పురాణేతిహాసములు శ్రీమహాభారతము మౌసలపర్వము - ఏకాశ్వాసము
మునిశాపంబున సాంబుని కడుపున ముసలంబు పుట్టుట (సం. 16-2-15)
సీ. అని పల్కి యభ్యంతరావాసమున కేఁగె; | మఱునాఁడు సాంబకుమారు కడుపు
లోనుండి జముదూతవోని భయంకర | నిష్ఠురముసలంబు నిర్గమించె;
దానికి నత్యద్భుతంబును భయమును | గదురంగ వసుదేవుకడకుఁ బాఱి
బంధు లయ్యాదవపతి కెఱిఁగించిన | నలఁదురి వెలువెల్లనగుచుఁ గొంత
 
తే. ప్రొద్దు నివ్వెఱఁగంది యా భూవరుండు | కడురయంబున రోఁకలి పొడిగఁజేసి
వనధిలోపలఁ జల్లంగ వారిఁ బనిచె; | వారలును నట్ల చేసిరి కౌరవేంద్ర!
013
క. మునిశాపశక్తి మానుష | మునఁ ద్రోవఁగ రామి యుల్లములఁ దలఁపక య
జ్జనపతియు బాంధవులు న | ట్లొనర్చి యూఱడిలి యుండి రుర్వీనాథా!
014
క. పదపడి ధృతరాష్ట్ర మహిషి | యదయహృదయయై సమస్తయాదవులకు బె
ట్టిదమగు శాపం బిచ్చుట | విదితమయిన నజ్జనములు వెఱచుచునుండన్‌.
015
క. కాలం బగుటయుఁ గురుభూ | పాలోత్తమ! యాదవేంద్రు పట్టణమున హృ
త్కాలుష్యసమాపాదన | శాలిమహోత్పాతముల్‌ ప్రజాతము లయ్యెన్‌.
016
తే. అరుణములు ఘూర్ణితంబులు నైన లోచ | నములు మెఱయ మహోగ్రదండము ధరించి
తిరుగు నొక్కొక్కచోటను దృశ్యుఁడగుచు | నంతకుం డిదె యదె తోఁచె ననఁగ నధిప!
017
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )