పురాణేతిహాసములు శ్రీమహాభారతము శల్యపర్వము - ద్వితీయాశ్వాసము
తొడలు విఱిగి పడిన దుర్యోధనుఁడు కృష్ణు నాక్షేపించుట (సం. 9-60-27)
సీ. ‘కంసదాసునిపుత్ర! కానవు నీ దురా | చారంబుఁ, గృపయు లజ్జయును లేక
ప్రేలెదు; నీవు సెప్పినఁ బార్థు చేసిన | సన్న గై కొని గదాసంగరంబు
పాడి దొఱంగి యిప్పాపకర్ముఁడు వైచెఁ | గాక; చక్కటి తోడికయ్య మైన
లీల మిమ్మందఱ నేలపాలుగఁ జేయ | నే? శిఖండి గడంగి యేసె ననఁగ
 
తే. నర్జునుఁడు శాంతనవుఁ గూల్చునట్లు చేసి; | తస్త్రగురుచావునకుఁ బాండవాగ్రజన్ము
బొంకు మని పంచి; తరదంబు పుడమిఁ గ్రుంగఁ | గర్ణుఁ జంపించి; తే మనఁ గలదు నిన్ను?
325
క. భూరిశ్రవుఁ డొక్కనితోఁ | బోరఁగ నేయించి తట్లు; పొడిచీఁకటి నం
హోరహితు సైంధవుని నరు | బారిపఱిచి; తిట్టి నీకుఁ బల్కులు సనునే?
326
క. నను భీష్ము గురుని సూతసు | తుని భూరిశ్రవు జయద్రథుం జక్కటి ద
ప్పనియనిఁ గోల్పుచ్చఁగ వ | చ్చునె నీకుం గపటశూర! సుచరితదూరా!’
327
వ. అనిన విని యచ్యుతుం డతని నవలోకించి ‘నీవు భీముని బాలునిఁ బాములం గఱపించియు విషం బిడియు నీటం ద్రోచియుం బలుమాఱుం జంప దెగితివి; గొంతియుఁ గొడుకు లేవురును నిద్రించుసమయంబున జతు గృహంబు దహించితివి; ధర్మోత్తరచరిత్రుం డగు నజాతశత్రుసంపదలఁ గపటద్యూతంబున నపహరించి; తంత దనివిం బోక యాజ్ఞసేని నేకవస్త్ర రజస్వలం గొలువులోపల భంగపెట్టి తాప్రొద్ద నిన్ను నిట్టి దురవస్థకుం దేరం దగి యుండ నట్లు పోయి సమయంబు నడపి నీచేసిన సకల దుష్కృతంబులు సహించిన యిప్పాండవాగ్రజుండు వనుప నేను బుడమిపా లడుగ వచ్చిన నీ నేరవైతి; నీ నేరమి నిట్లైతి; భవదీయం బగులోభంబునం బాపనిశ్చయంబున మదంబున శాంతచిత్తు లగుశాంతనవద్రోణులకుం బ్రాణహాని వాటిల్లె; వినుము! ద్రుపదుని తపోయజ్ఞ ప్రభావంబుల నదియ పనిగా జనియించిన శిఖండిధృష్టద్యుమ్ను లాభీష్మ గురులమరణంబులకుఁ గారణంబులు గాక తక్కుదురే? పెక్కండ్రతోడం బోరి డస్సినసాత్యకిం జంపువాఁ డైన భూరిశ్రవుం జంప కుందుమే? యనేకప్రౌఢ యోధు లొక్కరుని బాలు సౌభద్రుం బొదివి చంపినం బూనినపూన్కి నిఖిలోపాయంబుల నెఱపక పుణ్యాత్మయైన పాంచాలి నరణ్యంబునం బరిభవించిన పాపాత్ముని సైంధవుని బ్రదికిపో విడిచి యర్జునుం డగ్నిం బ్రవేశించునే? యి న్నీతిపరుల చరిత్రంబులు నిర్మలంబులు; ఘోషయాత్ర నిన్ను గంధర్వులు పట్టుకొని పోవునప్పుడు నీ వారెల్లం బాఱిన నర్జునుండు నిన్ను విడిపించుట యెఱుంగవే? గాంగేయకుంభజకర్ణాశ్వత్థామ కృపు లుద్దామ సమగ్రసైన్యంబులతోడ నడవ నీవు విరటుని గోవులం బట్టికొని పోవు చోట మీరందఱుఁ దనసమ్మోహనాస్త్రంబున మూర్ఛితులైన సమయంబున నర్జునుండు నిన్నుం గాచుట యెఱుంగ రాదె? నీ వాపాదించిన పాపంబుల కెల్ల మూలం బైన కర్ణునరదంబు ధరణిం గ్రుంగినఁ గవ్వడి వాని నేయ కేల కాచికొని యుండు? నుండె నేనియు భూసుర శాపంబున నట్లైనరథంబునకు నిష్కృతి గలుగునే? కావున నన్నీచు సమయించుట సముచితంబు; యుధిష్ఠిరుండు శల్యుం దెగటార్చిన తెఱం గొప్పునొప్ప దని యుగ్గడింపక మేలు సేసితి; పాండునందనులు పుట్టినంతటినుండి నేఁడు దుదిగా నీయెడ ధర్మవిరోధం బాచరింపరు; కురుకులంబునకు గుద్దలి గొని దుర్ద్యూతంబు నీవు తొడరితి; దాన నింతలు వుట్టెఁ; బవనుపట్టి పట్టినప్రతిన యెఱుంగవె? గద నూరుభంగంబు సేయుదు నని పలికి పిడికిటం బొడుచునే?’ యవి ‘యెల్లను వృథాజల్పంబు లూరకుండు’ మనుటయు నజ్జననాథుండు జనార్దనున కి ట్లనియె. 328
చ. ‘చదివితి నెల్ల వేదములు, జన్నము లొప్పఁగ జేసితిన్‌, రమా
స్పద మగువృత్తిఁ బొల్చి నరపాలకు లెల్లను గొల్వఁ గంటి, దు
ర్మదరిపు గాఢగర్వపరిమర్దన కేళి యొనర్చితిం, దగం
దుది నని మిత్రబాంధవులతోఁ ద్రిదివంబున కేఁగు టొప్పదే?
329
వ. నీకుం జూడ నెట్టివాఁడ నైనను నా కేమి? మీరింకఁ బశ్చాత్తాపదుఃఖితు లగుచు నుందురు గాక’ యనియె; నప్పు డతనిపైఁ బుష్పవర్షంబులు గురిసె, దేవదుందుభులు మొరసె; దిశలు దెలివొందెం; మృదుసమీరణంబు సుగంధి యై వీతెంచె; నంతయు ననుసంధించి యక్కౌంతేయులు దారు ధర్మంబు దొఱంగి గాంగేయద్రోణ కర్ణశల్యదుర్యోధనాదుల వధించుట యత్తఱిం గ్రొత్తయై తోఁచినఁ, జిత్తంబుల వగయు లజ్జయు మిగులం బొడమి మొగంబులఁ దోఁప విన్ననై యున్నం జూచి వెన్నుండు తత్సమీపంబునకుం జని వారలతో నిట్లనియె. 330
సీ. ‘గాంగేయ గురు కర్ణ కౌరవపతులఁ జ | క్కటి యనిఁ బరిమార్పఁ గాన మైతి
మని మీరు వగవకుఁ; డద్దొర లుగ్రాస్త్ర | వేదులు, ప్రస్ఫుటవిక్రమమున
నడరి వారల గెల్చు టరిది గావున నేను | బహువిధోపాయముల్‌ వన్ని యిట్లు
దీర్చితిఁ గాక, యత్తీవ్రపరాక్రము | లలఁతులఁ బోదురే? యట్లుఁ గాక
 
తే. వారి విధి యివ్విధమునఁ జావంగఁ జేసె | దైవఘటనలు దప్పింప మీవశంబె?
సురలు దనుజులు గెల్చిన చొప్పు లిట్ల; | సంతసపు సమయంబున వంత లేల?
331
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )