పురాణేతిహాసములు శ్రీమహాభారతము మౌసలపర్వము - ఏకాశ్వాసము
శ్రీకృష్ణుఁడు శరీరంబు విడిచి పరమపదంబునకుఁ బోవుట (సం. 16-5-22)
సీ. ఊర్థ్వలోకమునకు నూర్జిత తేజస్కుఁ | డగు కృష్ణుఁ డరిగిన నచటి దివ్య
మునివరులును సిద్ధులును రుద్రవసుమరు | దాదిత్య విశ్వముఖామరులును
సంక్రందనుండును సంభృతసంభ్రము | లగుచు భక్తియు వినయంబు నెఱయఁ
గా నెదుర్కొని చరణానతులై పర | మస్తుతి వాక్యముల్‌ విస్తరిల్ల
 
ఆ. బలసి; రందు దేవపతి యల్లఁ జేరి క | రములు మొగిచి ‘ధర్మరక్షణమున
కై దయావిధేయమగు ఖేలనంబున | నవని నవతరించి తాది పురుష!
086
ఆ. అవతరించి కంసుఁ డాదిగాఁ గల దేవ | శత్రుకోటి నెల్ల సమయఁ జేసి
భరతకులము కసటు వాపి సంశుద్ధప్ర | తిష్ఠఁ గూర్చి యరుగుదెంచి తీశ!
087
క. అమృతం బజరం బవ్యయ | మమలం బవితర్క్య మచల మాగమగమ్యం
బు మహాత్మ! భవత్పద మ | య్యమేయ తత్త్వంబుఁ బొందు మనిరూప్యగతిన్‌.
088
క. కృప నిట్ల యవతరింపుము | ప్రపన్నులగువారి యార్తిఁ బాపుటకై య
జ్ఞపురుష! యుగయుగమున న | త్యపరిమిత గుణాఢ్యరూప మభినుతి నొందన్‌.’
089
క. అని నిభృతిఁ బలుక నా సువ | చనముల నత్యాదరం బెసఁగ వినిన ముకుం
దునిపైఁ బెల్లు గురిసె న | య్యనిమిషపతి పుష్పవర్ష మతులితభక్తిన్‌.
090
ఉ. అప్పుడు బ్రహ్మ వచ్చి హరియంఘ్రులకుం బ్రణమిల్లి భక్తిమైఁ
దప్పక చూచుచున్‌ మది ముదంబునఁ దేల సలక్షణస్వరం
బొప్పి చెలంగ నాగమిక సూక్తులఁ బ్రస్తుతి సేసెఁ బ్రీతుఁడై
యప్పురుషోత్తముండు కరుణార్ద్ర నిరీక్షణమున్‌ నిగుడ్పఁగన్‌.
091
సీ. అప్పరమేశ్వరుం డయ్యందఱను జూచి | ‘యనిరుద్ధ నామకంబైన యదియుఁ
బ్రద్యుమ్నతాప్రతిభాసమానమును సం | కర్షణభావ వికాసితంబు
వాసుదేవాత్మక వరరూపమున నేక | తా విభవత్సమాధానసిద్ధి
నొందించుకొంటి నానందబోధ నిరం జ | నామేయ మత్పదప్రాప్తి పరమ
 
ఆ. మంగళానుభూతి నంగీకరించెద | సుఖుల రగుఁడు మీరు సుకృతులార!’
యనిన వచనసమితి యతిమృదుమధురత | నింపు నొసఁగ నలరి రెల్లవారు.
092
క. ఆ దేవదేవుఁ డత్యం | తాదరసంభాషణంబు లమ్మెయి బ్రహ్మేం
ద్రాదులతోడ నొనర్చి య | నాది నిరవసాన నిజపదాస్థితుఁ డయ్యెన్‌.
093
తే. ఇంద్రియాగోచరుం డైన యీశు నపుడు | బుద్ధిఁ జూచుచు నిర్భరాద్భుతకరంబు
లగు తదీయగుణమ్ముల నభినుతించు | చరిగి రాత్మవాసముల కజాదులెల్ల.
094
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )