| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శల్యపర్వము - ద్వితీయాశ్వాసము |
| మ. |
‘గద నా చేతికి వచ్చినప్పుడు మహోగ్రక్రీడమై లోకము ల్పదునాల్గున్ సమయింతుఁ బొ మ్మను సముల్లాసంబు న న్నొందు; దు ర్మదసంరంభ వికత్థనుం డయిన కౌరవ్యాధముం డెట్లు నా కెదు రై ప్రాణముతోడఁ బోవు? నృపు నిట్లే లొత్తె దీమాత్రకున్? |
118 |
| తే. |
వాని గద భారమునకు నొవ్వకయు నాదు | పటుగదాదండ ముద్దండ బాహుదర్ప లీల విలసిల్ల వ్రేయుదు నేలఁ గూల | సంతసముతోడి మెచ్చు పుట్టింతు నీకు.’ |
119 |
| వ. | అనుటయు నచ్యుతుండు ప్రియం బెసంగ నాకిమ్మీరమర్దను మొగంబునఁ జూడ్కి నిలిపి. | 120 |
| మ. |
‘బకవిధ్వంసన మాచరించితి; హిడింబప్రాణముల్ గొంటి కీ చకనిర్మూలనకేలి సల్పితి జరాసంధాంగక స్వైర భం జకలీలన్ విలసిల్లి తీ వవి మనుష్యస్ఫూర్తి మాత్రంబులే? యొక మర్త్యుం డెదు రెట్లు నీకు? మది నే నూహింప కి ట్లాడితిన్. |
121 |
| క. |
కాళింగాదిక్షోణీ | పాలుర నున్మదమహాద్విపప్రకరములన్ నేల నిడి కాలఁ జమరితి | వాలిన కురునృపకుమార వర్గంబులతోన్.’ |
122 |
| వ. | అని పలికి కురుపతిదెసఁ గటాక్షవీక్షణంబు నిగుడ వెండియు. | 123 |
| తే. |
‘వాలి దుశ్శాసనుని ఱొమ్ము వ్రయ్యఁ జీరి | నీవు నెత్తురు ద్రావంగ నిన్ను నతఁడు సూచుచుండియు వెఱసొచ్చి స్రుక్కెఁగాక | కవియఁజాలెనె నీపయిఁ బవనతనయ? |
124 |
| చ. |
అగపడి కచ్చువెట్టి యితఁ డాడినమాటల కిప్డు బల్లిదుం డుగఁ గొని యేను బల్వురుఁ గడు న్వడి నీతనిఁ జంపకుండ నే మిగ సమయంబు సేసి తిది మేలొకొ? యంటి నృపాలుతోడ నీ మగఁటిమి చందముల్ దలఁచి మారుతనందన! యూఱడిల్లితిన్. |
125 |
| చ. |
తులువతనంబునన్ సభకు ద్రోపది ముందల వట్టి యీడ్చి య ట్లలఁపఁగఁ జూచి నీవు దగ నాడిన రెండు దెఱంగులందుఁ బెం పొలయఁగ దుస్ససేనుపని యొక్కటి దీర్చితి; తీర్పు మింక బా హుల కసివోవ వీనిపనియుం ద్వరితక్రమవిక్రమంబునన్. |
126 |
| తే. |
పరజయము నొంది కట్టుము పట్ట మఖిల | ధరణి రాజ్యంబునకు ధర్మతనయుఁ బ్రీతి బంధులకు నెల్లఁ గన్నులపండు వగుచు | నీవుఁ దమ్ములు సుఖవృత్తి నెలవుకొనుఁడు!’ |
127 |
| వ. | అని మఱియును. | 128 |
| చ. |
‘బరవస మొప్ప నీవు గదపండువు సేయఁ దలంచి తాఁకినం గురుపతి నిర్జితుం డగుటకుం బవనాత్మజ! యేను బూఁట; పో టరితన మెల్లఁ జూపుము; కడంగుము నీ’ వని యేలిమాటమై నరవర! ధర్మసూనుఁడు వినన్ విజయం బొసఁగెన్ మఱందికిన్. |
129 |
| వ. | ఇవ్విధంబున వృకోదరునకు మనోజయప్రదంబు లగు మాట లాడి ‘దుర్యోధనుండు దండిమగండు; శ్రమంబునుం జాలఁగలఁడు; నీ వతిప్రయత్నంబునుఁ బెనంగవలయుఁ జుమ్మీ!’ యని పలికె; నప్పుడు సాత్యకి యా సమీరనందను నగ్గించెఁ, బాంచాలురుఁ దక్కునుంగలుగు ధరణీశులు నబ్బలుమగనిఁ బ్రశంసించి; రతం డగ్రజునాననం బాలోకించి. | 130 |
| చ. |
‘వినుము నరేంద్ర! యేను బలవిక్రమముల్ వొగడొంద నిక్కుల ఘ్నునిపయి నామనంబు నతికోపము; పార్థుఁడు ఖాండవంబునం దనలముపర్వఁ జేసినటు లగ్గలికన్ నిగిడించెదన్; గదం గొనియెదఁ బ్రాణముల్; మహి యకుంఠితశాస్తిగ నేలు మంతయున్. |
131 |
| ఆ. |
మహితకీర్తి పుష్పమాలికఁ బూన్చెద | నిన్నుఁ జీకురాజు నేఁడు వనరుఁ గాక! శకుని బుద్ధికతమునఁ దమ కింత | పుట్టె నని తనూజుపొలియు టెఱిఁగి.’ |
132 |
| వ. | అని పలికి సన్నాహంబు శోభిల్లుచుండ గదాదండంబుఁ గేల నమర్చి వృత్రున కభిముఖుం డగు వాసవుండునుం బోలె దుర్యోధనుదిక్కు మొగంబై నిర్వ్యూహం బైన శుండాలంబు చందంబున నున్న యన్నరపతిఁ గనుంగొని తమయన్నయుఁ దమ్ములు నెమ్మనంబుల సంతసిల్లఁ దానును సమరోల్లాసభాసితుం డగుచు నతని కిట్లనియె. | 133 |
| ఉ. |
‘ఇట్టిది క్రూరకర్మ మని యించుక కొంకక లక్కయింటఁ జి చ్చొట్టితి మాయజూదమున నుత్తము ధర్మజుఁ దూలఁ బుచ్చి తా చుట్టలుఁ బెద్దలుం జెలులుఁ జూడఁగ ద్రోవది భంగపెట్టి తి ట్ట్టట్టన కింకఁ దత్ఫలము లన్నిటి నొందుము చేరి తగ్గ మై. |
134 |
| సీ. |
గాంగేయకుంభజ కర్ణశల్యాదులు | నీకుఁగాఁ బెనఁగి యనేకబంధు మిత్రులు మడిసిరి ధాత్రీపతులఁ దోడు | దెచ్చితి పలువురఁ జచ్చి రంత వట్టువారును దోడఁబుట్టువు లెల్లను | గూలి; రంతటికిని మూల మైన శకుని గీటడఁగె; నిం కొకరుఁడ వీ వున్న | వాఁడవు; విను! నిన్ను నేఁడు నాదు |
|
| తే. |
గదకు నెర సేసి లోకంబు కల్మషంబు | లేను బాపెద; నీరజ్జు లేల? నాకుఁ జక్కనై రమ్ము మద్భుజాస్తంభశుంభ | దుగ్రకేళికిఁ బాత్రమై యోట దక్కి’. |
135 |
| చ. |
అనుడు నెదిర్చి నీతనయుఁ డాతని కిట్లను ‘నేల రిత్త గ ర్జనములు? గానవే పటు భుజాకలితోగ్రగదా సముద్భటున్ నను? నిటు రమ్ము! సూపుము రణంబున నీదుబలంబుఁ జేవయున్; మన మిటు చేరి నిల్చి వెడ మాటల నాడుచు నున్కి యొప్పునే? |
136 |
| క. |
వినుము గదారణమున ననుఁ | జెనయఁగ వాసవున కైనఁ జెల్లదు; నీ వీ యనిఁ బాడి దప్ప కుండఁగ | బెనఁగుము ప్రాణంబుతోడఁ బ్రిదిలెదు భీమా!’ |
137 |
| వ. | అనిన విని పాంచాలురుం దక్కిన జనపాలురుం బ్రశంసించి మత్తమాతంగంబుఁ దాలశబ్దంబుల నుబ్బం జేయునోజ రారాజుఁ బ్రహర్షంబు నొందించిరి; గజబృంహితంబులు హయహేషితంబులును జెలంగె నాయుధంబు లెక్కుడు మెఱుంగులఁ బొలిచెఁ; దదనంతరంబ యెల్లవారును నెడగలుగఁ గూర్చుండి రమ్మహావీరులు దలపడువారై వీరోద్రేకంబునం జేసి యతిలోకం బగు నవష్టంభంబున విజృంభించి యొండొరుల నవలోకించి రట్టియెడ. | 138 |