘కురుకులము పొలియుటకు మది | యెఱియంగా నున్న నాకు నితఁ డీరాజున్ శిర ముఱక తన్ని యిమ్మెయిఁ | బరిభవ మొందింప వగపు పాటిలకున్నే? |
308 |
| తే. |
ఇతఁడు వఱిచిన పాటులు హృదయకీలి | తంబు లై భీమసేనుండు తగవు మాలె నేమి సేయంగవచ్చుఁ? బోనిమ్ము పుణ్య | పాపచింత యిం కేటికిఁ బద్మనాభ!’ |
309 |
| వ. | అనుటయు ‘నట్ల కాక దీని నింత గొనియాడ నేల?’ యని యతండు భీమసేనపక్షపాతంబున నతనిచింత గీటునం బుచ్చె; వివ్వచ్చుండు నెఱయం బ్రియం బందని డెందంబుతోఁ గీడు మే లాడక యూరకుండె; నమ్మారుతి మోదం బెసఁగ మోడ్పుఁగేలు ఫాలతలంబున మోపికొనుచు నుత్ఫుల్లంబు లగు లోచనంబుల నొప్పి నిజాగ్రజుం జేరం జని యి ట్లనియె. | 310 |
| చ. |
‘పరిభవకారి యైన కులపాంసనుఁ డాహవభూమిఁ గూలెఁ ద త్పరమతి వైరముం బెనిచి పాపవినిశ్చయ కారకత్వని ష్ఠురు లగు దుస్ససేనుఁడును సూతసుతుండును సౌబలుండుఁ ద్రుం గి రితనికంటె మున్ను; మహికిం బతి వీవ! భరింపు మున్నతిన్.’ |
311 |
| వ. | అనిన విని ధర్మతనయుం డతని కిట్లనియె. | 312 |
| క. |
హరితలఁపు గూడఁ గురుపతిఁ | బరిమార్చితి, ప్రతినతోడఁ బగ దీర్చితి; నీ కరయంగ దైవబలవి | స్ఫురిత భుజాబలము లింత చొప్పడి యున్నే! |
313 |
| వ. | అని సంభావించె’ ననిన విని యాంబికేయుండు సంజయు నుద్దేశించి. | 314 |
| తే. |
‘అట్లు వడియున్న యక్కౌరవాధినాథుఁ | జూచి పాండుతనూజులు సోమకులును నేమి సేసిరి? నా కది యెఱుఁగఁ జెప్పు’ | మనుడు నతఁ డిట్టు లనియె నమ్మనుజపతికి. |
315 |
| వ. | ‘దేవా! యేమి సెప్పుదుఁ? బాండవులును బాంచాలురునుం దక్కటి భూపతులునుం గృష్ణసహితంబుగా నుబ్బునం బొంగి చీరలు వీచువారును విండులు విసరువారును గుణధ్వని సేయువారును శంఖంబు లొత్తువారును భేరీపణవాదులు మ్రోగించువారును బెలుచ నార్చువారును నయి పేర్చినం బృథివికి వ్రేఁగగు నట్లుండె నిత్తెఱంగునం జెలంగి మారుతిసూరెలం జేరి యిట్లనిరి. | 316 |
| మ. |
‘గదనే ర్పెక్కుడు గల్గు దర్పఘనుఁ డీ కౌరవ్యరాజన్యుఁ డు న్మదలీలం బయి నట్లు బె ట్టుఱికిన న్వంచించి పో కిట్లుసే యుదె? నీవాటునఁ బెన్దొడల్ విఱిగి వీఁ డుర్విం బడెన్ మాకు నొ ప్పు దలిర్పం బులకాంకురంబు లెసఁగం బో విప్పుడుం జూడుమీ! |
317 |
| ఆ. |
పరులచేతఁ గాని పని యైనవృత్ర వ | ధంబుఁ బోని యరివధంబు నిర్వ హించియున్న నిన్ను నే మింద్రుఁ గొనియాడు | నమరులట్ల పొగడెదము సెలంగి. |
318 |
| క. |
అవమానంబులు సేసిన | యవినీతుల దుస్ససేనుఁ డాదిగఁ గలవా రి వధించి యడుగు పగతుని | యవుదల నిడి; తింతవార లవనిం గలరే?’ |
319 |
| వ. | అని మఱియు ననేకప్రకారంబుల బ్రశంసించిరి; భీముచేసిన గదాసమర ధర్మవిరోధంబు లాఁతి రాజులమనంబుల నుండునో? యని శంకించి కృష్ణుం డెల్లరాజులం గలయం గనుంగొని యిట్లనియె. | 320 |
| చ. |
‘చక్కటి లేని యాలమునఁ జంపె ననన్ వల; దీదురాత్మకుం డక్కటికంబు లేక సతి నంతలు సేసిననుం గృపారతిం దక్కక తండ్రిపా లడిగె ధర్మజుఁ; డన్నెఱి సేయఁ డయ్యె; వీఁ డుక్కివుఁ; డిట్టి చావునకు యుక్తుఁ డగుం దలపోసి చూడఁగన్. |
321 |
| క. |
విదురాదులు సెప్పఁగ ను | న్మదుఁ డై యీఁడయ్యెఁ దగినమాత్రయు భూసం పద వీఁడు పాండవుల కిది | యది యగునె బకారి ప్రతిన కగ్గం బైనన్. |
322 |
| ఆ. |
నేలఁ గూలి మ్రాను వోలె నిట్లున్నయి | ప్పాపకర్ము గుఱిచి పాడితెఱఁగు తేటవడఁగ మాటలాట దానేల ? మీ ! రెక్కుఁ డరదముల మహీశులారా ! |
323 |
| వ. | అని యిట్లు పుండరీకాక్షుండు దన్ను నాక్షేపించుట యాకర్ణించి కౌరవేశ్వరుండు గోపాయత్తచిత్తుండై పిఱుందు మోవ లేచి చేతుల భూతలం బూఁదికొని బొమముడితోడి చూడ్కి యతనిపయిం బఱపె, నప్పు డపరభాగంబు విఱుగ వ్రేటు వడి యలిగి తల యెత్తి చూచు మహానాగంబు చందంబు దోఁచె; నట్లు ప్రాణాంతకరణం బైన వేదనాభరంబు దలంపక కూర్చుండి మున్నాకృష్ణుండు జిష్ణుతోడ సంభాషించుటయు, నతం డూరుతలంబుఁ గరపుటంబున నప్పళించుటయు వెడవెడ గనుటం జేసి భీమువాటునం దొడలు విఱిగి పడినప్పు డప్పటి బుడిబుడిమాటలు నా సన్నయు దీనికిం గాకేమి? యని యూహించి, చేయునది లేక యవుడు గఱచుచున్న వాఁ డగుట నగ్గోపాలదేవునితో ని ట్లనియె. | 324 |