పురాణేతిహాసములు శ్రీమహాభారతము మౌసలపర్వము - ఏకాశ్వాసము
ధర్మరాజు రాజ్యంబున నుత్పాతంబులు దోఁచుట (సం. 16-1-1)
క. దేవా! జనమేజయ ధా | త్రీ వల్లభునకు నుదాత్త తేజోదీప్తుం
డా వైశంపాయనుఁడు ప్రి | యావేశస్మేరచిత్తుఁడై యి ట్లనియెన్‌.
002
సీ. భారత సంగ్రామపారీణుఁడై జయ | రమ యుల్లసిల్ల సామ్రాజ్యమునకుఁ
బాండవముఖ్యునిఁ బట్టంబు గట్టిన | యది యాది గాఁగ ముప్పదియునైదు
సంవత్సరంబులు సన ననంతర వత్స | రంబునఁ బ్రజకు భయం బొనర్చు
నుత్పాతములు పుట్టె నుర్వీశ! విను మహా | వాయువు శర్కరావర్షి యగుచు
 
ఆ. వీచు, నర్కునుదయవేళల బింబంబు | బలసి తోఁచు, ఘనకబంధసమితి
నీరదములు లేక నిర్ఘాతపాతముల్‌ | గలుగు నుల్క లెల్లకడల డుల్లు.’
003
క. పరివేషము లినరజనీ | కరులకు నతిరూక్ష రుచులు గలిగి కలుగు నం
బరమెల్లఁ గప్పి వేసవిఁ | బరఁగుం బెనుమూడ మంచు పౌరవముఖ్యా!
004
సీ. ఇ ట్లనుదినమును నెన్నియేనియును మహో | త్పాతములు పుట్టుచుండఁ గొంత
కాలంబువోవఁగఁ గౌంతేయముఖ్యుండు | వినియె నొండొరులతోఁ బెనఁగి సర్వ
యాదవులును దెగి రంబుజనాభుండు | హలధరుండును దక్క నని నరేంద్ర!
విని భీమసేనుని వివ్వచ్చు నకులుని | సహదేవు రావించి సంభృతార్తి
 
తే. యగుచు నవ్వార్త యెఱిఁగించె నందఱకును; | వార లేవురు నెవ్వగల్‌ గూరు మాన
సములు గలఁగ నత్యంత విషణ్ణులైరి | సకలజనకోటులును శోకజలధి మునుఁగ.
005
తే. అనిన విని యమ్మహీపతి యాదవులకుఁ | బోరు దమలోనఁ గలిగిన కారణంబు
వారి వృత్తాంతములు వినవలతుఁ జెప్పు | మనుడు నమ్ముని యిట్లను నతనితోడ.
006
క. ‘ద్వారవతికిఁ గణ్వుండును | నారదమునివరుఁడు గాధినందనుఁడును బెం
పారంగఁ దొల్లి వచ్చిరి | నారాయణుఁ జూచువేడ్క నరవరముఖ్యా!
007
సీ. చనుదెంచి పురవీథిఁ జనునవసరమున | వృష్ణి కుమారులు విధివశమున
మనముల నవినీతి జనియింప సాంబున | కంగనాలంకార మమరఁజేసి
కొనివచ్చి యమ్మహామునివర్గమునకు మి | థ్యావినయమున వందన మొనర్చి
నిభృతులై కారుణ్యనియతాత్ములార! యీ | భామిని బభ్రునిభార్య ప్రజలఁ
 
తే. గనునె యిది? యని యడిగిన కౌరవేంద్ర! | యత్తపోధనవర్యు లయ్యాగడమున
కాత్మలందుఁ గ్రోధానల మగ్గలముగ | నెలయ నక్కుమారులతోడ నిట్టు లనిరి.
008
క. అంబుజనాభుని కొడు కీ | సాంబుఁడు గను యాదవక్షయాపాదన క
ల్యంబగు ముసలము; మావచ | నంబున కనృతంబు లేదు; నమ్ముఁడు మీరల్‌.
009
సీ. దామోదరుఁడు హలధరుఁడును దక్కంగ | యాదవులెల్లరు నమ్ముసలము
నద్భుతశక్తి గీటడఁగుదు రబ్బల | దేవుండు దనదైన దేహ మధిక
నిష్ఠమై విడిచి వార్నిధిఁ బ్రవేశించు | భూశయ్య నుండంగ నాచక్రధరుని
జర యను రాక్షసి వెరవునఁ బట్టి క్ర | మించుఁ బొం’ డని చెప్పి, మెచ్చు గాదు
 
ఆ. మనము కృష్ణు నింకఁ గను టనియెడుబుద్ధి | నమ్మహామునీంద్రు లపుడు మరలి
యాత్మవాసములకు నరిగిరి; తదనంత | రంబ కృష్ణుఁ డవ్విధంబు వినియె.
010
క. విని కాలవేది యగు న | వ్వనజాక్షుఁడు నియతి యగు నవస్థకుఁ దలఁపం
జన దన్యథాత్వకరణం | బని యూహించుచు నుపేక్ష యాత్మ నొలయఁగన్‌.
011
క. తన చుట్లనున్న బంధులఁ | గనుఁగొని ‘యిట్టిది విధాతృకరణీయం బి
ప్పని మనవారల యొప్పని | తనమున మూఁడెనని వంతఁ దలపోయకుఁడీ.’
012
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )